- రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా పెద్ద ఎత్తున ఆవిష్కరణలు రావాలి
- ఏఐ సాయంతో వైద్య ఖర్చులు తగ్గించేలా చర్యలు
- వేసవిలో వడగాలుల మరణాలు ఉండకూడదు
- 6వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు
అమరావతి (చైతన్య రథం): ప్రభుత్వంలోని అన్ని విభాగాలు ప్రజా కోణంలోనే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని, జరుగుతోన్న ప్రగతికి సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. ముఖ్యంగా అటవీ శాఖ పనితీరు పీపుల్స్ ఫ్రెండ్లీగా మరింతగా మారాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఇక జూనియర్ ఐఏఎస్‌లకు హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చేలా సీనియర్లు సహకరించాలని దిశానిర్దేశం చేశారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో 6వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ రెండో రోజున వివిధ అంశాలపై సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ… “ఏఐ సాయంతో వైద్య పరీక్షలు నిర్వహించే వ్యవస్థలను అందుబాటులోకి తీసుకురావటం అభినందనీయం. తక్కువ వ్యయంతో పోర్టబుల్‌గా ఉండేలా మెడ్ టెక్ టూల్స్ తయారు చేయాలి. ఆర్టీఐహెచ్ ద్వారా మరిన్ని ఆవిష్కరణల్ని చేసి ప్రజారోగ్యం కోసం వినియోగిద్దాం. రూట్, రోడ్ ఆప్టిమైజేషన్ కూడా చేసుకుని 108 అంబులెన్సులు త్వరితగతిన చేరుకునేలా చూడాలి. మారుమూల ప్రాంతాల్లో ఉండే వ్యక్తులను కూడా అతి తక్కువ టైమ్‌లో 108 చేరుకోవాలి. ఈసారి వేసవి ప్రభావం ఎక్కువ ఉంటుందని అంచనాలున్నాయి. వడగాలుల ప్రభావంపై ముందుగానే ప్రచారం చేపట్టాలి. వేసవిలో ప్రజలు సురక్షితంగా ఉండేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. పశువులకు నీటితొట్టెలను పెద్దఎత్తున నిర్మించాం. ఆ తొట్టెల్లో నీళ్లు నింపేలా చర్యలు తీసుకోవాలి. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల నిధులనుంచి పశు భీమా పథకాన్ని కూడా సమర్ధంగా అమలు చేయాలి. ఎండలో పని చేసే ఉపాధి హామీ కూలీలకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి. వడగాలులవల్ల ఒక్క మరణం కూడా జరగడానికి వీల్లేదు” అని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
అభివృద్ధికి అటవీ శాఖ ఆటంకంగా మారకూడదు
“అభివృద్ధికి, మౌలిక సదుపాయల కల్పనకు అటవీ శాఖ సహకరించాలి. నాలుగోసారి సీఎంగా చేస్తున్నాను. కానీ గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి అటవీ శాఖ విషయంలో చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిపై ఇప్పటికే డిప్యూటీ సీఎంతో మాట్లాడాను. మళ్లీ మరోసారి మాట్లడతాను. పోలీసు డిపార్ట్మెంట్ పీపుల్ ఫ్రెండ్లీగా మారిపోయింది. కానీ ఫారెస్టు డిపార్టుమెంట్ పీపుల్ ఫ్రెండ్లీగా లేరు. మారాల్సిన అవసరం ఉంది. అటవీ శాఖ గ్రీన్ కవర్ పెంచే అంశంపై దృష్టి పెట్టాలి. బయోడైవర్సిటీకి వెళ్లాలి. ప్రజలు ఆహ్లాదంగా పర్యటించేందుకు ఉపయుక్తంగా పరిస్థితులు మారాలి. ఫారెస్టు అధికారులు జిల్లా కలెక్టర్ కిందే పనిచేయాలని గుర్తుంచుకోవాలి. కలెక్టర్లు చెబుతున్నా… అటవీ అధికారులు పట్టించుకోవడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. నిబంధనలకు అనుగుణంగానే పర్యావరణహిత ప్రాజెక్టులకు సహకరించాలి. సర్వే చేస్తున్న సమయంలో ప్రైవేటు, అటవీ, ఎండోమెంట్ తదితర క్లాసిఫికేషన్ల ప్రకారం రిజర్వు ల్యాండ్ గుర్తించాలి. కొందరు అటవీ శాఖ అధికారుల ఇంప్రాక్టికల్ థింకింగ్ వల్ల ఇబ్బందులు వస్తున్నాయి.
గిరిజన ప్రాంతాల్లో కూడా మౌలిక సదుపాయాలు కల్పించకపోతే ఎలా..? నడకదారిన శ్రీశైలం వస్తున్న భక్తులను అటవీ శాఖ అధికారులు అడ్డుకున్నారు. ఆ తర్వాత రోజే తొక్కిసలాట అయ్యే పరిస్థితి వచ్చింది. బద్వేలులోనూ అటవీ శాఖ ఇదే తరహాలో వ్యవహరించింది. ఏమైనా ఇబ్బందులుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. ప్రజలను ఇబ్బంది పెట్టేలా… కార్యక్రమాలకు ఆటంకం కలిగేలా వ్యవహరించకూడదు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా వినూత్న ఆలోచనలు చేయాలి. స్టార్టప్ కంపెనీలు, యువతలో ఉన్న ఇన్నోవేషన్లను ప్రొత్సహించేందుకు ఆర్టీఐహెచ్ (రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్) అధికారులు పని చేయాలి. ఆర్టీఐహెచ్‌ను మరింత యాక్టీవ్ చేయాల్సిన అవసరం ఉంది. వినూత్నంగా ఆలోచిస్తారు కాబట్టే… ఆర్టీఐహెచ్‌కు యువ అధికారులను నియమించాం. యువ అధికారులకు సీనియర్లు సహకరించాలి. వారికి హ్యండ్ హోల్డింగ్ అందించాలి” అని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సమావేశంలో మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు.














