- వైసీపీ అడ్రస్ గల్లంతు
అమరావతి(చైతన్యరథం): ఏపీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి అదరగొట్టింది. మొత్తం 13 ఉమ్మడి జిల్లాలకుగానూ 8 జిల్లాల్లో క్లీన్‌స్వీప్ చేసింది. ఈ ఎనిమిది జిల్లాల్లో 110 సీట్లు ఉండగా.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మొత్తం సీట్లలో విజయం సాధించింది. ఉమ్మడి విశాఖ, ప్రకాశం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలోని మొత్తం 10 స్థానాల్లో మాత్రమే వైసీపీ విజయం సాధించింది. విశాఖలో 2, ప్రకాశంలో ఒకటి, కడప జిల్లాలో మూడు, కర్నూలు జిల్లాలో 2, చిత్తూరు జిల్లాలో 2 నియోజకవర్గాల్లో మాత్రమే వైసీపీ విజయం సాధించింది. ఈ ఐదు జిల్లాల పరిధిలోని 65 నియోజకవర్గాలకు కేవలం 11 చోట్ల మాత్రమే వైసీపీ విజయం సాధించింది. మిగతా 54 నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి విజయం సాధించింది.
క్లీన్‌స్వీప్ జిల్లాలు
శ్రీకాకుళం జిల్లాలో పది నియోజకవర్గాలకు 8 నియోజకవర్గాల్లో టీడీపీ పోటీచేయగా అన్ని స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ, జనసేన చెరో స్థానంలో పోటీచేయగా.. ఆ రెండు చోట్ల బీజేపీ, జనసేన అభ్యర్థులు విజయం సాధించారు.
విజయనగరం జిల్లాలో 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా టీడీపీ 8 స్థానాల్లో జనసేన ఒక చోట విజయం సాధించాయి.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 19 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా టీడీపీ 13, జనసేన ఐదు, బీజేపీ ఒక స్థానంలో విజయం సాధించాయి.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా టీడీపీ 9, జనసేన 6 స్థానాల్లో పోటీచేయగా.. ఆ రెండు పార్టీలు పోటీచేసిన అన్ని స్థానాల్లో గెలుపొందారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 నియోజకవర్గాలు ఉండగా.. టీడీపీ 13, బీజేపీ 2, జనసేన ఒక స్థానంలో పోటీచేయగా.. ఆ మూడు పార్టీలు అన్ని స్థానాల్లో విజయం సాధించాయి.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 17 నియోజకవర్గాలు ఉండగా టీడీపీ 16, జనసేన ఒక నియోజకవర్గంలో పోటీచేయగా.. అన్ని స్థానాల్లో గెలుపొందాయి.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉండగా.. టీడీపీ 13, బీజేపీ ఒకచోట విజయం సాధించాయి.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉండగా.. అన్ని చోట్ల టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు.
వైసీపీ గెలిచిన స్థానాలు..
ఉమ్మడి విశాఖలోని అరకు, పాడేరులో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెం, దర్శి, ఉమ్మడి కడప జిల్లాలో బద్వేలు, రాజంపేట, పులివెందుల, ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మంత్రాలయం, ఆలేరు నియోజకవర్గాల్లో వైసీపీ గెలుపొందింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తంబళపల్లె, పుంగనూరులో మాత్రమే వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు.