- సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా సుపరిపాలన
- ఐదేళ్లుగా ప్రజలు కోల్పోయిన స్వేచ్ఛను అందిస్తాం
- ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తాం
- పోలవరం పరుగులు పెట్టిస్తాం
- సాగును లాభసాటిగా చేస్తాం
- కక్ష సాధింపులుండవ్, తప్పు చేసినవారిని వదిలేది లేదు
- ప్రజారోగ్యానికి ప్రాధాన్యత
- యువత కోసం నైపుణ్య గణన
- స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు ఉద్ఘాటన
విజయవాడ(చైతన్యరథం): గత ఐదేళ్లలో దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌ను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో గురువారం జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఆసేతు హిమాచలం అత్యంత ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్న వేళ భారతావనికి స్వేచ్ఛా స్వాతంత్య్రాలు అందించిన జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్, త్రివర్ణ పతాక రూపకర్త, మన తెలుగు బిడ్డ పింగళి వెంకయ్య లాంటి మహనీయులను, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ముందుగా ఘన నివాళులు అర్పిద్దామన్నారు. గత ఐదేళ్లుగా ప్రజలు కోల్పోయిన స్వేచ్ఛను అందించేందుకు కట్టుబడి ఉంటామన్నారు. తమ ప్రభుత్వంలో కక్ష సాధింపులు ఉండవని, అయితే తప్పు చేసినవారిని మాత్రం చట్ట ప్రకారం శిక్షించి తీరతామన్నారు. ప్రజలకు ఉపయోగపడే విధానాలు రూపొందిస్తున్నాం. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పాలనకు శ్రీకారం చుట్టాం. 100 రోజుల ప్రణాళిక టార్గెట్‌గా అన్ని శాఖల్లో సమీక్షలు చేస్తున్నాం. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన శాఖల్ని పునరుద్ధరిస్తున్నామన్నారు.
రాజధాని లేని పరిస్థితుల నుంచి..
విభజనతో ఏర్పడిన నవ్యాంధ్రకు రాజధాని కూడా లేని పరిస్థితిలో నాడు పాలన ప్రారంభించాం. అటువంటి పరిస్థితి నుంచి ప్రభుత్వాన్ని పట్టాలెక్కించాం. రాజధాని లేని రాష్ట్రమని బాధతో కూర్చోలేదని, సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకొని.. ప్రజలందరూ గర్వించేలా రాజధానికి శంకుస్థాపన చేసుకున్నామని తెలిపారు. ప్రజల సహకారంతో 34వేల ఎకరాల భూసేకరణ చేశామని వెల్లడిరచారు. మాకున్న అనుభవం, ప్రజల సహకారం, కష్టపడే తత్వంతో కొద్ది కాలంలోనే నిలదొక్కుకున్నాం. సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలకు రూపకల్పన చేసుకుని వేగంగా ముందుకు సాగాం. దేశంలో ఎవరూ ఊహించని విధంగా సంస్కరణలతో, సమర్థవంతమైన నిర్ణయాలతో, సరికొత్త పాలసీలతో 13.5 శాతం వృద్ది రేటుతో దేశంలో టాప్ 3 రాష్ట్రాల్లో ఒకటిగా సగర్వంగా నిలబడ్డాం. 120కి పైగా సంక్షేమ పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ప్రథమ స్థానంలో నిలిచాం. రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుని దేశం దృష్టిని ఆకర్షించాం. 2014 – 2019 కాలంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అనూహ్యంగా దూసుకుపోయింది. దేశంలో నాడు ఆంధ్రప్రదేశ్ ఒక పెద్ద బ్రాండ్ గా ఆవిష్కృతమైందని సీఎం చంద్రబాబు అన్నారు.
మీ ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చుతాం
ప్రజలు ఎంతో నమ్మకంతో కూటమి ప్రభుత్వానికి ఏకపక్షంగా పట్టం కట్టారు. కొత్త ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశలు, ఆకాంక్షలు పెట్టుకున్నారు. వాటిని నెరవేర్చేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని మేం తెలియజేస్తున్నాం. గత 5 ఏళ్లు ప్రజలు ఏ స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు కోల్పోయి క్షోభను అనుభవించారో.. ప్రజలకు ఆ స్వేచ్ఛను తిరిగి అందించేందుకు కట్టుబడి ఉన్నామని ఈ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సాక్షిగా ప్రకటిస్తున్నాను. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మళ్లీ 5 ఏళ్ల తరువాత స్వాతంత్య్రం లభించింది. ప్రజలకు ఉపయోగపడే విధానాలు రూపొందించి సంస్కరణలకు మానవీయ కోణాన్ని జోడిరచి పాలన అందించడమే సుపరిపాలన. అలాంటి సుపరిపాలనకు తొలిరోజు నుంచే నాంది పలికింది మన కూటమి ప్రభుత్వం. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పాలనకు శ్రీకారం చుట్టామని సీఎం చంద్రబాబు అన్నారు.
ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి విధ్వంస పాలన
120కి పైగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, శాంతి భద్రతలు, అందరికీ ఉపాధి, పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలతో రాష్ట్రం దూసుకుపోతున్న క్రమంలో 2019లో వచ్చిన ఎన్నికల ఫలితాలు రాష్ట్రాన్ని చీకటి మయం చేశాయి. ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన పాలకులు కనీవినీ ఎరుగని విధ్వంసాన్ని సృష్టించారు. ప్రజావేదిక ధ్వంసంతో ప్రారంభమైన నాటి విధ్వంస పాలనతో సంపద సృష్టి, ఉపాధి కల్పనా కేంద్రమైన ప్రజా రాజధాని అమరావతిని పురిటిలోనే చంపే ప్రయత్నం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించారు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్, గంజాయి, డ్రగ్స్, ఎర్రచందనం, రేషన్ బియ్యం మాఫియాలతో రూ. లక్షల కోట్ల ప్రజాధనం కొల్లగొట్టారు. పోలవరం ప్రాజెక్టును నాశనం చేసి రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేశారు. గత ప్రభుత్వం అసమర్థ విధానాలతో రాష్ట్ర అప్పులు రూ.9.74 లక్షల కోట్లకు చేరుకున్నాయి. తలసరి అప్పు రూ.74,790 నుండి రూ.1,44,336కు పెరిగింది. తలసరి ఆదాయం 13.2 శాతం నుండి 9.5 శాతానికి తగ్గింది. గత ప్రభుత్వ విధ్వంస, దోపిడీ విధానాలతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి పోయింది. స్టేట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పేరుతో రైతు బజార్లు, కలెక్టర్ కార్యాలయాలు తదితర ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు. మద్యం అమ్మకాలపై భవిష్యత్ లో వచ్చే ఆదాయాన్ని సైతం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు. రాష్ట్ర విభజన కంటే కూడా 2019 – 24 మధ్య జరిగిన రివర్స్ పాలన వల్లనే రాష్ట్రం ఎక్కువ నష్టపోయిందని సీఎం చంద్రబాబు తెలిపారు.
పోలవరాన్ని ముందుకు తీసుకెళ్తాం
రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం నిర్దిష్ట నిర్ణయాలతో పాలన సాగించబోతున్నాం. నూతన ఆలోచనలతో 15 శాతం వృద్ధిరేటు సాధించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాం. దేవుడి దయ వల్ల సాగునీటి ప్రాజెక్టులకు జులైలోనే జలకళ వచ్చింది. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ నిండాయి. సమర్థ నీటి నిర్వహణ ద్వారా అన్ని ప్రాంతాలకు సాగునీరందిస్తాం. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఎప్పుడూ నమ్ముతాం. సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. నాడు ఐదేళ్లలో సాగునీటి రంగంపై రూ.68 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని, యజ్ఞం మాదిరిగా పోలవరం ప్రాజెక్ట్ పనులు పరుగులు పెట్టించామన్నారు. రైతు ఆదాయం పెంచి వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాం. వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణా. పెన్నా నదుల అనుసంధానం మా ప్రభుత్వ విధానం. గత ప్రభుత్వ అసమర్థతతో దెబ్బతిన్న పోలవరాన్ని ముందుకు తీసుకెళ్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
యువత కోసం నైపుణ్య గణన
యువతకు అవకాశాలు సృష్టిస్తే అద్భుతాలు సాధిస్తారు. అందుకే నైపుణ్య గణనకు శ్రీకారం చుట్టాం. దీంతో మెరుగైన ఉపాధి అవకాశాలు లభించేలా చూస్తాం. గత ప్రభుత్వం నిర్మాణ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. గత ప్రభుత్వ ఇసుక దోపిడీపై సీఐడీ విచారణ జరిపిస్తాం. కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఉచిత ఇసుకపై నిర్ణయం తీసుకున్నాం. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇసుకను ఆర్డర్ చేసుకునే వెసులుబాటు కల్పించాం. మరింత పకడ్బందీగా దీన్ని అమలు చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు.
తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టం
ప్రభుత్వ ఉద్యోగులంటే ప్రభుత్వంలో భాగస్వాములు, వాళ్లకు ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నాం. అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం, సూపర్ సిక్స్ తో 6 హామీలు ఇచ్చాం. రాష్ట్ర పరిస్థితిపై ఏడు అంశాల్లో శ్వేతపత్రాలు విడుదల చేశాం. పోలవరం, అమరావతి, రాజధాని, విద్యుత్ వంటి శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేశాం. సహజ వనరుల దోపిడీని బహిర్గతం చేస్తాం. నాటి అక్రమాలపై లోతైన దర్యాప్తు చేయించి, అక్రమార్కులను శిక్షించి తీరుతామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మత ఘర్షణలు, రౌడీయిజం, ఫ్యాక్షనిజం, నక్సలిజాన్ని నిర్మూలించిన చరిత్ర తెలుగుదేశం ప్రభుత్వానికి ఉందన్నారు. నేడు మళ్లీ లా అండ్ ఆర్డర్‌ను అత్యంత కట్టుదిట్టంగా అమలు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు రావాలంటే శాంతి భద్రతలు బాగుండాలన్నారు. నేరస్థులు రాజకీయ ముసుగులో వచ్చి రౌడీయిజం చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. తమ ప్రభుత్వంలో ఎటువంటి రాజకీయ కక్ష సాధింపులకు తావులేదని.. కానీ తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే అవకాశమే లేదని ఈ వేదిక మీద నుంచి ప్రకటిస్తున్నానన్నారు. అవినీతికి పాల్పడి.. ప్రజల ఆస్తులను దోచుకున్న వారి నుంచి ఆ ఆస్తులు చట్టపరంగా తిరిగి రాబట్టి ప్రజలకు అందేలా చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
ప్రజారోగ్యానికి ప్రాధాన్యత
వైద్య, ఆరోగ్య శాఖలో 2014 నుంచి 2019 వరకు నాటి పాలనలో అనుసరించిన ఉత్తమ విధానాలు అన్నీ మళ్లీ అమలు చేయాలని ఇప్పటికే నిర్ణయించామని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేస్తామన్నారు. గత ప్రభుత్వం పెట్టిన ఆరోగ్యశ్రీ బిల్లుల బకాయిలు దశలవారీగా చెల్లిస్తున్నామన్నారు. టెలీ మెడిసిన్‌ను విస్తృత పరిచి మెరుగైన వైద్య సేవలు అందిస్తామన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఫీడర్ అంబులెన్స్‌ల వ్యవస్థను మళ్లీ బలోపేతం చేస్తామని… గిరిజన గర్భిణులను వసతి కేంద్రాలకు తరలించి పౌష్టికాహారం అందిస్తామని వెల్లడిరచారు. ఎన్టీఆర్ బేబీ కిట్స్‌ను తిరిగి ప్రవేశ పెడతామన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెరగడానికి ధరల భారం పడకుండా చూస్తున్నామని సీఎం అన్నారు.
ధరలు నియంత్రిస్తాం
గత ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థను కూడా అవినీతికి కేంద్రంగా మార్చుకుందని విమర్శించారు. రేషన్ వ్యవస్థను సర్వనాశనం చేసిందన్నారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో పేదలు అల్లాడిపోయారని…అందుకే కూటమి ప్రభుత్వం మళ్లీ పౌరసరఫరాల శాఖను బలోపేతం చేస్తోందన్నారు. నిత్యావసరాల ధరలను నియంత్రిస్తామన్నామని సీఎం చంద్రబాబు చెప్పారు.
జనాభా వృద్ధిపై దృష్టి
ప్రస్తుత సమాజంలో మారుతున్న పోకడలకు అనుగుణంగా దేశంలో జనాభా పెరుగుదలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇప్పటి వరకు జనాభా నియంత్రణపై దృష్టి పెట్టామని.. అయితే నేడు జనాభా వృద్ధిపై దృష్టి పెట్టాలని.. లేకపోతే రానున్న రోజుల్లో వృద్ధుల సంఖ్య పెరిగి పనిచేసే వాళ్ల సంఖ్య తగ్గుతుందన్నారు. ఇది దేశ ప్రగతిపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. ఈ కారణంగా జనాభా నియంత్రణ నుంచి జనాభా సమతుల్యత దిశగా అడుగులు వేసేందుకు నిర్ణయించామన్నారు. అందుకే ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ సంతానం ఉంటే స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హులన్న నిబంధనను తొలగించామన్నారు.
