- కేంద్ర బడ్జెట్ పరిమాణం రూ.48.21 లక్షల కోట్లు
- మొత్తం ఆదాయం రూ.32.07 లక్షల కోట్లు
- పన్ను ఆదాయం రూ.28.83 లక్షల కోట్లు
- ద్రవ్యలోటు 4.9 శాతంగా ఉండొచ్చని అంచనా
- అప్పులు, పన్నేతర ఆదాయాలు రూ.16 లక్షల కోట్లు అంచనా
- గ్రామీణాభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు
- నూతన పింఛన్ విధానంలో త్వరలో మార్పులు
- మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్‌లో పెద్దపీట
- రూ.11.11 లక్షల కోట్లు కేటాయించిన కేంద్రం
- మహిళాభివృద్ధికి రూ.3 లక్షల కోట్లు
- గ్రామీణాభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు
- అర్బన్ హౌసింగ్ కోసం రూ.2.2 లక్షల కోట్లు
- వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.1.52 లక్షల కోట్లు
- స్టాంప్ డ్యూటీ పెంచుకునేందుకు రాష్ట్రాలకు అనుమతి
- మహిళల ఆస్తుల రిజిస్ట్రేషన్‌పై స్టాంప్ డ్యూటీతగ్గింపు
- ముద్రలోన్ పరిమితి రూ.20 లక్షలకు పెంపు
- యువత కోసం ఐదు పథకాలతో పీఎం ప్యాకేజ్
- విద్య, నైపుణ్యాభివృద్ధికి రూ.లక్షా 48 వేల కోట్లు
- కోటి ఇళ్లకు సోలార్ ప్యానెళ్ల ద్వారా ఉచిత విద్యుత్
- ఐదు వరద బాధిత రాష్ట్రాలకు ప్రత్యేక నిధులు
- ఎంఎస్‌ఎంఇలకు కెడిట్ గ్యారంటీ పథకాలు
- త్వరలో రూ.100 కోట్ల రుణాలిచ్చే కొత్త పథకం
- యంత్రపరికరాల కొనుగోలుకు టెర్మ్ రుణాలు
- 100 నగరాల్లో ప్లగ్ అండ్ ప్లే తరహా పారిశ్రామిక పార్కులు
- దేశంలో చిన్న ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి ప్రోత్సాహం
- వారణాసి తరహాలో గయలో టెంపుల్ కారిడార్
ఢిల్లీ (చైతన్య రథం): ఎన్నో ఆశలు, భారీ అంచనాల మధ్య కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. లోక్‌సభలో 11.04 గంటలకు ప్రారంభమైన బడ్జెట్ ప్రసంగం 12.30 వరకు సాగింది. మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలు సంతృప్తిపరుస్తూనే.. ఎన్డీయే సర్కారు లక్ష్యంగా పెట్టుకున్న వికసిత్ భారత్ దిశగా కేంద్ర బడ్జెట్ రూపకల్పన సాగింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 7వసారి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ `ఆర్థికరంగానికి ఊతమిచ్చేదే. కేంద్ర బడ్జెట్ పరిమాణం రూ.48.21 లక్షల కోట్లు. మొత్తం ఆదాయం రూ.32.07 లక్షల కోట్లు. పన్ను ఆదాయం రూ.28.83 లక్షల కోట్లు. ద్రవ్యలోటు 4.9 శాతం ఉండవచ్చని అంచనా. అప్పులు, పన్నేతర ఆదాయాలు రూ.16 లక్షల కోట్లుగా అంచనా వేశారు.
నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి బడ్జెట్ ఇది. ఎన్నికలకు ముందు ప్రకటించినట్టే.. వికసిత్ భారత్ లక్ష్యంగా సాగిన బడ్జెట్‌పై సహజంగానే ఉత్కంఠ కనిపించింది. మూడోసారి అధికారంలోకి తీసుకొచ్చిన ప్రజలపై మొదీ సర్కారు ఎలాంటి వరాలు కురిపించనుందోనని దేశ ప్రజలు ఆసక్తిగా చూశారు. వారి అంచనాలకు తగినట్లే.. పలు సంస్కరణలను ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆదాయపు పన్నుపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. స్టాండర్డ్ డిడక్షన్ రూ.50వేల నుంచి రూ.75వేలకు పెంచగా.. కొత్త పన్ను విధానంలో ఉన్నవారు మాత్రమే దీనివల్ల ప్రయోజనం పొందుతారు.
