- ఆ దిశగా అధికార యంత్రాంగం పనిచేయాలి
- మీ ప్రతిభను సమస్యల పరిష్కారంపై పెట్టండి..
- టెక్నాలజీ సాయంతో సకాలంలో ప్రభుత్వ సేవ
- రెవిన్యూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
- భూగర్భ జలాలు పెంపునకు చర్యలు చేపట్టండి
- ఏకో టూరిజం అభివృద్ధి దిశగా చర్యలు
- అధికారులకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం
కుప్పం (చైతన్య రథం): ప్రజలకు సుపరిపాలనను అందించేందుకు అధికారులు అలసత్వం వీడి అంకితభావం, బాధ్యతతో పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. చిత్తూరు జిల్లా కుప్పం రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం రాత్రి గుడిపల్లి మండలం ద్రావిడ యూనివర్సిటీలోని సెమినార్ హాల్లో జిల్లా అధికారులతో జిల్లా ప్రగతిపై సమీక్షించి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలుపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ సేవలు ప్రజలకు సంతృప్తి స్థాయిలో చేరవేసేందుకు అధికారులు బాధ్యతతో పనిచేయాలని, సుపరిపాలన అందించేందుకు అలసత్వం వీడాలని ఆదేశించారు. ప్రధానంగా రెవిన్యూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రణాళికతో ముందుకువెళ్లి పరిష్కారం చూపాలన్నారు. గతంతో పోలిస్తే ఆర్డీఓలకు మండలాల సంఖ్య తక్కువగా ఉంటుందని, వారి పరిధిలో రెవెన్యూ సమస్యలను పరిష్కారానికి చొరవ చూపి సమర్థవంతంగా పనిచేయాలన్నారు. రాష్ట్రంలో ప్రతి రిజర్వాయర్ నందు నీటి నిల్వలు ఉన్నాయని అంటూ.. జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తే అవకాశం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు.
భూగర్భ జలాల పెంపునకు చెక్ డ్యామ్‌ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని డ్వామా అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లాలో పంట పొలాలపై ఏనుగుల దాడులను అరికట్టేందుకు అటవీశాఖ అధికారులు తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. జిల్లాలో ఏకో టూరిజం అభివృద్ధికి సంబంధిత శాఖలు సమిష్టిగా పని చేయాలన్నారు. సచివాలయాల రేషనలైజేషన్ భాగంగా జనాభా ప్రాతిపదికన చేపట్టాలని, తద్వారా సిబ్బంది కొరతను నివారించవచ్చునని ఈ దిశగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. జిల్లాలో వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా ఉద్యాన పంటలైన కూరగాయలు, పూలు, పండ్లు పెంపకాలను ప్రోత్సహించాలన్నారు. కొత్త పంటల సాగుకు రైతుల ఆసక్తిచూపే విషయంలో అందుకు ఆ ప్రాంతాల్లో ఆ పంట సాగుకు అనుకూలమైన వాతావరణం ఉన్నది లేనిదీ సరి చూసుకోవాలని ఆదేశించారు. అలాగే, ప్రజలలో ప్రివెంటివ్ హెల్త్ కేర్‌ను పెంపొందించాలనన్నారు.
గంజాయి నియంత్రణకు అటవీ, పోలీసు అధికారులు ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టి పగడ్బందీగా జాయింట్ యాక్షన్ ప్లాన్‌ను అమలు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. సమావేశంలో భాగంగా జిల్లాలో రెవెన్యూ సదస్సుల నిర్వహణ, ఆర్డబ్ల్యూఎస్, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న పనుల పురోగతి, వ్యవసాయ, ఉద్యానశాఖల పురోగతి, వైద్య సేవలు సంబంధిత అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ముఖ్యమంత్రికి వివరించారు. సమీక్షా సమావేశంలో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, సీఎం కార్యదర్శి ప్రద్యుమ్న, ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, జిల్లా ఎస్పీ మణికంఠ ఛందోలు, జిల్లా జాయింట్ కలెక్టర్ జి. విద్యాధరి, కడ పిడి వికాస్ మర్మత్, డీఎఫ్ఓ భరణి, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం తదితరులు పాల్గొన్నారు..