- ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడి కృషి
- మంత్రి లోకేష్ అభినందనలు
అమరావతి (చైతన్యరథం): విద్యార్థుల మానసిక వికాసానికి నిబద్ధతతో కృషి చేస్తున్న ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా అభినందించారు. ప్రకాశం జిల్లా కొండపి మండలం జార్లపాలెం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో బయాలజీ స్కూల్ అసిస్టెంట్, ప్రధానోపాధ్యాయులుగానూ విధులు నిర్వర్తిస్తున్న మంచికంటి వెంకటేష్ మాస్టారు పిల్లల వికాసానికి బడినే కేంద్రంగా చేసుకొని అమలు చేస్తున్న బోధనా పద్ధతి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. పాఠశాల విరామ సమయంలో విద్యార్థులతో పుస్తకాలు చదివించడం, తెలుగులో కథలు, కవితలు, వ్యాసాలు రాయించేలా తీర్చిదిద్దడం ప్రశంసనీయం. సెలవు రోజుల్లో విద్యార్థులను సమీప ప్రాంతాలలో విజ్ఞాన యాత్రలకు తీసుకెళ్తూ ప్రకృతి, పర్యావరణం, చరిత్రపై అవగాహన కల్పించడం విద్యా వికాసానికి ఎంతో దోహదం చేస్తుంది. విద్యాలయాల్లో గ్రంథాలయాల ఆవశ్యకత వివరిస్తూ.. సెలవు రోజుల్లో మంచికంటి మాస్టారు చేపట్టిన ప్రచారం చాలా మంచి కార్యక్రమమని మంత్రి లోకేష్ అభినందించారు.















