- బహుళ ప్రాజెక్టే రాష్ట్రానికి జీవనాడి.. వెన్నెముక
- 2027నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం
- జనవరి నుంచి కొత్త డయాఫ్రం వాల్ పనులు
- నదుల అనుసంధానం నా జీవితాశయం
- వంశధార గోదావరి కృష్ణా పెన్నాలను అనుసంధానిస్తా
- ప్రతి ఎకరాకూ సాగునీరివ్వడమే ప్రభుత్వ లక్ష్యం
- 45.72 మీటర్ల ఎత్తులోనే పోలవరం నిర్మాణం
- ప్రాజెక్టును నిర్వీర్యం చేసింది ముమ్మాటికీ వైసీపీనే..
- వాళ్ల అసమర్థతతో రెండువిధాలా నష్టపోయాం..
- అసెంబ్లీలో సీఎం చంద్రబాబు సుదీర్ఘ ఉపన్యాసం
- లఘుచర్చలో సాగునీటి ప్రాజెక్టులపై సమగ్ర సమాచారం
అమరావతి (చైతన్య రథం): ‘రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు జీవనాడి, వెన్నెముక. పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసి నదుల అనుసంధానం చేస్తే రాష్ట్రంలో కరవనేది ఉండదు. కరవు నివారించి రైతులకు నీళ్లిస్తే బంగారం పండిస్తారు. ప్రతి ఎకరాకు నీరందించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయవచ్చు. ఫ్లోరైడ్ నీళ్లతో బాధపడేవారికి ఉపశమనం కలుగుతుంది. నదుల అనుసంధానం నా జీవిత ఆశయం… కల’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శాసన సభలో మంగళవారం లఘుచర్చలో భాగంగా సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితిపై సీఎం సుదీర్ఘంగా మాట్లాడారు.
రాజకీయ కక్షతో పోలవరాన్ని నాశనం చేశారు
‘పోలవరం ప్రాజెక్టుకు ఒక చరిత్ర ఉంది. 1941లోనే ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు. మొదట 170 అడుగుల ఎత్తులో, తర్వాత 208 అడుగుల ఎత్తులో నిర్మించి 340నుండి 700 టీఎంసీ నిల్వ చేయాలని చూశారు. దీనికి రామపాద సాగర్‌గా నామకరణం చేశారు. అప్పట్లోనే పూర్తి చేస్తే రూ.129 కోట్లతో పూర్తయ్యేది. కానీ నేడు రూ.55 వేల కోట్లకు అంచనా వ్యయం పెరిగింది. నాడు ఈ ప్రాజెక్టు పూర్తైవుంటే నేడు సుభిక్షింగా ఉండేది. 15.5.1981లో నాటి సీఎం అంజయ్య శంకుస్థాపన చేసినా పనులు ప్రారంభం కాలేదు. రాజశేఖర్‌రెడ్డి వచ్చాక అస్తవ్యస్తం చేశారు. రాష్ట్ర విభజనతో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. ఆదాయం వచ్చే హైదరాబాద్ తెలంగాణకు వెళ్లింది. పెట్టుబడులు వచ్చి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అమరావతి, పోలవరాన్ని రెండు కళ్లలా భావించి పూర్తి చేసేందుకు శ్రద్ధ పెట్టాం. పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాం.
