- వాసుదేవరెడ్డి నివాసంలో సీఐడీ సోదాలు
- మద్యం దోపిడీలో జగన్‌రెడ్డికి అడ్డగోలు సహకారం
- ఆయన కనుసన్నల్లోనే సరఫరా, అమ్మకాలు
- బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా సర్వం తానై నడిపించిన వైనం
అమరావతి: రాష్ట్రంలో మద్యం వ్యాపారంలో కీలకంగా వ్యవహరించిన ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి నివాసంలో సీఐడీ అధికారులు సోదాలు చేశారు. కంచికచర్ల మండలం మిగులూరు వాసి గద్దె శివరామకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ నానక్‌రామ్ గూడలోని వాసుదేవరెడ్డి నివాసంలో శుక్రవారం ఉదయం నుంచి సోదాలు ప్రారంభించిన సీఐడీ అధికారులు కీలక పత్రాలను పరిశీలించారు.
నూతన మద్యం పాలసీ పేరిట అడ్డగోలు దోపిడీ పర్వానికి సహకరించారన్న ఆరోపణల నేపథ్యంలో సీఐడీ అధికారులు సోదాలు చేపట్టారు. రాష్ట్రంలోని మద్యం డిస్టిలరీలు అనధికార మార్గాల్లో వైసీపీ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడంలో వాసుదేవరెడ్డిదే కీలక పాత్ర అని, తద్వారా మద్యం రూపంలో వైసీపీకి భారీ ఆదాయం లభించిందన్న ఆరోపణలు ఉన్నాయి. జగన్ పాలనా కాలంలో మద్యం వ్యాపారం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఎక్కడా లేనివిధంగా ఇక్కడ నాసిరకం మద్యం అధిక ధరలకు విక్రయించారు. ప్రధాన బ్రాండ్ల మద్యం కంటికి కనిపించకుండా చేశారు. దీనికితోడు రూ.60 ఉన్న మద్యం క్వార్టర్ బాటిల్‌ను రూ.200లకు అమ్మారు. దీనివెనుక పెద్ద ఎత్తున మాఫియా ఉందనే ఆరోపణలు తీవ్రస్థాయిలోనే వచ్చాయి.
తనకు అత్యంత నమ్మకస్తుడైన.. ఐఆర్‌టీఎస్ (ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్)లో పనిచేస్తున్న వాసుదేవరెడ్డిని జగన్ ఏరికోరి డిప్యుటేషన్‌పై తీసుకొచ్చి రాష్ట్రంలో మద్యం వ్యాపారాన్ని టోకుగా నిర్వహించే ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా నియమించుకున్నారు. ఈ పదవి చేపట్టింది మొదలు వాసుదేవరెడ్డి.. జగన్ విచ్చలవిడి దోపిడీకి అన్ని విధాలుగా సహకరించారు. సరైన లెక్కలు లేకుండానే మద్యం అమ్మకాలు సాగించారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఎక్కడా డిజిటల్ చెల్లింపులు లేకుండా మొత్తం నగదు చెల్లింపులతోనే నడిపించారు. తద్వారా మద్యం దుకాణాలకు ఎంత సరుకు, ఎక్కడి నుంచి వస్తోంది, ఎంత మేర అమ్మకాలు జరిగాయనే వాస్తవ లెక్కలు బయటపడకుండా జాగ్రత్త పడ్డారు.
టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పలు మార్లు లిక్కర్ కుంభకోణంపై విమర్శలు చేశారు. తాము అధికారంలోకి వస్తే.. లిక్కర్ మాఫియా అంతు చూస్తామని కూడా హెచ్చరించారు. ఈ క్రమంలోనే తొలి అడుగు ఇప్పుడు పడినట్టు కనిపిస్తోంది. జగన్ రెడ్డికి వాసుదేవరెడ్డి కరడుగట్టిన మద్దతుదారుగా వ్యవహరించారని టీడీపీ నాయకులు విమర్శించిన విషయం తెలిసిందే. మద్యం రాబడి.. పాలసీ సహా అన్ని విషయాలు ఈయన కనుసన్నల్లోనే జరిగాయి. అందుకే.. ముందుగా ఈయనను విచారిస్తున్నట్టు సమాచారం. అనంతరం.. అసలు వ్యక్తులను బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేయనున్నట్టు తెలుస్తోంది.
వాసుదేవరెడ్డిపై కేసు
ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. కంచికచర్ల మండలం మిగులూరు వాసి గద్దె శివరామకృష్ణ ఫిర్యాదుతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ నెల 6న విజయవాడ శివారు ప్రసాదంపాడు సమీపంలో ఒక వ్యక్తి కారులో ప్రభుత్వ ఫైళ్లు, కంప్యూటర్, ఇతర సామాగ్రి వేసుకుని వెళ్తుండగా గమనించిన శివరామకృష్ణ ఇదేంటని ప్రశ్నిస్తే.. సమాధానం చెప్పకుండా అక్కడ నుంచి విసురుగా వెళ్లిపోగా, ఆరా తీస్తే అతను ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి అని తేలిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. శివరామకృష్ణ ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసింది. ఐపీసీలోని 427, 379 రెడ్ విత్ 120(బీ) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నెల్లూరు సీఐడీ డీఎస్పీ పి.శ్రీనివాసులును దర్యాప్తు అధికారిగా నియమిస్తున్నట్లు సీఐడీ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగానే హైదరాబాద్‌లోని వాసుదేవరెడ్డి నివాసంలో సీఐడీ అధికారులు తనిఖీలు చేశారు.