అమరావతి: సోషల్ మీడియాలో చంద్రబాబు పేరు మీద వైసీపీ ప్రచారం చేస్తున్నది లేఖ ఫేక్ అని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య స్పష్టం చేసారు. ఫేక్ లేఖతో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై ఫిర్యాదు చేసేందుకు సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్ అందుబాటులో ఉండటం లేదని ఆయన మండిపడ్డారు. గురువారం టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడుతూ… జగన్ మోహన్‌రెడ్డికి తన ప్రభుత్వం త్వరలో అంతం కాబోతుందనే విషయం బాగా అర్థమయిందన్నారు. అందుకే వికృత చేష్టలతో సోషల్ మీడియాను అడ్డుపెట్టుకొని తెలుగుదేశం పార్టీ నాయకుల మనోధైర్యాన్ని దెబ్బతీసి లబ్ధి పొందాలని చూస్తున్నాడు. అందులో భాగమే చంద్రబాబు పేరుతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ట రెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డి విడుదల చేసిన లేఖ. అందులో అంతా చెత్త రాసి చివరన చంద్రబాబు సంతకం ముద్రించారు. తెలుగుదేశం పార్టీపై విషం కక్కటానికి, తెలుగుదేశం శ్రేణులను పక్కద్రోవ పట్టించడానికి జగుప్సాకరంగా లేఖను సృష్టించి ప్రచారం చేస్తున్నారు. ప్రజలు ఎవ్వరు కూడా ఈ లేఖను నమ్మలేదు. ప్రజల్లో కుల, మత, వర్గం భేదాలు లేకుండా అభివృద్ధే లక్ష్యంగా చంద్రబాబు పని చేయటమే అందుకు కారణం. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడుతున్న వారిపై దృష్టి పెట్టాం. సీఎం ఫ్యామిలీ, మంత్రులు, ఆఖరికి ప్రతిపక్షాలు మీద అయినా తప్పుడు పోస్టులు పెడితే ఊరుకోము అని సీఐడి చీఫ్ సంజయ్ బుధవారం విలేకరుల సమావేశంలో చెప్పటంతో నాకు ధైర్యం వచ్చింది. అందుకే ఈ లేఖపై ఫిర్యాదు ఇద్దామని అపాయింట్ మెంట్ కోసం సంజయ్‌కి వాట్సాప్ మెసేజ్ చేసాను. ఆయన కార్యాలయానికి మెసేజ్ చేసాను. కానీ ఎటువంటి స్పందనా లేదు. దాంతో ఆయన ప్రెస్ మీట్లో చెప్పినదంతా అబద్ధమేనని తేలిపోయింది. చేసేది లేక ఫిర్యాదును మెయిల్ ద్వారా పంపించాను. ఈ లేఖ వెనుక ఉన్న సజ్జల భార్గవ్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోండి. ఇవే కాకుండా గతంలో మా నాయకుడు అచ్చెన్నాయుడి పేరు మీద కూడా లేఖలు విడుదల చేసారు. మా మహిళా నాయకురాలు వంగలపూడి అనిత, ఎమ్మెల్సీ అనురాధ మీద అనుచిత పోస్టులు పెట్టారు. నిజంగా సంజయ్ పెట్టిన ప్రెస్ మీట్ చిత్తశుద్ధితో పెట్టిందే అయితే, మీకు ధైర్యం ఉంటే అరెస్టులు చేయండి. టీడీపీ మీదే కాకుండా హైకోర్ట్ మీద కూడ అనుచిత పోస్టులు పెట్టిన పంచ్ ప్రభాకర్ ను ఏం చేసారు? అధికార పార్టీకే మేము దాసోహం చేస్తాము అనుకోకుండా ఫేక్ లేఖను విడుదల చేసిన భార్గవ్ రెడ్డిని అరెస్ట్ చేయాలని సీఐడి అడిషనల్ డీజి సంజయ్‌ను వర్ల డిమాండ్ చేశారు.