అమరావతి: ప్రముఖ పారిశ్రామికవేత్త మద్ది లక్ష్మయ్య మృతికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సంతాపం తెలిపారు. అంచెలంచెలుగా ఎదిగిన ఆయన జీవన ప్రయాణం నేటి యువతకు ఆదర్శప్రాయం. వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి, ఎన్నో ధార్మిక, స్వచ్ఛంద సంస్థల ద్వారా సేవా కార్యక్రమాలు చేపట్టిన మద్ది లక్ష్మయ్య మృతి బాధాకరం. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని కోరుకుంటున్నా. వారి కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నట్లు చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.
లోకేష్ సంతాపం
ప్రముఖ పారిశ్రామికవేత్త మద్ది లక్ష్మయ్య మృతి పట్ల టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంతాపం వ్యక్తంచేశారు. వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించి స్ఫూర్తిగా నిలిచారు. నిత్యం సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మానవత్వాన్ని చాటుకున్నారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు లోకేష్ తెలిపారు.
వ్యాపారవర్గాలకు తీరనిలోటు:డూండీ రాకేష్
ప్రముఖ పారిశ్రామికవేత్త మద్ది లక్ష్మయ్య మృతి రాష్ట్రంలో వ్యాపారవర్గాలకు తీరని లోటని తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండీ రాకేష్ పేర్కొన్నారు. మద్దిలక్ష్మయ్య మృతిపట్ల సంతాపం వ్యక్తంచేస్తూ వివిధ కంపెనీలను స్థాపిం చడం ద్వారా వేలాదిమందికి ఉద్యోగావకాశాలను కల్పించారని కొనియాడారు. కేవలం ఒక పారిశ్రామిక వేత్తగానే గాక ఎంతోమందికి ఆర్థిక సహాయం చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపిన మానవతావాది మద్ది లక్ష్మయ్య అని కొనియాడారు.