అమరావతి, (చైతన్యరథం): శాసన మండలి ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన అనేది కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. చంద్రబాబు హయాంలో లులు, గోద్రెజ్, హెచ్‌సీఎల్ (రెండో దశ), మెగా సిటీ ఏర్పాటుకు ఫాక్స్ కాన్, విన్ ఫాస్ట్ జైరాజ్ ఇస్పాత్ (రెండో దశ), ఎయిర్ బస్, యూనివర్సిటీ ఏర్పాటుకు అపోలో, యూట్యూబ్ అకాడమీ ఏర్పాటుకు గూగుల్ వంటి ఎన్నో సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయన్నారు. కూటమి ప్రభుత్వానికి కేవలం 9 నెలలోనే రూ.10 లక్షల కోట్లు పైగా పెట్టుబడులు వచ్చాయన్నారు. తద్వారా 7.50 లక్షల మంది యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు రానున్నాయన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల కోసం సర్వే పూర్తి కావొస్తోందన్నారు. రాష్ట్రంలో 1.10 కోట్ల మంది డిగ్రీలోపు చదువుకున్న నిరుద్యోగ యువతకు ఎపీఎస్‌ఎస్‌డీసీ (స్కిల్ డెవలప్మెంట్) ద్వారా ఉచిత నైపుణ్య శిక్షణ, ఉపాధిని కూటమి ప్రభుత్వం ద్వారా అందిస్తున్నామన్నారు. అశోక్ లేల్యాండ్ యూనిట్‌ను మంత్రి శ్రీ నారా లోకేష్ ప్రారంభించనున్నారు. తద్వారా 5,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నాయన్నారు. ఉద్యోగ కల్పన చేయని నాడు నిరుద్యోగ భృతి కచ్చితంగా అందిస్తామన్నారు. – ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పలు పర్యటనల ద్వారా ప్రపంచ దిగ్గజ కంపెనీలతో ఒప్పందాలు చేస్తున్నారని వెల్లడిరచారు.