2014లో ఎన్నికల ఫలితాలు రాగానే రాజ్‌నాథ్‌సింగ్, వెంకయ్యనాయుడుని కలిసి పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలపకపోతే ప్రాజెక్టు ప్రశ్నార్థకంగా మారుతుందని, సీఎంగా ప్రమాణస్వీకారం చేయనని చెప్పాను. కేంద్రం వెంటనే ఆర్డినెన్స్ జారీ చేసింది. సమస్యలన్నీ అధిగమించాం. రైట్ మెయిన్ కెనాల్ పటిష్టపర్చాం. పట్టిసీమ పూర్తిచేసి కృష్ణా డెల్టాకు నీళ్లు తెచ్చి కృష్ణా-గోదావరి నదులను అనుసంధానం చేశాం. సమయానికి వర్షాలు పడని సమయంలో ఎగువ నుండి కృష్ణా డెల్టాకు నీరు ఆలస్యంగా వస్తుంది. కానీ పట్టిసీమ పూర్తి చేయడం ద్వారా జూన్‌లోనే నీరందించాం. అప్పుడు కూడా పట్టిసీమ దండగని వైసీపీ రాజకీయం చేసింది. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీళ్లు అందించాం. శ్రీశైలంలో నీటి నిల్వ చేయడం ద్వారా సీమకు అందించాం. అనంతపురం జిల్లాకు నీళ్లిస్తే రాష్ట్రంలోనే ధనిక జిల్లాగా అనంతపురం మారుతుంది. కియా పరిశ్రమను అనంతపురం జిల్లాకు తేవాలన్నప్పుడు నీటి ప్రతిపాదన వచ్చింది. దీంతో గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి చూపించాం. బెంగళూరు విమానాశ్రయానికి అనంతపురం దగ్గరగా ఉంటుంది. పని చూసుకుని వెళ్లొచ్చని సూచించాం. దీంతో అనంతకు కియా కార్ల పరిశ్రమ వచ్చింది’ అని సీఎం చంద్రబాబు వివరించారు.
2014-19 నడుమ పోలవరం పరుగులు
‘2014-19 మధ్య పోలవరం ప్రాజెక్టును పరిగెత్తించాం. ప్రాజెక్టును పూర్తి చేయడానికి పీపీఏ, సీడబ్ల్యూసీని సమన్వయం చేసుకుని ముందుకెళ్లాం. ఒక్క రోజులోనే స్పిల్ ఛానల్ కోసం 32,215 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసి గిన్నిస్ బుక్ రికార్డు సాధించాం. కానీ డయాఫ్రం వాల్ ఎక్కడుందో కూడా తెలియని వాళ్లు మంత్రిగా గత ఐదేళ్లు చేశారు. డయాఫ్రం వాల్ 2 కి.మీ పొడవును 100 మీటర్ల లోతులో జర్మన్ టెక్నాలజీ ద్వారా 414 రోజుల్లో పూర్తి చేశాం. ప్రాజెక్టుకు గేట్ల అమరికను కూడా ప్రారంభించాం. స్పిల్ ఛానల్ పూర్తి చేశాం. మొత్తంగా ప్రాజెక్టును 72 శాతం మేర పూర్తి చేశాం. నేను నేరుగా పోలవరాన్ని 28సార్లు సందర్శించా. 82సార్లు వర్చువల్‌గా సమీక్షించాను. టీడీపీ ప్రభుత్వం కొనసాగివుంటే 2021నాటికి ప్రాజెక్టు పూర్తయ్యేది. కానీ 2019లో వచ్చిన ప్రభుత్వం రివర్స్ టెండరింగ్‌కు వెళ్లింది. బుద్దీ జ్ఞానమున్నవాళ్లు ఇంలాంటి పనులు చేస్తారా? రాజకీయ కక్షతో ప్రాజెక్టును నాశనం చేశారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగానే ప్రాజెక్టును నిలిపేస్తున్నట్టు చెప్పారు. సైట్‌లో నిర్మాణ సంస్థను కూడా ఖాళీ చేయించారు.
