విజయవాడ: వరద బాధితులపై చేయి చేసుకున్న వీఆర్వో జయలక్ష్మి తీరుపై ప్రభుత్వం సీరియస్ అయింది. వీఆర్వోను విధుల నుంచి తప్పిస్తున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ సృజన వెల్లడిరచారు. ఆమెకు షోకాజ్ నోటిసులు ఇచ్చినట్లు తెలిపారు. బాధితులతో సంయమనంగా వ్యవహరించాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు పలుమార్లు అధికారులకు సూచించారు. బాధల్లో ఉన్న బాధితులు ఓ మాట అన్నా.. ఓపిగ్గా సమాధానం చెప్పాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. అయినా పలువురు ఉద్యోగుల తీరు మారట్లేదు. దీంతో అలాంటి వారి విషయంలో ప్రభుత్వం కఠిన వ్యవహరిస్తోంది.
మంచినీరు, ఆహారం తమ వీధిలోకి అందలేదని విజయవాడలో వరద బాధితులు ప్రశ్నించినందుకు వీఆర్వో జయలక్ష్మి ఒకరి చెంప పగలగొట్టారు. అక్కడితో ఆగకుండా పోలీసులు ముందే బాధితుడిని దుర్భాషలాడారు. నన్నే ప్రశ్నిస్తావా? అంటూ బాధితులపైనే అధికారులకు ఫిర్యాదు చేశారు. భోజనాలు, మంచినీరు అందటం లేదని ప్రశ్నించినందుకు ఇలా ఓ వీఆర్వో, వరద బాధితులపై చేయి చేసుకోవడం వివాదానికి దారి తీసింది. ఆమె వైఖరిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఉన్నతాధికారులు ఆమెపై చర్యలు తీసుకున్నారు.