విజయవాడ (చైతన్య రథం): దేశంలోనే అత్యుత్తమ క్రీడావిధానాన్ని రూపొందించామని, క్రీడా సంఘాల తోడ్పాటుతో క్రీడా పోటీల నిర్వహణ శుభపరిణామమని క్రీడా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. విజయవాడలోని చెన్నుపాటి రామకోటయ్య మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న కాస వడ్లమూడి మోహనకృష్ణ మెమోరియల్ ఏపీ స్టేట్ సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అండర్ -13 క్రీడల పోటీల కార్యక్రమానికి మంత్రి మండిపల్లి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఇండోర్ స్టేడియాల నిర్మాణానికి కట్టుబడి ఉన్నామన్నారు. అమరావతిలో దేశంలోనే అత్యుత్తమ స్పోర్ట్స్ హబ్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ముందడుగు వేస్తున్నారన్నారు. తొలుత మోహనకృష్ణ చిత్రపటానికి మంత్రి నివాళులర్పించారు. నిర్వాహకులు మంత్రి, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నాయుడుని ఘనంగా సన్మానించారు. క్రీడాకారులకు కూటమి ప్రభుత్వహయాంలో అన్ని విధాలా తోడ్పాటు అందిస్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నాయుడు, మంత్రి రాంప్రసాద్ కొంతసేపు బ్యాడ్మింటన్ ఆడి.. క్రీడాకారులను ఉత్సాహపర్చారు.