అధికారులను మార్చేశారు. అవగాహనరాహిత్యం, చేతకానితనంతో ప్రాజెక్టును నిర్వీర్యం చేశారు. కనీసం 15 నెలలపాటు ప్రాజెక్టువైపు కన్నెత్తి చూడలేదు. 2020 ఆగస్టులో వచ్చిన వరదలతో డయాఫ్రంవాల్ దెబ్బతింది. ఏడాదిపాటు డయాఫ్రం వాల్ దెబ్బతిందని కూడా నిర్ధారించలేకపోయారు. కుట్ర, అవినీతి, అనాలోచిత నిర్ణయంవల్ల ప్రాజెక్టు సర్వనాశనమైంది. సెంట్రల్ వాటర్ కమిషన్ హైదరాబాద్ ఐఐటీ ప్రతినిధులను పంపి పరిశీలన చేయించి డయాఫ్రం వాల్ దెబ్బతిందని నిర్ధారించారు. రూ.440 కోట్లతో నాడు డయాఫ్రం వాల్ నిర్మించాం. ఇప్పుడు దాన్ని రిపేరు చేయాలంటే రూ.490 కోట్లు అవసరం. అయినా నిలబడుతుందని గ్యారంటీ లేదు. మళ్లీ కొత్త డయాఫ్రం వాల్ కట్టడం వల్ల రూ.990 కోట్లు ఖర్చవుతుంది. ప్రాజెక్టు ఆలస్యం, ఖర్చు ఎక్కువ అవ్వడంతో వేల కోట్ల నష్టం వాటిల్లింది. 2019నాటికి 71.93 శాతం పూర్తి చేస్తే… గత ప్రభుత్వం కేవలం 3.84 శాతం మాత్రమే పూర్తి చేసింది. నాడు మేము ప్రాజెక్టుపై ప్రశ్నిస్తే ఇదే సభలో ఒక మంత్రి పర్సెంటా.. అరపర్సంటా తొందరెందుకన్నా అని హేళనగా మాట్లాడారు. వాళ్లకు క్యూసెక్కుకు, టీఎంసీకి తేడా తెలీకపోవడం రాష్ట్రం చేసుకున్న దురదృష్టం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
45.72 మీటర్ల ఎత్తులోనే పోలవరం డ్యాం నిర్మాణం
‘పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 2019నాటికి రూ.16,493 కోట్లదాకా ఖర్చు పెడితే, గత ప్రభుత్వం కేవలం రూ.4,900 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. పోలవరం పూర్తయితే 190 టీఎంసీ నింపుకోవచ్చు. అన్ని విధ్వంసాలు చేసింది కాక మళ్లీ గోదావరి నుండి శ్రీశైలానికి నీళ్లు తీసుకెళ్తామని చెప్పారు. గతంలో ఎన్టీఆర్ రాయలసీమకు నీళ్లివ్వకుండా తమిళనాడుకు నీళ్లిచ్చేది లేదని చెప్పారు. తమిళనాడుకు 5 టీఎంసీ నీళ్లివ్వడంతోపాటు కాల్వల ద్వారా నెల్లూరు జిల్లాకు నీళ్లు వెళ్తున్నాయి. రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు చూసినా టీడీపీ హయాంలో పూర్తి చేసినవే. పోలవరం ఎత్తు 45.72 మీటర్లుగానే ఉంటుంది. కానీ గత పాలకులు ఫేజ్ 1 అంటూ 41.15 మీటర్లకు కుదించారు. 45.72 మీటర్ల ఎత్తుతోనే ప్రాజెక్టు నిర్మాణం ఉంటుంది. దీనికి కేంద్రం కూడా కట్టుబడి ఉంది. ఎత్తు తగ్గిస్తారని డ్రామాలు ఆడుతున్నారు. పోలవరం ద్వారా 350 టీఎంసీ నీళ్లు ఉపయోగించుకోవచ్చు. కుడి కాల్వ ద్వారా 3.2 లక్షల ఎకరాలు, ఎడమ కాల్వ ద్వారా 4 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వస్తుంది.
మరో 24 లక్షల ఎకరాలను స్థిరీకరించవచ్చు. 80 టీఎంసీ జలాలను కృష్ణా ఆయకట్టుకు, 23.44 టీఎంసీ నీటిని విశాఖకు తరలించవచ్చు. 960 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేసుకునే అవకాశముంది. 540 గ్రామాల్లోని 29 లక్షల మందికి తాగునీరు అందించవచ్చు. పోలవరం నిర్మాణం మనందరి బాధ్యత. నిర్ధిష్ట సమయంలోనే ప్రాజెక్టును పూర్తి చేస్తాం. సీఎంగా బాధ్యతలు చేపట్టాక మొదటిసారి పోలవరాన్నే సందర్శించాను. ప్రాజెక్టు పూర్తికి కేంద్రం రూ.12,157 కోట్లు మంజూరు చేసింది. పనులు ప్రారంభించేందుకు ఇప్పటికే రూ.2,345 కోట్లు విడుదల చేయడంతో పాటు రూ.460 కోట్లు రీయింబర్స్ చేసింది. ప్రాజెక్టును పూర్తి చేసే కొద్దీ డబ్బులు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉంది’ అని సీఎం చంద్రబాబు సభకు వివరించారు.
