అమరావతి(చైతన్యరథం): తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో శనివారం వందల మంది నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు వినతులు స్వీకరించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు ప్రతి శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళుతున్న విషయం తెలిపిందే.ఈ క్రమంలోనే ఈ శనివారం ఉదయం కూడా పార్టీ కార్యాలయానికి వెళ్లారు. తనకోసం వేచి ఉన్న ప్రజలు, కార్యకర్తలను కలిశారు. ముందుగా గేటు వద్ద రాజమండ్రి నుంచి వచ్చిన దివ్యాంగుల నుంచి వినతిపత్రాలు తీసుకున్నారు. అనంతరం మీడియా రూంలో ప్రజలను, కార్యకర్తలను, వివిధ సమస్యలపై వచ్చిన వారిని కలిశారు. ఆరోగ్య సమస్యలు, భూ వివాదాలు, వ్యక్తి గత సమస్యలపై పలువురు సీఎంకు విన్నవించారు. కార్యకర్తలు, నేతలు మాత్రం నామినేటెడ్ పదవుల్లో తమకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబును కోరారు. నాడు తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచేసిన బీమా మిత్రలు తమను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని కోరారు. విజయవాడకు చెందిన షేక్ ఆసిన్, మహ్మద్ ఇంతియాజ్ రాజధాని అమరావతి కోసం రూ.1 లక్ష విరాళంగా ఇచ్చారు. ఫర్నిచర్ షాపు నడుపుతున్న వీరు లక్ష విరాళం ఇవ్వడాన్ని చంద్రబాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఆశోక్బాబుతో సహా పలువురు నేతలు పాల్గొన్నారు.
పాపకు రూ.16 కోట్ల ఇంజక్షన్ కోసం సాయం కోరిన బాధితులు
గుంటూరుకు చెందిన వెచ్చా ప్రీతమ్ దంపతులు తమ పాప హితైషీను తీసుకువచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. ఏడాది వయసున్న హితైషీ తీవ్రమైన వ్యాధితో బాధపడుతోంది. స్పైనల్ మసక్యులర్ అట్రోఫీ అనే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న పాపకు చికిత్స కోసం వారు ముఖ్యమంత్రిని కలిశారు. పాపకు ఉన్న జబ్బు నయం కావాలి అంటే ్గశీశ్రీస్త్రవఅంఎa అనే ఇంజక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. దీని ధర రూ.16 కోట్లు కావడంతో తల్లిదండ్రులు సాయం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఫండ్ రైజింగ్ కార్యక్రమం కూడా చేపట్టారు. మరో నెల రోజుల్లో ఈ చికిత్స అందించాల్సి ఉందని తల్లిదండ్రులు ముఖ్యమంత్రికి తెలిపారు. దీనిపై వెంటనే పరిశీలన జరుపుతామని ముఖ్యమంత్రి వారికి హామీ ఇచ్చారు. అనంతరం తన చాంబర్ లో నేతలను చంద్రబాబు కలిశారు. పార్టీ అంశాలపై వారితో చర్చించారు.
వినతులు స్వీకరించిన మంత్రులు
మంత్రులు పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రులు అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు ఎన్టీఆర్ భవన్కు వచ్చి ప్రజల నుండి వినతులు స్వీకరించారు. పార్టీ కార్యాలయం నుంచి చంద్రబాబు వెళ్లిపోయాక కూడా వినతుల స్వీకరణ కార్యక్రమం కొనసాగించారు. మంత్రులు వచ్చేవరకు ఎమ్మెల్సీ అశోక్ బాబు వినతులు స్వీకరించారు. కార్యాలయానికి వచ్చిన మంత్రులు అనగాని, నిమ్మల రిసెప్షన్ వద్దే కూర్చుని ప్రజల నుండి వినతులను స్వీకరించారు. వినతులు పరిశీలించి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. వినతుల్లోని అంశాలపై సంబంధిత అధికారులకు మంత్రి అనగాని ఫోన్లు చేసి, బాధితుల వివరాలు చెప్పి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు.