అమరావతి: సమాజంలో మార్పు కోసం ప్రజలు తీర్పు ఇచ్చారని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ఆ తీర్పుకు అనుగుణంగానే కేబినెట్ ఉండాల్సిన అవసరం ఉందన్నారు. యువతకు ప్రాధాన్యం ఉండాలి, వారికి స్థానం కల్పిస్తేనే ఆ పార్టీ, ప్రభుత్వం నాలుగు కాలాల పాటు ఉంటుందన్నారు. చంద్రబాబు కేబినెట్‌లో అవకాశాలు దక్కిన వారికి స్వాగతం పలకాలి. అదే సమయంలో చిత్త శుద్ధితో పని చేయాల్సిన బాధ్యత వారిపై కూడా ఉంటుందన్నారు. శుక్రవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేబినెట్ మంత్రులను యనమల రామకృష్ణుడు కలిశారు.
ఈ భేటీ అనంతరం యనమల మీడియాతో మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తనకు 29 ఏళ్లకే మంత్రిగా అవకాశం ఇచ్చారన్నారు. చిత్తశుద్ధితో పని చేశాం కాబట్టే ఈ స్థాయికి రాగలిగాం. ప్రస్తుత కేబినెట్ కూర్పు వంద శాతం బాగుంది. దాన్ని స్వాగతిస్తున్నాం. టీడీపీలో ఉన్న సీనియర్లు పార్టీకి ఉపయోగపడాలి, జూనియర్లకు అవకాశాలు కల్పించాలి. అప్పుడే యువత ఎదుగుతారు. పాత నీరు, కొత్త నీరు కలయిక ఎప్పుడూ ఉంటుంది. అప్పుడే రాష్ట్రానికి ఉపయోగం ఉంటుంది. కేబినెట్‌లో 50 శాతం కంటే ఎక్కువ అవకాశాలు బడుగు, బలహీన వర్గాలకు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నా. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పని చేయాల్సి ఉంటుంది. ప్రజలు మార్పు కోరుకున్నారు.. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం కోసం పని చేస్తామని హామీలు ఇచ్చాం. కొన్ని అంశాలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా తెలియజేశాం. కేబినెట్‌తో పాటు మిగతా నేతలంతా చిత్త శుద్ధితో పని చేస్తామని యనమల రామకృష్ణుడు ఉద్ఘాటించారు.
సంక్షోభం నుంచి చంద్రబాబు బయటపడేస్తారు
ప్రజలకు జగన్ అన్యాయం చేయబట్టే వారు మార్పు కోరుకున్నారు. జగన్ ఐదేళ్లలో రాష్ట్రంలో సంక్షోభం సృష్టించారు. ఆర్థికంగా, అప్పుల పరంగా అభివృద్ధి పరంగా గత ఐదేళ్లలో విధ్వంసం సృష్టించారు. కొంత సమయం పట్టినా చంద్రబాబు సమర్థుడు కాబట్టి ఈ సంక్షోభం నుంచి బయటకు రావడం పెద్ద విషయం కాదు. సంక్షేమంతో పాటు అభివృద్ధి జరగాలి. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా మంచి పాలన అనేది ప్రధాన అంశం అవుతోంది. మంచి ప్రభుత్వం రావాలని ఎన్నుకున్నప్పుడు ప్రజలకు న్యాయం చేయడం ప్రభుత్వ బాధ్యత. అనుభవం ఉన్న నాయకుడిగా చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పథóంలో నడుపుతారు. మంత్రివర్గంలో ఉన్నా లేకపోయినా తామంతా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతామని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.