- ఖజానాకు రూ.18 వేల కోట్లు కష్టం
- తప్పు చేసినవారిని వదిలేస్తే ప్రజాప్రతినిధులకు మాట్లాడే నైతిక హక్కు ఉండదు
- చర్యలు తీసుకోవాలన్న పలువురు ఎమ్మెల్యేలు
అమరావతి (చైతన్యరథం): గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న మద్యం కుంభకోణంలో కారకులను కఠినంగా శిక్షించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్‌శాఖలో జరిగిన అక్రమాలపై బుధవారం విడుదల చేసిన శ్వేతపత్రంపై జరిగిన చర్చలో పవన్ మాట్లాడారు. శ్వేతపత్రంలో చెప్పిన దానికంటే ఎక్కువ అక్రమాలే జరిగాయని పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్ర ఖజానాకు రూ.18వేల కోట్లు నష్టం జరిగిందని తెలిపారు. మద్యం కుంభకోణానికి పాల్పడినవాళ్లను కచ్చితంగా శిక్షించాలన్నారు. తప్పు చేసిన వారిని వదిలేస్తే ప్రజాప్రతినిధులకు మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిదన్నారు. అమరావతికి రూ.15వేల కోట్లు కేంద్రం కేటాయిస్తే ఎంతో సంబరపడ్డాం. అదే ఎక్సైజ్‌శాఖ నుంచి ఖజానాకు రావాల్సిన రూ.18వేల కోట్లు వచ్చుంటే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేది. రూ. 20వేలు లంచం తీసుకున్న ఓ సాధారణ ఉద్యోగిని శిక్షించగలుగుతున్నాం. ఇంత భారీ మొత్తంలో దోపిడీకి పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. రాజకీయ నేతలు తప్పు చేస్తే శిక్షలు ఉండవా అనే ఆలోచన సామాన్యుడికి కలగకుండా చేయాలి. ఇది రాజకీయ కక్షసాధింపు కాదని.. తప్పుచేసిన వారికి శిక్ష పడి తీరాలని ముఖ్యమంత్రిని కోరుతున్నట్లు పవన్ పేర్కొన్నారు. ప్రజల్లో మద్యం వ్యసనం తగ్గించేలా డి-అడిక్షన్ సెంటర్లకు బడ్జెట్ కేటాయించాలని పవన్ అన్నారు.
చర్యలు తీసుకోవాలి: రఘురామకృష్ణరాజు
గత ప్రభుత్వ హయాంలో మద్యం అక్రమాల విషయంలో కేంద్రానికి అనేక లేఖలు రాసినట్లు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఇక్కడ 98 వేల కోట్ల లావాదేవీలు కేవలం నగదు రూపంలో జరిపారని.. దీనిపై విచారణ జరగాలని కోరుతున్నామని తెలిపారు. మొత్తం మద్యం అమ్మకాల్లో పన్ను చెల్లించని మద్యం 30 శాతం ఉన్నట్లుగా అంచనా ఉందన్నారు. గతంలో మద్యం నమూనాలు ల్యాబ్‌లో పరిశీలిస్తే హానికారక పదార్ధాలు ఉన్నట్లుగా వెల్లడయిందన్నారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడిన మద్యం కుంభకోణానికి కారకులను వదిలిపెట్టరాదన్నారు.
అన్నీ దారుణాలే: బొలిశెట్టి శ్రీనివాస్
గత ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు, కొనుగోళ్లలో ఎన్నో దారుణాలు జరిగాయని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. మద్యం అమ్మకాలు మొత్తం నగదు లావాదేవీల్లోనే జరిపారన్నారు. ఇక్కడే అసలు మతలబు ఉందన్నారు. వాస్తం అమ్మకాల వివరాలు వెల్లడి కాకుండా జాగ్రత్త పడ్డారన్నారు. లిక్కర్ విషయంలో మాజీ సీఎం జగన్ చేసిన దారుణాలు ఎవ్వరూ చేయలేదని మండిపడ్డారు. గతంలో ఉన్న బ్రాండ్స్ ఇంకా అమ్ముతున్నామని… వాటిని వెంటనే ఆపివేయకపోతే ఇబ్బందులు వస్తాయన్నారు.
ఈడీకి అప్పగించాలి: సోమిరెడ్డి
మద్యం దుకాణాల్లో ఏ బ్రాండ్స్ ఉన్నాయో అమ్మేవాడికి తెలియదు, కొనేవాడికి తెలియదు.. కేవలం రేటు చెప్పి అమ్మకాలు జరిపారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. ఒక పంచాయితీలో జే బ్రాండ్ మద్యం తాగి 20 మంది చనిపోయారని తెలిపారు. ఢల్లీిలో రూ. 100 కోట్లు కోసం ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి జైలుకు వెళితే ఇక్కడ నెలకు రూ.200 కోట్లు సంపాదించిన వ్యక్తులు ఎన్నేళ్లు జైలులో ఉండాలని ప్రశ్నించారు. ఈ కేసును ఈడీకి అప్పగించాలన్నారు.
శిక్షించాల్సిందే: బుచ్చయ్య చౌదరి
జగన్ నిర్వకం వల్ల నాటు సారా, గంజాయి పెరిగిందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. ధరలు నిర్ణయించేటప్పుడు ఇతర రాష్ట్రాల్లో రేట్లు పరిగణలోనికి తీసుకోవాలన్నారు. తప్పులు చేసిన వారు పారిపోతున్నారని.. అటువంటి అధికరులను వెనక్కి పిలిచి శిక్షించాలని డిమాండ్ చేశారు.
సమాచారాన్ని దాచేస్తున్నారు: కూన రవికుమార్
బేవరేజెస్ కంపెనీల నుంచి డిపోకు వెళ్లకుండా మద్యం నేరుగా షాపులకు వచ్చేదని.. ఎన్నికల సమయంలో కూడా ఇది జరిగిందని ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. డిపోల నుంచి ఎంత మద్యం వచ్చింది, ఎంత అమ్మారనేది రహస్యంగా ఉంచారన్నారు. అధికారులు సమాచారాన్ని దాచిపెడుతున్నారన్నారు. ఇది కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
ఇది చాలా పెద్ద స్కాం: విష్ణుకుమార్ రాజు
మద్యంపై బీజేపీ ప్రత్యేకంగా దృష్టి సారించిందని విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. మద్యం డిస్టిలరీలన్నింటినీ జగన్ బినామీలే నడిపారన్నారు. రూ.100 కోట్లు, రూ.200 కోట్లు కుంభకోణాలకు పాల్పడిన వాళ్లే 6 నెలలుగా జైలులో ఉన్నారన్నారు. ఇది చాలా పెద్ద స్కాం అని గతంలోనే చెప్పానని తెలిపారు. దీనిపై సీబీ సీఐడీ, సీబీఐలతో విచారణ చేయించాల్సిన అవసరం ఉందన్నారు.