- పెట్రోల్ దాడికి గురైన ఇంటర్ విద్యార్థిని మృతిపై సీఎం చంద్రబాబు స్పందన
- ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరపాలి
- వేగంగా విచారణ పూర్తిచేసి శిక్షపడేలా చూడాలి
- మహిళలపై అఘాయిత్యాలు చేసేవారికి ఈ శిక్ష ఒక హెచ్చరికగా ఉండాలి
- పోలీసు అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం
అమరావతి (చైతన్యరథం): కడప జిల్లా బద్వేల్‌లో ప్రేమోన్మాది పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇంటర్ విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్ ఉన్న విద్యార్థిని ఒక దుర్మార్గుడి దుశ్చర్యకు బలికావడంపై ముఖ్యమంత్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై తొలినుంచీ పోలీసు అధికారులతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి… ఎప్పటికప్పుడు ఆమెకు అందుతున్న చికిత్స గురించి, కేసు విచారణ గురించి తెలుసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేశామని సీఎంకు కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌రాజు వివరించారు. వేగంగా విచారణ పూర్తి చేసి, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని సీఎం ఆదేశించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయడం అంటే….హంతకుడిని త్వరగా, చట్టబద్ధంగా శిక్షించడమేనని సీఎం అన్నారు. ప్రత్యేక కోర్టులో ఫాస్ట్ ట్రాక్ విధానంలో ఈ కేసు విచారణ పూర్తి చేసి నిందితుడికి శిక్షపడేలా చూడాలని పోలీసు అధికారులను సీఎం ఆదేశించారు. ఘటనలో నేరస్తుడికి మరణ శిక్ష, లేదా ఆ స్థాయి శిక్ష పడేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. మహిళలు, ఆడబిడ్డలపై అఘాయిత్యాలు చేసేవారికి ఈ ఘటనలో పడే శిక్ష ఒక హెచ్చరికగా ఉండాలన్నారు.
పెళ్లిచేసుకోవాలని అడిగితే..
వైఎస్ఆర్ జిల్లా బద్వేలు సమీపంలో శనివారం ప్రేమోన్మాది చేతిలో పెట్రోల్ దాడికి గురైన ఇంటర్ విద్యార్థిని కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం చనిపోయింది. శనివారం విద్యార్థినిపై ప్రేమోన్మాది విఘ్నేష్ పెట్రోల్ పోసి నిప్పంటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి చేసుకోవాలని కోరడం వల్లే దాడి చేశాడని పోలీసులకు బాలిక ఫిర్యాదు చేసింది. కడప రిమ్స్‌లో బాధితురాలి నుంచి జడ్జి వాంగ్మూలం తీసుకున్నారు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతోనే విఘ్నేష్ నిప్పంటించినట్లు బాలిక తెలిపింది.
జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపిన వివరాల మేరకు.. బాధిత బాలిక (16) ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. కడపలోని ఓ హోటల్లో వంట మాస్టర్‌గా పని చేస్తున్న విఘ్నేష్‌తో చిన్నప్పటి నుంచీ స్నేహం ఉంది. అతడికి వివాహం కాగా భార్య గర్భిణి. శుక్రవారం ఉదయం అతడు విద్యార్థినికి ఫోన్ చేసి శనివారం తనను కలవాలని కోరాడు. లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దాంతో ఆ బాలిక శనివారం కళాశాల నుంచి ఆటోలో బయలుదేరగా విఘ్నేష్ మధ్యలో ఆ ఆటో ఎక్కాడు. ఇద్దరూ బద్వేలుకు పది కి.మీ. దూరంలో ఉన్న పీపీ కుంట చెక్‌పోస్టు వద్ద ఆటో దిగి సమీపంలోని ముళ్లపొదల్లోకి వెళ్లారు. కొంతసేపటికి విఘ్నేష్.. బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యాడు. కొందరు మహిళలు ఆమెను గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. బాలికను హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు తరలించారు. 80 శాతం కాలిన గాయాలతో ఉన్న బాలిక.. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందింది.
పథకం ప్రకారమే
బాలికపై దాడి చేయాలనే పథకంతోనే విఘ్నేష్ ఆమెకు ఫోన్ చేశాడని ఎస్పీ తెలిపారు. కడప నుంచి వచ్చేటప్పుడు ముందుగానే పెట్రోల్ బాటిల్ బ్యాగ్‌లో పెట్టుకొని బయల్దేరాడు. పథకం ప్రకారమే ఆమెపై పెట్రోల్‌తో దాడి చేశాడు. గతంలో కూడా ఇద్దరి మధ్య పెళ్లి ప్రస్తావన రావడంతో విఘ్నేష్.. కొంత కాలం దూరం పెట్టాడు. ఆ తర్వాత మళ్లీ ఇద్దరూ దగ్గరయ్యారు. పెళ్లి చేసుకోవాలని శనివారం కూడా బాలిక ఒత్తిడి చేయడంతో విఘ్నేష్ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఘటనా స్థలిలో అన్ని ఆధారాలు సేకరించాం, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితుడికి త్వరగా శిక్ష పడేలా చూస్తాం’’ అని ఎస్పీ తెలిపారు.
కఠినశిక్ష పడేలా చూస్తాం: హోం మంత్రి అనిత
కడపజిల్లాలో పెట్రోల్ దాడికి గురైన విద్యార్థిని మృతి పట్ల హోం మంత్రి వంగలపూడి అనిత విచారం వ్యక్తం చేశారు. తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం దిగ్భ్రాంతికరమన్నారు. బాలికపై దాడి అనంతర దృశ్యాలు, పరిస్థితులు తనను తీవ్రంగా కలచివేశాయన్నారు. పెట్రోల్ పోసి నిప్పంటించిన విఘ్నేష్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు నేతృత్వంలో నాలుగు బృందాలు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టి అరెస్ట్ చేశారన్నారు. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన నిందితుడిని, అందుకు సహకరించిన వారిని చట్టప్రకారం వెంటనే కఠిన శిక్షపడేలా చేస్తామని, బాధితురాలి కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు.
వదిలిపెట్టం: మంత్రి సవిత
బద్వేల్ ఘటనకు కారణమైన నిందితుడిని వదిలేది లేదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత స్పష్టం చేశారు. బాధితురాలి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. బాలిక మృతి బాధాకరం. నిందితుడు విఘ్నేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనికి కఠిన శిక్ష పడేలా చేస్తాం. ప్రత్యేక కోర్టులో ఫాస్ట్ ట్రాక్ విధానం ద్వారా కేసు త్వరితగతిన విచారిస్తాం. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి సవిత తెలిపారు.