నిర్మలమ్మ పద్దులో కీలకాంశాలు
తొమ్మిది ప్రాధాన్యాంశాల ఆధారంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024`25 బడ్జెట్ రూపొందించారు. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత, ఉద్యోగ కల్పన- నైపుణ్యాభివృద్ధి, సామాజిక న్యాయం, పట్టణాభివృద్ధి, ఇంధన భద్రత, మౌలిక రంగం, పరిశోధన- ఆవిష్కరణలు, తయారీ-సేవలు, తర్వాత తరం సంస్కరణలను ప్రాధాన్యంగా తీసుకున్నారు నిర్మలమ్మ.
స్టాండర్డ్ డిడక్షన్ రూ.50వేల నుంచి రూ.75వేలకు పెంపు. కొత్త పన్ను విధానం శ్లాబుల్లో మార్పులు. సున్నానుంచి రూ.3 లక్షల వరకు ఎలాంటి పన్నూ లేదు.
మొబైల్ ఫోన్లు, మొబైల్ పీసీడీఏ, మొబైల్ ఛార్జర్లపై విధించే బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 15 శాతానికి తగ్గింపు. బంగారం, వెండిపై దిగుమతి సుంకం 6 శాతానికి తగ్గింపు. ప్లాటినమ్‌పై 6.4శాతానికి కుదింపు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 3 కోట్ల అదనపు ఇళ్ల నిర్మాణం. అర్బన్ హౌసింగ్ కోసం ఐదేళ్లలో రూ.2.2 లక్షల కోట్లు కేటాయింపు.
పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేసే కార్మికుల కోసం అద్దె గృహాల నిర్మాణం. పీపీపీ విధానంలో డార్మిటరీ తరహా ఇళ్ల నిర్మాణం.
ముద్రా రుణాలు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంపు. బడ్జెట్లో గ్రామీణాభివృద్ధికి రూ.2.6 లక్షల కోట్లు కేటాయింపు
ప్రకృతి వ్యవసాయంలోకి దేశవ్యాప్తంగా కోటిమంది రైతులను తీసుకొచ్చే ప్రణాళిక. 5 రాష్ట్రాల్లో కిసాన్ క్రెడిట్ కార్డులు. వ్యవసాయం దాని అనుబంధ రంగాల అభివృద్ధికి రూ.1.5 లక్షల కోట్లు.
వచ్చే ఐదేళ్లలో 20 లక్షలమంది యువతకు నైపుణ్యాల శిక్షణ. 500 పెద్ద కంపెనీల్లో ఇంటర్న్‌షిప్‌లు.
దేశీయ విద్యాసంస్థల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు విద్యార్థులకు రూ.10 లక్షల వరకు విద్యా రుణాలు.
మౌలిక సదుపాయాల కల్పనకు రూ.11.11 లక్షల కోట్ల కేటాయింపు. జీడీపీలో ఇది 3.4 శాతానికి సమానం.
మహిళలు, బాలికల కోసం రూ.3 లక్షల కోట్లతో పథకాలు. విద్య, ఉపాధి, నైపుణ్యాలభివృద్ధికి రూ.1.48 లక్షల కోట్లు.
ఎంపిక చేసిన నగరాల్లో స్ట్రీట్ ఫుడ్ హబ్‌ల ఏర్పాటు. రాష్ట్రాల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు రూ.1.5 లక్షల కోట్లతో దీర్ఘకాల వడ్డీరహిత రుణాలు.
కొత్త ఉద్యోగులకు మూడు ప్రోత్సాహకాలు. సంఘటిత రంగంలోకి ప్రవేశించిన తొలిసారి ఉద్యోగులకు ఒక నెల వేతనం మూడు వాయిదాల్లో గరిష్టంగా రూ.15 వేలు చెల్లింపు. నెలకు గరిష్టంగా రూ.లక్షలోపు వేతనం ఉన్నవారు అర్హులు. దీనివల్ల 210 లక్షల మంది యువతకు లబ్ది.
పీఎం స్వనిధి కింద వంద నగరాల్లో ప్రత్యేక వారాంతపు సంతల ఏర్పాటు.
క్యాపిటల్ గెయిన్స్ విధానం సరళీకరణ, దీర్ఘకాల లాభాలపై 12.5శాతం పన్ను. స్టార్టప్‌లకు ప్రోత్సాహకం. ఏంజెల్ ట్యాక్స్ రద్దు.