- లక్ష్యసాధనకు అందరి సహకారం కావాలి
- అధికారులకు మంత్రుల ఉపసంఘం ఛైర్మన్ నారా లోకేష్ దిశానిర్దేశం
- మంత్రుల ఉపసంఘం తొలి సమావేశం
- పాల్గొన్న వివిధ శాఖల ఉన్నతాధికారులు
అమరావతి (చైతన్యరథం): కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో రాష్ట్రంలో వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయమని, సమన్వయ లోపం లేకుండా లక్ష్య సాధనకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఉండవల్లి నివాసంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనపై ఏర్పాటైన మంత్రుల ఉపసంఘం తొలి సమావేశం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు ఉపసంఘం ఛైర్మన్ నారా లోకేష్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, సీఎస్ కే విజయానంద్ దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసికట్టుగా మేనిఫెస్టోను రూపొందించామని చెప్పారు. అందులో తొలి హామీ ఐదేళ్లలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పన. దేశ చరిత్రలో ఏ పార్టీ కూడా మేనిఫెస్టోలో ఒక నిర్దిష్టంగా ఒక సంఖ్య పెట్టి.. ఇన్ని ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పలేదు. మేం చెప్పాం. దానికి కారణం నేను యువగళం పాదయాత్రలో భాగంగా గంగాధర నెల్లూరుకు వెళ్లినప్పుడు ఓ తల్లితో మాట్లాడాను. ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారని ఆ మహిళను అడిగినప్పుడు.. ఆమె ఒక్కటే చెప్పింది. తాగుబోతు భర్త చనిపోయాడు, కష్టపడి తన ఇద్దరు బిడ్డలను చదివించానని, వారిద్దరికి ఉద్యోగాలు కల్పించాలని కోరింది. కూటమి మేనిఫెస్టో ఓ గదిలో కూర్చొని రూపొందించింది కాదు. క్షేత్రస్థాయి అనుభవాలతో రూపొందించింది. అందులో భాగంగానే 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం లేకుండా చూడాలి. ప్రతి 15 రోజులకోసారి కేబినెట్ సబ్ కమిటీ భేటీ జరుగుతుంది. నెలలో ఒకసారి ముఖ్యమంత్రితో సమావేశం జరుగుతుంది. పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయాల్సిన అవసరం ఉందని మంత్రి లోకేష్ అన్నారు.
ఉద్యోగాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలి
గడచిన ఐదేళ్లలో ఏం జరిగిందో అందరం చూశాం. చెప్పుకునే స్థాయిలో పెట్టుబడులు రాలేదు. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక మనకంటే ముందు వరుసలో ఉన్నాయి. పెట్టుబడులు తీసుకురావడం అంత సులభం కాదు.. చాలా సమయం పడుతుంది. మళ్లీ జగన్ రెడ్డి రాడనే గ్యారంటీని పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో పీపీఏలను రద్దు చేశారు. పలు పరిశ్రమలను పొరుగు రాష్ట్రాలకు తరిమివేశారు. వారిని బతిమిలాడి రాష్ట్రానికి తీసుకువచ్చే పరిస్థితి ఉంది. 1995-2004తో పోల్చుకుంటే రాష్ట్రాల మధ్య పోటీ పెరిగింది. పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనపై వివిధ ప్రభుత్వ శాఖలు ప్రత్యేక దృష్టి సారించాలి. పెట్టుబడిదారులకు అవసరమైన అనుమతులు, భూకేటాయింపులు త్వరితగతిన మంజూరయ్యేలా చూడాలి. కేంద్రం, ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఏపీ అభివృద్ధికి సహకరిస్తున్నారు. అందరం కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలుపుదాం. సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో జరగాలి. భారీగా పెట్టుబడులు వచ్చి ఉద్యోగాలు కల్పిస్తేనే జీతాలు ఇచ్చే పరిస్థితి ఉంది. నెలకు రూ.4వేల కోట్ల లోటుతో రాష్ట్రం నడుస్తోంది. అందరం కలసి 20 లక్షల ఉద్యోగాల కల్పనకు కృషిచేద్దామని మంత్రి లోకేష్ అన్నారు.
రాష్ట్రానికి మంచిరోజులు
కూటమి పాలనలో రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గా ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు (ఈడీబీ) వ్యవహరిస్తుంది. లక్ష్య సాధనకు అందరి సహకారం కావాలి. ఒక్క పెట్టుబడి కూడా పొరుగు రాష్ట్రానికి వెళ్లడానికి వీలులేదు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య శిక్షణ అందించాలి. మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.
ఉపాధి కల్పనపైనే దృష్టి: మంత్రి దుర్గేష్
మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగ, ఉపాధి కల్పనపై ఎక్కువ దృష్టి పెట్టిందన్నారు. గత ఐదేళ్లు రాష్ట్రం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అహర్నిశలు కృషిచేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇస్తున్నారు. పర్యాటక రంగంలో విస్తృత అవకాశాలు ఉన్నాయి. లక్ష్యసాధనకు తమవంతు బాధ్యత వహించాలి. శాఖల మధ్య సమన్వయ లోపం లేకుండా చూడాలని మంత్రి దుర్గేష్ సూచించారు.
ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల ప్రణాళికలు, భవిష్యత్ లక్ష్యాలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివిరించారు.
ఈ సమావేశంలో వ్యవసాయ, పరిశ్రమలు, ఆరోగ్యం, హోమ్, మానవ వనరులు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్ మెంట్(ఐ అండ్ ఐ), జీఎస్‌డబ్ల్యూఎస్, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, కార్మిక, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్, పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్, సెర్ప్, పర్యాటకం, రవాణ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.