- ఆరు నూతన పాలసీలు రాష్ట్ర ప్రగతిని మారుస్తాయి
- వన్ ఫ్యామిలీ..వన్ ఎంటర్‌ప్రెన్యూర్ నినాదంతో ముందుకు
- రాష్ట్రంలో ఐదు జోన్లలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లు
- 10 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయం
- ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి యువత ఎదగాలన్నదే ఆశయం
- సంక్రాంతి నాటికి రాష్ట్రంలో గుంతలు లేని రహదారులు
- ఉచిత ఇసుక విధానంలో రాజకీయ జోక్యాన్ని సహించేది లేదు
- ప్రజలపై అనవసర కేసులు పెడితే అధికారులను సస్పెండ్ చేస్తాం
- అక్రమ మద్యం వ్యాపారం చేస్తే ఎంతటివారైనా వదిలిపెట్టం
- మాదక ద్రవ్యాలతో నేరాలకు పాల్పడితే సంఘ బహిష్కరణ
- మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి(చైతన్యరథం): రాబోయే ఐదు సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఆరు నూతన పబ్లిక్ పాలసీలు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. బుధవారం సచివాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ ఆరు కొత్త పబ్లిక్ పాలసీల గురించి వివరించారు. ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 4.0, ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ పాలసీ 4.0, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0, ఏపీ ఎంఎస్‌ఎంఈ-ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ పాలసీ 4.0, ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ 4.0, ఏపీ ఎలక్ట్రానిక్స్ పాలసీ 4.0 అనే పాలసీలను జాబ్ ఫస్ట్ అనే ఆశయంతో తీసుకొచ్చినట్టు చెప్పారు. రాష్ట్రాభివృద్ధి, ఉపాధి, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఈ పాలసీలు రూపొందించినట్టు తెలిపారు. వన్ ఫ్యామిలీ`వన్ ఎంటర్‌ప్రెన్యూర్ (ఒక కుటుం బం..ఒక పారిశ్రామికవేత్త), థింక్ గ్లోబల్లీ, యాక్ట్ గ్లోబల్లీ అనేది తమ నినాదమన్నారు. ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి యువత ఎదగాలన్నదే తమ ఆశయమని వివరించారు. ఈ ఆరు పాలసీలు రాష్ట్ర ప్రగతినే మార్చేస్తాయని.. ఇది ఒక గేమ్ ఛేంజర్ అని వ్యాఖ్యానించారు. గతంలో ఎంత పెట్టుబడి పెడుతున్నారు అనే దృక్పథంతో వెళ్లే వాళ్లమని, ఇప్పుడు ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తున్నారనే దృక్పథంతో ముందుకెళుతున్నామని తెలిపారు.
రతన్ టాటా పేరిట ఇన్నోవేషన్ హబ్‌లు
విలువలతో కూడిన వ్యాపారం చేయడం ద్వారా వ్యాపార సామ్రాజ్యం సృష్టించవచ్చు అని చెప్పడానికి రతన్ టాటా ఒక ఉదాహరణ. ఆయన తన తెలివితేటలు, నిజాయితీతో 28 కంపెనీలు స్థాపించారు. 400 బిలియన్ డాలర్ల వ్యాపారం చేశారు. తన వ్యాపార సామ్రాజ్యాన్ని వంద దేశాలకు విస్తరించగడలడం చాలా గొప్ప విషయం. ఆయన పేరిట రాష్ట్రంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. అమరావతిలో ఒక ప్రధా న ఇన్నోవేషన్ హబ్ ఉంటుంది. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలన్నింటికీ ఉపయోగకరంగా ఉండేలా విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, అనంతపురం ఐదు జోన్లలో కూడా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. ఇవన్నీ నాలెడ్జ్ హబ్‌లుగా ఉంటాయి. గత ప్రభుత్వం తీరు వల్ల మన రాష్ట్రానికున్న బ్రాండ్ ఇమేజ్ మొత్తం దెబ్బతింది. దాన్ని మళ్లీ పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది. ప్రపంచానికి ఏపీని ఆక్వా కల్చర్ హబ్‌గా తయారు చేస్తాం. ఫుడ్ ప్రాసెసింగ్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తాం. రాయలసీమను హార్టికల్చ ర్ హబ్‌గా మారుస్తాం. రాబోయే రోజుల్లో రాయలసీమ రతనాల సీమగా మారుతుంది. రాష్ట్రాన్ని గ్లోబల్లీ అట్రాక్టివ్ మానుఫ్యాక్చరింగ్ హబ్, గ్రీన్ ఎనర్జీ హబ్‌గా తీర్చిదిద్దుతాం. నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175కి పైగా ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేస్తాం.
ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ పాలసీ
పరిశ్రమలు స్థాపించే వారిని ప్రోత్సహించేలా భారతదేశంలోనే ఒక బెస్ట్ పాలసీని రూపొందించాం. కంపెనీలు స్థాపించే వారు పెట్టే మూలధన పెట్టుబడిలో 75 శాతం ఇన్సెంటివ్స్‌గా ఇస్తున్నాం. అలాగే రాయితీలు కూడా వారు ఇచ్చే ఉద్యోగాలను బట్టి ఉండేలా రూపొందించాం. జాబ్ ఫస్ట్ అనేది మా మొట్టమొదటి ప్రాధాన్యం. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ ప్రెన్యూర్ అనే ఆశయంతో చేపట్టిన పాలసీ ఇది. ఎంఎస్‌ఎంఈలకు రూ.500 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలో ఉండే ఎంఎస్‌ఎంఈలు అన్నింటికీ కూడా నేషనల్ పోర్టల్ పెడతాం. వీకర్ సెక్షన్‌లకు ప్రత్యేక రాయితీలు ఇస్తామని వివరించారు.
ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ
ఎంఎస్‌ఎంఈలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నాం. 3 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పనిచేస్తున్నాం. వేస్ట్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు రాయితీలు కల్పిస్తాం. కోల్డ్ చైన్ లింక్ ఏర్పాటు చేస్తాం. రూ.100 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టే వారికి ప్రత్యేక రాయితీలు ఇస్తాం. ఈ రంగంలో రూ.30 వేల కోట్ల పెట్టుబడులు సాధనే లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు.
ఏపీ ఎలక్ట్రానిక్స్ పాలసీ
రూ.84 వేల కోట్ల పెట్టుబడులు.. 5 లక్షల మందికి ఉపాధి కల్పన లక్ష్యంగా ఈ పాలసీ తీసుకొచ్చాం. 10 ఎకరాలలో నానో పార్కులు, 10-100 ఎకరాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కులు, 100-1000 ఎకరాల్లో లార్జ్ పార్కులు, 1000కి పైగా ఎకరాల్లో మెగా పార్కుల నిర్మాణం చేపడతాం. పారిశ్రామిక అభివృద్ధి జరగాలంటే ముందు మౌలిక సదుపాయాలు ఉండాలి. ప్రస్తుతం నాలుగు ఇండస్ట్రియల్ పార్కులు ఉన్నాయి. ఇప్పుడు ఈ పాలసీలో నాలుగు విధాలుగా ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేసేలా తీసుకొచ్చాం. నానో పార్కులు, ఎంఎస్‌ఎంఈ, లార్జి పార్కులు, మెగా పార్కులు ఏర్పాటు చేసుకునే విధానం తీసుకొచ్చాం.
ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ
రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.50 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రధాన లక్ష్యంగా ఈ పాలసీ రూపొందించాం. 5000 ఈవీ చార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. బినామీలకు చోటు లేకుండా నిజమైన పారిశ్రామికవేత్తలకు అవకాశం కల్పిస్తాం. సింగిల్ విండో క్లియరెన్స్ ఇస్తాం. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ డ్రీమ్డ్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తాం. ప్రపంచంలోనే ఏపీని గ్రీన్-గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా తీర్చిదిద్దుతాం.
మల్లవల్లిలో ఎంఎస్‌ఎంఈలకు న్యాయం చేస్తాం
మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్కు ఇదో విషాదభరితమైన సంఘటన. 35 వేల మందికి ఉద్యోగాలు కల్పించేలా నాడు ఒక పాలసీ తీసుకొచ్చాం. 1,360 ఎకరాల్లో ఎంఎస్‌ఎంఈలు పెట్టేలా పరిశ్రమలు పెట్టే వారికి గతంలో ఎకరా రూ.16.50 లక్షలకు ఇచ్చాం. గత ప్రభుత్వం ఆ భూమి రేటును రూ.89.16 లక్షలు చేసింది. వాళ్లను వేధింపులకు గురి చేసింది. వాళ్లలో చాలామంది కోర్టులకు వెళ్లారు. ఇప్పుడు మళ్లీ నాడు పరిశ్రమలు స్థాపించ డానికి వచ్చిన 349 మందికి వారికి కేటాయించి ఎకరా రూ.16.50 లక్షల ధరకే భూమిని కేటాయిస్తున్నాం. అయితే వారు ఆరు నెలల్లో పనులు మొదలుపెట్టాలి. రెండేళ్లలో ప్రాజెక్టు ను కంప్లీట్ చేయాలని తెలిపారు.
