అమరావతి (చైతన్య రథం): పేదల కోసం ప్రభుత్వం నిర్మించే ఇళ్లకు స్థలమిచ్చేందుకు సత్తెనపల్లికి చెందిన వృద్ధురాలు ముందుకొచ్చారు. తమ గ్రామంలోని 15 పేద కుటుంబాలకు ప్రభుత్వం ఇళ్లు నిర్మిస్తే, అందుకు తాను తన సొంతస్థలం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిపారు. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం కమ్మవారిపాలానికి చెందిన నరిశెట్టి రాజమ్మ సోమవారం సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసి వదర బాధితుల సహాయార్ధం చెక్కు అందించారు. ఈ నేపథ్యంలో తమ గ్రామంలో ఇళ్లులేని పేద కుటుంబాలున్నాయని, వారికి ప్రభుత్వం తరపున ఇళ్లు మంజూరు చేస్తే అందుకు అవసరమైన 2 లేదా 3 సెంట్ల చొప్పున స్థలం సమకూర్చుతానని తెలిపారు. త్వరలో గృహ నిర్మాణ పథకం ప్రారంభమవుతుందని, ఆ సమయంలో అధికారులు సంప్రదిస్తారని సీఎం చంద్రబాబు ఆమెతో అన్నారు. పేదల ఇళ్ల నిర్మాణానికి స్థలం ఇచ్చేందుకు ఉదారంగా ముందుకొచ్చిన రాజమ్మను సీఎం చంద్రబాబు అభినందించారు.