- అంతర్జాతీయ పోటీల్లో ఏపీ క్రీడాకారులు రాణించాలి
- ఆ దిశగా శాప్, క్రీడా అసోసియేషన్ల సమన్వయం
- అధికారులకు శాప్ ఛైర్మన్ రవినాయుడు దిశానిర్ధేశం
విజయవాడ (చైతన్య రథం): క్రీడాకారుల భవిష్యత్తే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని, దానికి అనుగుణంగా క్రీడా సంఘాలు, శాప్ అధికార యంత్రాంగం సమన్వయం చేసుకుని క్రీడాకారులకు అన్ని విధాలుగా తోడ్పాటునందించాలని శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు ఆకాంక్షించారు. విజయవాడలోని శాప్ కార్యాలయంలో అధికారులకు, కోచ్‌లకు క్రీడారంగంలో అమలుచేయాల్సిన అంశాలపై సోమవారం దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జరిగే క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు రాణించే దిశగా, పతకాలు సాధించి ఏపీని ముందంజలో ఉంచేలా ప్రోత్సహించాలన్నారు. క్రీడాకారులకు కల్పించే వసతులు, సౌకర్యాలపైనే వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని, క్రీడాకారులు రాణింపుతోనే దేశ కీర్తిప్రతిష్టలు ఇనుమడిస్తాయన్నారు. వచ్చే జనవరి 25నుంచి ఫిబ్రవరి 17వరకూ ఉత్తరాఖాండ్‌లో జరిగే 38వ జాతీయస్థాయి క్రీడాపోటీలకు సంబంధించి క్రీడాకారులకు కల్పించాల్సిన వసతులు, సౌకర్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. క్రీడాకారులకు ఇబ్బందులు లేకుండా వారికి కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. ముఖ్యంగా జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు మరింత మెరుగైన శిక్షణ అందించాలని, దానికోసం కోచ్‌లు వ్యూహాత్మకంగా శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైతే శిక్షణ ఇచ్చేందుకు సామర్థ్యం కలిగిన కోచ్‌లను డిప్యుటేషన్ మీద శిక్షణ శిబిరానికి తీసుకురావాలన్నారు. ఉత్తరాఖాండ్‌లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో ఏపీ క్రీడాకారులు భారీగా పతకాలు సాధించాలన్నారు.
స్కేటర్ జెస్సీరాజ్‌కు అభినందనలు..
ప్రధానమంత్రి బాలపురస్కార్-2025 అవార్డు గ్రహీత స్కేటర్ జెస్సీరాజ్ విజయవాడలోని శాప్ కార్యాలయంలో శాప్ ఛైర్మన్ రవినాయుడుని సోమవారం కలిశారు. స్కేటింగ్‌లో ఇప్పటివరకూ సాధించిన పతకాలు, అవార్డుల గురించి ఆమె వివరించారు. ఈ సందర్భంగా శాప్ ఛైర్మన్ ఆమెను అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నతశిఖరాలను అధిరోహించాలని, శాప్‌నుంచి పూర్తి సహాయసహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు.
బోసియా నేషనల్స్ పోస్టర్ ఆవిష్కరణ
2025 జనవరి 8నుంచి 16వరకూ విశాఖలోని స్టీల్‌ప్లాంట్ క్యాంపస్‌లో ఏపీ మెడ్‌టెక్ జోన్ ఆధ్వర్యంలో 9వ బోసియా సబ్ జూనియర్, సీనియర్ నేషనల్ ఛాంపియన్‌షిప్ పోటీలను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను శాప్ ఛైర్మన్ రవినాయుడు సోమవారం ఆవిష్కరించారు.