- అధినేత వద్ద కార్యకర్తల ధీమా
- నాపై కక్ష కుప్పం ప్రజలపై చూపిస్తున్నారు: చంద్రబాబు
- అక్రమ కేసులతో అనేక ఇబ్బందులు పెడుతున్న వైసీపీ ప్రభుత్వం
- అంతిమంగా ధర్మమే గెలుస్తుంది, కార్యకర్తల త్యాగాలు మరిచిపోను
- ఇబ్బంది పెట్టినవారిని వదిలే ప్రసక్తే లేదు
- టీడీపీ కేంద్ర కార్యాలయంలో అధినేతను కలిసిన కుప్పం నియోజకవర్గ పార్టీ నేతలు, కార్యకర్తలు
అమరావతి: వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబును లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించుకుంటామని కుప్పం నేతలు, కార్యకర్తలు ధీమా వ్యక్తం చేశారు. దాదాపు మూడు నెలల తర్వాత టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. చంద్రబాబుకు నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. కుప్పం నియోజకవర్గం నుంచి వచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు కొద్ది సేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వల్ల గతంలో ఎన్నడూ లేని విధంగా కుప్పం నియోజకవర్గంలో అశాంతి, హింస, రాజకీయ వేధింపులు తలెత్తాయన్నారు. తనను ఇబ్బంది పెట్టేందుకు, తెలుగుదేశం పార్టీ నేతలను భయపెట్టేందుకు ప్రజలు, కార్యకర్తలపై అనేక అక్రమ కేసులు పెట్టారని…అరెస్టులు చేసి జైలుకు పంపారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా అదరక, బెదరక పార్టీ నేతలు, కార్యకర్తలు నిలబడ్డారని…వారిని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటానన్నారు. ప్రశాంతమైన కుప్పంలో వికృత రాజకీయాలతో ప్రజలను కూడా ఇబ్బందులు పెట్టారని చంద్రబాబు అన్నారు. తన పర్యటనకు వచ్చిన కార్యకర్తలు, ప్రజలపైనా కేసులు పెట్టి వేధించారని… 35 ఏళ్లుగా కుప్పం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా….ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదని చంద్రబాబు అన్నారు. తన అక్రమ అరెస్టు సమయంలో మద్దతుగా నిలిచిన నియోజకవర్గ ప్రజలకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై నిరసన కార్యక్రమాలకు దిగినవారిపైనా తప్పుడు కేసులు పెట్టారని ఈ సందర్భంగా నాయకులు చెప్పారు. అధినేత కోసం ఎన్ని కేసులు, ఇబ్బందులు అయినా ఎదుర్కొనేందుకు తాము సిద్దంగా ఉన్నామని చెప్పారు. నియోజకవర్గంలో బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ, ఓటర్ వెరిఫికేషన్ వంటి పార్టీ కార్యక్రమాల నిర్వహణ అంశాలను చంద్రబాబుకు నేతలు వివరించారు. సమావేశంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, పీఎస్ మునిరత్నం, డాక్టర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
కుప్పం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో సమావేశానికి ముందు టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి చంద్రబాబు నివాళులర్పించారు. కుప్పం నేతలు శాలువాలతో అధినేతను సత్కరించారు. మహిళా నేతలు బొట్లు పెట్టి, అమ్మవారి ప్రసాదం, చిత్రపటం బహూకరించారు.