జనవరినుండి కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం
‘2025 జనవరి నుండి కొత్త డయాఫ్రంవాల్ నిర్మాణం చేపట్టి 2026కు పూర్తి చేస్తాం. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా విశాఖ, అక్కడి నుండి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా నీరందిస్తాం. గత ప్రభుత్వం ఐదేళ్లలో తట్టమట్టి కూడా తీయలేదు. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్‌కు రూ.960 కోట్లతో త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తాం. వచ్చే వర్షాకాలం నాటికి అనకాపల్లికి నీరందిస్తాం. పోలవరం ఎడమ కాల్వ ద్వారా వంశధార వరకు అనుసంధానం చేయాలనే ఆలోచనలో ఉన్నాం. తద్వారా వంశధారలో ఎక్కువ నీరుంటే దిగువకు కూడా వచ్చేలా చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్ గ్యాప్ 1 ఫిబ్రవరి 2026నాటికి, గ్యాప్-2 2027 డిసెంబర్ నాటికి పూర్తవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో 2027 నాటికి పోలవరం పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం.
కూటమి ప్రజాప్రతినిధులు ప్రజల వద్దకు వెళ్లి గర్వంగా ప్రాజెక్టును పూర్తి చేశామని చెప్పేలా చేస్తాం. గోదావరి నీళ్లు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వంశధార ఫేజ్ 2, తోటపల్లి, రామతీర్థ సాగరం, మహేంద్రతనయ ఆఫ్ షోర్, ముద్దవలస, జంరaావతి, నాగావళి-వంశధార అనుసంధానం, వంశధార-బహుదా అనుసంధానం చేసి తూర్పు గోదావరి నుండి ఉత్తరాంధ్ర వరకు 200 టీఎంసీ వృధా జలాలను సమర్థవంతంగా ఉపయోగించుకునేలా రూపకల్పన చేస్తా’మని మఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.
రాష్ట్రంలోని ప్రతి ఎకరాకూ నీరు
‘శ్రీశైలం నుండి ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు, తెలుగుగంగ, గాలేరు, నగరి ద్వారా రాయలసీమకు నీరిస్తాం. హంద్రీనీవా సుజల స్రవంతి ఫేజ్-1, ఫేజ్-2 ద్వారా గాలేరు నగరి, తెలుగుగంగ ప్రాజెక్టు, కేసీ కెనాల్, భైరవానితప్పి, తుంగభద్రలో లెవల్ కెనాల్, హై లెవల్ కెనాల్, అప్పర్ పెన్నా, వేదావతి, గురురాఘవేంద్ర ప్రాజెక్టుల ద్వారా రాయలసీమలోని ప్రతి ఎకరాకూ నీరందిస్తాం. కర్నూలు జిల్లాలో 3, 4 నియోజకవర్గాలకు తప్ప మిగతా అన్ని ప్రాంతాలు నీటి సమస్యను అధిగమించవచ్చు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతానికీ నీరందిస్తాం. గుండ్రేవుల, ఆర్డీఎస్ రైట్ మెయిన్ కెనాల్ కూడా పూర్తి చేస్తాం. ఇరుగుపొరుగు రాష్ట్రాలతో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ముందుకెళ్తాం. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు నాగార్జునసాగర్ కుడికాల్వ, వెలుగొండ, గుండ్లకమ్మ, సోమశిల ప్రాజెక్టు, హైలెవల్ లెఫ్ట్ కెనాల్, సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్, బాలాజీ రిజర్వాయర్, శ్రీనివాస రిజర్వాయర్, మల్లెమడుగు, స్వర్ణముఖి రిజర్వాయర్ ద్వారా నీళ్లిస్తాం.
కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావర జిల్లాలకు పోలవరం కుడి కాల్వ సమగ్ర వినియోగంతో పాటు పులిచింతల, చింతలపూడి ఎత్తిపోతలతో పాటు గోదావరి- కృష్ణా-పెన్నా నదుల అనుసంధానం ఫేజ్1 ద్వారా సాగర్ కుడి కాల్వకు నీళ్లిస్తాం. వరికపూడిశెల, వేదాద్రి, గుంటూరు ఛానల్ విస్తరణ, పట్టిసీమ, తాడిపూడి ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరిస్తాం. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు పోలరవం ఎడమ కాల్వ, పుష్కర, పురుషోత్తపట్నం ఎత్తిపోతల-గోదావరి ఏలేరు అనుసంధానం ద్వారా ఆ జిల్లాలకు నీరందిస్తాం. గోదావరి నీళ్లు ప్రకాశం బ్యారేజీకి తెచ్చి సాగర్ రైట్ మెయిన్ కెనాల్ కు మళ్లిస్తాం. సాగర్ మెయిన్ కెనాల్ కు గోదావరి నీళ్లు 150 టీఎంసీలు తీసుకెళ్తే…శ్రీశైలంలో మిగులు నీళ్లు నిల్వ చేస్తే సీమకు ఆ నీటిని అందించవచ్చు. బొల్లాపల్లిలో రిజర్వాయర్ కడితే 150 టీఎంసీలు నిల్వ చేయవచ్చు. బొల్లాపల్లి బ్యాక్ వాటర్‌ను నాగార్జున సాగర్‌కు తీసుకెళ్లవచ్చు. పోలవరం నుండి కృష్ణానదికి, అక్కడి నుండి బొల్లాపల్లి, బొల్లాపల్లి నుండి సోమశిల ప్రాజెక్టుకు ప్రతిపాదనలపై చర్చిస్తున్నాం. ఈ ప్రాజెక్టును అనుకున్న విధంగా పూర్తి చేసి రాయలసీమకు నీటి కష్టాలు తీరుస్తాం. దీనికి సుమారు రూ.70 వేల కోట్లు ఖర్చవుతుంది’ అని చంద్రబాబు వివరించారు.
వెలుగొండను పూర్తి చేయకుండానే రిబ్బన్‌కట్ చేశారు
‘ఏటా కొన్ని వేల టీఎంసీ నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. గోదావరి నది ద్వారా 4,215 టీఎంసీ నీళ్ల సముద్రంలో కలిశాయి. అందులో మనం వాడుకుంది 126 టీఎంసీ మాత్రమే. కృష్ణా నుండి 845 టీఎంసీ సముద్రంలో కలిశాయి. మన రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల నీటి సామర్థ్యం 1015 టీఎంసీ. ఈసారి దేవుడు కరుణించడంతో అన్ని రిజర్వాయర్లలో నీళ్లున్నాయి. 900 టీఎంసీ జలాలు రిజర్వాయర్లలో ఉన్నాయి. వరుణదేవుడు మాతోనే ఉన్నాడని చెప్పుకున్న వారి హయాంలో 400 టీంసీ కూడా లేవు. ఈ యేడాది నీళ్లు సముద్రంలో పోతుంటే చూసి నిద్రరాలేదు. అన్ని రిజర్వాయర్లలో నీళ్లు నింపితే రెండేళ్లపాటు కరవు రాదని ఆలోచించి ప్రాజెక్టులను నీటితో నింపేందుకు శ్రద్ధపెట్టాం. జలవనరుల శాఖ అధికారులు, మంత్రి నిమ్మల రామానాయుడును అభినందిస్తున్నా. తుంగభద్ర డ్యాంమ్‌లో గేటు కొట్టుకుపోతే కర్నాటక ప్రభుత్వం వదిలేసింది. మనం కన్నయ్యనాయుడుని పంపి గేటు అమర్చేలా చేసి నీటి వృధాను అరికట్టాం.
వెలుగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది నేనే… పూర్తి చేసి ప్రారంభించేది కూడా నేనే. పనులు పూర్తి చేయకుండానే జగన్ రిబ్బన్ కట్ చేశారు. కుప్పంలో అయితే ఇక సినిమా సెట్టింగ్ వేసి ట్యాంకర్లలో నీళ్లు తెచ్చిపోసి డ్రామాలు ఆడారు. నీళ్లెక్కడ అని కుప్పం రైతులు అడిగితే సమాధానం లేదు. హంద్రీనీవా కాల్వను విస్తరించి వచ్చే యేడాది కుప్పం, మడకశిరకు నీళ్లు ఇస్తాం. బైరవానితిప్ప, పేరూరు డ్యాములు కూడా పూర్తి చేస్తాం. నదుల అనుసంధానం ద్వారా ప్రతి మారుమూల గ్రామానికి నీరందిస్తే తాగు, సాగునీటికి ఇబ్బందులు ఉండవు’ అని సీఎం చంద్రబాబు నాయుడు సభకు వివరించారు.