- త్వరలో నూతన పింఛన్లు మంజూరు
- అర్హులందరికీ సంక్షేమ పథకాలు
- మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి స్పష్టీకరణ
సింగరాయకొండ (చైతన్యరథం): ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి అన్నారు. సోమవారం ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం సింగరాయకొండలోని మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం ఆవరణలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మంత్రి డోలా పాల్గొని వివిధ సమస్యలపై వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అర్జీలపై పూర్తి స్థాయిలో పరిశీలించి సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి మీడియాతో మాట్లాడుతూ, మొత్తం 91 అర్జీలు వచ్చాయని, అందులో ఎక్కువ సంఖ్యలో రెవెన్యూ సంబంధిత అంశాలపైనా, పెన్షన్ల కోసం వచ్చాయన్నారు. ఇళ్ళ స్థలాల మంజూరు కోసం కొన్ని, స్థలాలు, భూములు ఆక్రమించారని, రీ సర్వే లో ఇబ్బందులు, అసైన్డ్ భూములను ఆక్రమించుకుని అక్రమ లే అవుట్స్ వేశారని అర్జీలు వచ్చాయన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
వివిధ సమస్యల పై ప్రజల నుంచి వచ్చే అర్జీలను, వినతులను సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించామని మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 4 నెలల కాలంలో కొండపి నియోజక వర్గంలో రోడ్లు, సైడ్ కాలువల నిర్మాణానికి 17 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని తెలిపారు. అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకు 140 కోట్ల రూపాయలు మంజూరయ్యాయన్నారు. ఈ నెల 14 వ తేదీ నుంచి వారం రోజుల పాటు పల్లె పండుగ కార్యక్రమం కింద మంజూరైన పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మంత్రి వివరించారు. అర్హత కల్గిన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అర్హత కలిగిన పెన్షనర్ల కు కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామన్నారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా, అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి డోలా స్పష్టం చేశారు.