అమరావతి(చైతన్యరథం): రాఖీ పండుగ సందర్భంగా తెలుగింటి ఆడపడుచులకు, అనునిత్యం ఆశీస్సులు కురిపించే అక్కచెల్లెళ్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆది నుంచి ఆడపడుచుల పక్షపాతి అన్నారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించడమే కాకుండా ప్రభుత్వపరంగా ఇచ్చే పథకాలను, ఆస్తులను మహిళామతల్లుల పేరు పైనే ఇచ్చే సంస్కరణ తెచ్చింది కూడా తెలుగుదేశమే. మహిళా సాధికారత కోసం ‘డ్వాక్రా’ సంఘాలు, బాలికా విద్యకు ప్రోత్సాహం, స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు వంటి విప్లవాత్మక నిర్ణయాలతో మహిళా సంక్షేమం కోసం కృషిచేశాం. ఆడబిడ్డల ఆత్మగౌరవం, భద్రత, అభివృద్దికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటిస్తూ… ఈ ‘రక్షాబంధన్’ సమయంలో మరోసారి శుభాకాంక్షలు తెలుపుతూ మీకు అన్నివేళలా, అన్నివిధాల అండగా ఉంటానని హామీ ఇస్తున్నానని ఎక్స్‌లో సీఎం చంద్రబాబు పోస్ట్ చేశారు.
సీఎం చంద్రబాబుకు రాఖీలు కట్టిన మహిళా నేతలు, బ్రహ్మకుమారీలు
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మహిళా నేతలు, బ్రహ్మకుమారీలు రాఖీలు కట్టారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా సోమవారం ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి పార్టీ మహిళా నేతలు మాజీ మంత్రి పీతల సుజాత, కృష్ణా జడ్పీ మాజీ ఛైర్ పర్సన్ గద్దె అనురాధ, టీడీపీ డ్వాక్రా-అంగన్వాడీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత, కంభంపాటి శిరీష, పలువురు బ్రహ్మకుమారీలు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా సీఎం వారికి ధన్యవాదాలు తెలిపి శుభాకాంక్షలు తెలిపారు.