లోకేష్ నేతృత్వంలో క్యాబినెట్ సబ్ కమిటీ
రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యం సాధించడానికి మంత్రివర్గ ఉపసంఘా న్ని ఏర్పాటు చేశాం. ఐటీ మంత్రి నారా లోకేష్ దీనికి చైర్మన్‌గా ఉంటారు. ఇందులో మంత్రులు టీజీ భరత్, గొట్టిపాటి రవి, కందుల దుర్గేశ్, కొండపల్లి శ్రీనివాస్, పి.నారాయ ణ, బీసీ జనార్దన్ రెడ్డిలు సభ్యులుగా ఉంటారు. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశాం. అలాగే స్వర్ణకా రుల కోసం ఒక ప్రత్యేక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.
గంజాయిని ఉక్కుపాదంతో అణిచివేస్తాం
రాష్ట్రంలో గంజాయి, మాదక ద్రవ్యాల విక్రయాలను ఉక్కుపాదంతో అణచివేస్తాం. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, బాధితులకు పునరావాసం లాంటి అంశాలు అధ్యయనం చేసేందుకు మంత్రి వంగలపూడి అనిత చైర్‌పర్సన్‌గా క్యాబినెట్ సబ్‌కమిటీని ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో చాలావరకు నేరాల వెనక గంజాయి బ్యాచ్ ఎక్కువగా ఉంటోంది. వాళ్లను ఉక్కుపాదంతో అణచివేస్తాం. ఇందులో రాజీపడే ప్రసక్తే లేదు. అవసరమైతే అలాం టి వాళ్లను సంఘ విద్రోహులుగా ప్రకటించేలా చర్యలు తీసుకుంటాం. రౌడీషీట్లు తెరచి పోలీసుస్టేషన్లలో వారి ఫొటోలు పెట్టి వారిని విదేశాలకు వెళ్లనివ్వకుండా చేస్తాం. గంజాయి, డ్రగ్స్‌తో నేరాలకు పాల్పడే వారిని సంఘ బహిష్కరణ కూడా చేసేలా చర్యలు తీసుకుంటా మని తెలిపారు.
అక్రమ మద్యం వ్యాపారం చేస్తే ఉపేక్షించం
రాష్ట్రంలో డ్రగ్స్, అక్రమంగా మద్యం వ్యాపారం చేస్తే ఏ పార్టీ వారైనా..ఎంతటి వారినైనా వదలిపెట్టేది లేదని హెచ్చరించారు. అందరూ ప్రభుత్వం తెచ్చిన మద్యం విధానా న్ని అనుసరించాల్సిందేనని స్పష్టం చేశారు. ఇందులో రాజీపడే ప్రసక్తే లేదని తెలిపారు. గత ప్రభుత్వం చేసినవన్నీ చెత్త పనులు. వాళ్లు రాష్ట్రంలో కనీసం చెత్తను కూడా శుభ్రం చేయ కుండా వదిలేసి వెళ్లిపోయారు. చెత్త మీద పన్ను వేసి రాష్ట్రంలో 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త శుభ్రం తొలగించకుండా అలాగే వదిలేసి పోయారు. మళ్లీ ఇప్పుడు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఇలాంటి నాయకులు రాజకీయాల్లో ఉండే అర్హత కూడా లేదు. వాళ్లు చేసిన చెత్త పన్నును రద్దు చేస్తున్నాం. వీళ్లు తొలగించకుండా వదిలేసి వెళ్లిన చెత్తను తొలగిం చాలంటే రూ.వెయ్యి నుంచి రెండు వేల కోట్లు ఖర్చు అవుతుందని అసహనం వ్యక్తం చేశారు.
రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు
వైసీపీ నేతలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు. రథాన్ని తగలబెడతారు.. మళ్లీ నాటకాలు ఆడతారు. బుద్ధి జ్ఞానం ఉండాలి. అలాంటి సంఘటనలను ఖండిరచి క్షమాపణలు చెప్పాల్సిందిపోయి మళ్లీ సిగ్గు లేకుండా విమర్శలు చేస్తారా? సీసీ కెమెరాల్లో వారి బండారం బయటపడిరది. రాష్ట్రంలో 14 వేల కెమెరాలు ఉన్నాయి. కనీసం వాటిని గత ఐదేళ్లలో ఒక్కసారి కూడా ఉపయోగించుకోలేదు అంటే ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. అంత దారుణంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. పంటలపైన అప్పుడప్పుడు అడవి పందులు పడుతుంటాయి. అవి పంట తిని వెళ్లవు.. వెళుతూ వెళుతూ ఆ పంట మొత్తాన్ని సర్వనాశనం చేసి వెళుతుంటాయి. ఆ తరహాలో వీళ్లు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు.
గుంతలు కూడా పూడ్చలేదు
గత ప్రభుత్వం కనీసం రోడ్లపై పడిన గుంతలు కూడా పూడ్చలేదని మండిపడ్డారు. పంచాయతీ రోడ్లకు సంబంధించి జవాబుదారీతనం లేకుండా టెండర్లు వేశారు. పనులు చేయకుండా నిధులు తినేశారు. కనీసం ఆ ఫైళ్లు కూడా కనిపించడం లేదు. రహదారులపై ఉన్న గుంతలను రూ.600 కోట్లతో పూడ్చేస్తున్నాం. సంక్రాంతి తరువాత రాష్ట్రంలో గుంతల రహిత రహదారులు కనిపించేలా చేస్తున్నామని తెలిపారు.
ఉచిత ఇసుక విధానంలో రాజకీయ జోక్యం ఉండదు
ఇసుక విధానంలో ఎలాంటి రాజకీయ జోక్యాన్ని సహించబోమని తెలిపారు. ప్రజాప్రతి నిధులు ఎవ్వరూ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని సూచించారు. జిల్లాకు ఒక మంత్రిని ప్లానింగ్ బోర్డు చైర్మన్‌గా వేశాం. ఆ జిల్లాలో ఇసుక ఉచితంగా లభించేలా చూడా ల్సిన బాధ్యత వాళ్లదేనని స్పష్టం చేశారు. ఎడ్లబండి, ట్రాక్టరు తీసుకొచ్చి ఎవరైనా ఇసుక తీసుకుని వెళుతుంటే వాళ్లపైన అనవసరంగా కేసులు పెట్టొద్దని సూచించారు. అలా కేసులు పెడితే అధికారులను సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. ప్రజలు వాళ్లు నివసిస్తున్న ఊళ్లో ఉన్న ఏట్లో వాళ్లకు కావాల్సిన ఇసుక తీసుకునే స్వేచ్ఛ లేకపోతే ఎలా? ఎవరైతే ఇసుక స్వయంగా అక్కడికి వెళ్లి తెచ్చుకోలేకపోతున్నారో వారికి ఫెసిలిటేటర్లుగా మాత్రమే కలెక్టర్లు, అధికారులు ఉండాలని స్పష్టం చేశారు.
మింగినదంతా కక్కిస్తాం
గత ప్రభుత్వంలో ఇసుక ఇష్టానుసారం అమ్మేసుకున్నారు. గత ఐదేళ్లలో ఎవరైనా స్వేచ్ఛగా ఎక్కడైనా వాగులు, నది వద్దకు వచ్చి ఇసుక తీసుకెళ్లే పరిస్థితి ఉందా? అంత అరాచకమా, అంత అహంభావమా? ప్రజాస్వామ్యంలో కనీసం ఈ అన్యాయాన్ని అడిగే పరిస్థితి లేకపోయిందని మండిపడ్డారు. ఐదేళ్లలో నాకే ప్రశ్నించే అవకాశం లేకుండా చేశా రు. ప్రజాస్వామ్యంలో మనం ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ప్రశ్నించిన వాళ్లకు మనం జవాబుదారీ తనంతో సమాధానం చెప్పాలి. అలాంటి పరిస్థితి కల్పించారా వీళ్లు అని ధ్వజమెత్తారు.