టెక్నాలజీ సమర్థ వినియోగంతో అద్భుతాలు
టెక్నాలజీ ని సమర్థవంతంగా వినియోగిస్తే పాలనలో అద్భుతాలు సృష్టించవచ్చని పేర్కొన్నారు. పేదల బతుకుల్లో పెను మార్పులు తేవచ్చన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచవచ్చన్నారు. టెక్నాలజీకి ఉత్తమ ప్రభుత్వ పాలసీలు తోడైతే అనూహ్యమైన విజయాలు సాధించవచ్చన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను సమర్థవంతంగా వినియోగించుకుని సత్వర, పారదర్శక పాలన అందించవచ్చన్నారు. పీ4తో పేదరిక నిర్మూలన చేయవచ్చన్నారు. జీరో పావర్టీ కోసం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నామన్నారు. పేదరికం లేని సమాజం టీడీపీ విధానమని స్పష్టం చేశారు. సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్న 10 శాతం మంది, అట్టడుగున ఉన్న 20 శాతం మందికి చేయూతను ఇవ్వడం ద్వారా పేదరికాన్ని తగ్గించవచ్చని సీఎం చంద్రబాబు అన్నారు.
అన్ని వర్గాలకు సమన్యాయం
ఎన్నికల్లో సీట్ల కేటాయింపులో సోషల్ ఇంజనీరింగ్ ద్వారా అన్ని వర్గాలకు సమ న్యాయం చేసి తిరుగులేని ఫలితాలు సాధించామన్నారు. ఈ క్రమంలో ఇటీవల ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపీలో ఎస్సీ వర్గీకరణ అమలు చేశామని.. నేడు సుప్రీం కోర్టు తీర్పుతో వర్గీకరణకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు గతంలో ఇచ్చిన పథకాలను పునరుద్ధరిస్తామని ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేసిన ఆదరణ, ముందడుగు, చైతన్యం, రోష్నీ వంటి పథకాలను అమలు చేస్తామన్నారు. మహిళల భద్రత, ఆత్మ గౌరవానికి పెద్ద పీట వేస్తామన్నారు. అందరికీ న్యాయం జరగాలి అనే తమ విధానానికి కట్టుబడి ఉంటామని తేల్చిచెప్పారు. రాష్ట్ర పునర్నిర్మాణం ఒక దీక్షలాగా, ఒక తపస్సులాగా చేయాలన్నారు. ఇందుకు మనమందరం కంకణబద్ధులం కావాలని పిలుపునిచ్చారు. తెలుగు జాతి నెంబర్-1 గా చేయాలనే సంకల్పానికి ప్రజల సహకారం కోరుతున్నానన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణ యజ్ఞంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.
గత పాలకుల విధ్వంసం
రాజ్యాంగం ఎంత మంచిదయినా అది అమలు చేసేవాడు మంచివాడు కాకపోతే అది చెడు ఫలితాలను ఇస్తుంది. రాజ్యాంగంతో పాటు ఇప్పుడు పాలకులూ మంచివారే కాబట్టి ప్రజలకు నూటికి నూరుశాతం మంచే జరుగుతుంది. మంచి చేసే మా ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం (వైసీపీ) రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారని, బాధితులనే నిందితులను చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. నియంత పోకడలు, పరదాల పాలనతో రాష్ట్రాన్ని రావణకాష్టం చేశారన్నారు. ప్రభుత్వ భూములు, ఆస్తులు దోచుకున్నారని, గత ప్రభుత్వంలో ఇసుక అక్రమాలపై సీఐడీతో విచారణ జరిపిస్తామన్నారు.
పాత ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానం
2014-19 నాటి పాత ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానాన్ని అమలు చేయడానికి నిర్ణయించామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వమే నేరుగా కాలేజీల ఖాతాల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు జమచేస్తుందన్నారు. దీంతో విద్యార్థులకు ఎటువంటి ఫీజుల సమస్యలు ఉండవని అన్నారు. బోధనపై దృష్టిపెట్టడం కోసం టీచర్లపై.. అనవసర యాప్‌ల భారం తొలగించామని చెప్పారు.