- బోటు షికారుకోసం చెరువును కబ్జా చేసిన ఘనుడు
- 400మంది రైతుల నోట్లో మన్ను
- తన సరదా కోసం 2వేల ఎకరాల ఆయకట్టును బీడుగా మార్చిన వైనం
- మాట వినలేదని దళిత కలెక్టర్ గంధం చంద్రుడును పంపించిన కేతిరెడ్డి
- గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో కమలాసన్ మించిన నటన
(చైతన్యరథం ప్రత్యేక ప్రతినిధి – అనంతపురం)
గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ ఉదయాన్నే లేచి వీధుల్లో తిరుగుతూ అమ్మా, అక్కా, చెల్లీ అంటూ ఎనలేని ప్రేమ కురిపించేస్తూ అధికారులకు ఒకేఒక్క డు సినిమా హీరో స్టయిల్‌లో సమస్యలన్నీ అక్కడికక్కడే పరిష్కరించేసినట్లుగా కనికట్టుచేస్తున్న మహానటుడు ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. ఈయన సోషల్ మీడియాలో చేసే హల్‌చల్ చూసి ముఖ్య మంత్రి జగన్ రెడ్డి సైతం ఫిదా అయిపోయి ఇటీవల తాడేపల్లి ప్యాలెస్‌లో జరిగిన ఒక సమావేశంలో మిగిలిన వారు ఈయనను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. ముఖ్యమంత్రినే బురిడీకొట్టించిన ఈయన చాకచక్యంచూసి అనంతపురం జిల్లాలోని సహచర వైసిపి ఎమ్మెల్యేలు ముక్కున వేలేసుకున్నారు. ఈయన చేసే హడావిడి అంతా ముందుగా నాటకానికి ముందు రిహార్సల్ చేసుకున్నట్లుగా పక్కా ముందస్తు ప్రణాళిక ప్రకారమే సాగుతుంది. కమలాసన్ మించి కేతిరెడ్డి చేసే నటనను వాస్తవమని భ్రాంతికలిగించేలా సోషల్ మీడియాలో ప్రచారానికి ఈయన చేసే ఖర్చు అక్షరాలా నెలకు రూ.10లక్షల రూపాయలు. పొరుగున ఉన్న బెంగుళూరు నుంచి స్పెషల్ ఎఫెక్ట్ ల కోసం రప్పించిన నిపుణుల బృందం కోసం ఏకంగా ఒక గెస్ట్ హౌస్‌నే మెయింటెయిన్ చేస్తున్నారంటే ఈయన మ్యాజిక్ ఏ రేంజిలో ఉంటుందో అర్థంచేసుకోవచ్చు.
వేధింపులకు కేరాఫ్ వెంకట్రామిరెడ్డి
ఇక విషయానికొస్తే ఈయన గుడ్ మార్నింగ్ ధర్మవరం సందర్భంగా చేసే యాక్షన్, చెప్పేమాటలు వింటే నీతి, నిజాయితీ లకు నిలువుటద్దమేమోనని తెలియని వారు మోసపోతుంటారు. ఆయన రెండో ఓరూపం మాత్రం వేరుగా ఉంటుంది. ఇటీవల ఈయన తన పరంపరలో భాగంగా ‘‘వార్డుల్లో వాలంటీర్లు కరప్షన్ చేస్తున్నారు, మర్యాదగా వారు జనాల వద్దకు వెళ్లి తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేయండి, జనాల వద్ద డబ్బులు తీసుకున్నట్లు రుజువైతే చెప్పుతో కొడతా’’ అంటూ ఓ వాయిస్ రికార్డును పంపారు. అంతకుముందు రోజు గుడ్ మార్నింగ్ ధర్మవరంలో సరిగా పనిచేయని సచివాలయ ఉద్యోగులు రాజీనామా చేసి వెళ్లిపోవాలంటూ హూంకరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. గ్రామస్థాయి నుంచి మండలస్థాయి వరకు అధికారులందరి లూప్ హోల్స్ తెలుసుకొని వారిని బెదిరించి తమకు కావాల్సిన అడ్డమైన పనులు చేయించుకోవడం ఈయన రోజువారీ పర్యటనల వెనుక అసలు రహస్యం. మాటవినని అధికారులను బెదిరించడం, బదిలీల పేరుతో వేధించడం ఈయనకు వెన్నతోపెట్టిన విద్య. కొంతకాలం క్రితం ధర్మవరం నియోజకవర్గంలో నిషేధిత జాబితాలో ఉన్న భూములను తప్పించి తాము చెప్పినవారికి రిజిస్ట్రేషన్ చేసేలా వీలుకల్పిం చాలని మాజీ కలెక్టర్ గంధం చంద్రుడుపై కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వత్తిడితెచ్చారు. ప్రగతిశీల భావాలు కలిగిన దళిత కలెక్టర్ చంద్రుడు అందుకు ఒప్పుకోక పోవడంతో ఆయనను బదిలీచేయించే వరకు కేతిరెడ్డి నిద్రపోలేదు. కలెక్టర్ బదిలీ తర్వాత ధర్మవరం నియో జకవర్గంలో ప్రభుత్వాధికారులపై ఈయన వేధింపులు పతాకస్థాయికి చేరాయి. నేను చెప్పినపని చేస్తారా, లేదా, కలెక్టర్ నే పంపించాను, మీరెంత అంటూ అధికారులను బ్లాక్ మెయిల్ చేస్తూ తమ దందాల పర్వాన్ని కొనసాగిస్తున్నారు.
బోటింగ్ సరదా కోసం రైతుల జీవితాలతో చెలగాటం
ధర్మవరం శివార్లలో సుమారు 400మందికి పైగా రైతులు సాగుచేసుకునే 2వేల ఎకరాల భూమి సాగు నీటికి ధర్మవరం చెరువే ఆధారం. అయితే 2019 ఎన్నికల తర్వాత సెటిల్మెంట్లు, దందాలతో ఊహించని విధంగా వచ్చినపడిన వందలకోట్ల సంపదలో కొంత భాగాన్ని విలాసాల కోసం వెచ్చిస్తూ తన సరదాలు తీర్చుకుంటున్నారు. ఈ క్రమంలో వెంకట్రామిరెడ్డి చెరువుని ఆనుకొని సుమారు 100 ఎకరాల్లో ఒక విలాసవంతమైన ఫామ్ హౌస్ ను నిర్మించుకున్నారు. ఇందులో చెరువులో అంతర్భాగ మైన 15ఎకరాలను పూడ్చి ఆక్రమించుకున్నారు. రెవిన్యూ అధికారులను లోబర్చుకొని సర్వేనంబర్ 902 నుంచి 908వరకు 20 కొత్త నంబర్లను సృష్టించి సుమారు 25ఎకరాల ఎసైన్డ్ భూమిని కేతిరెడ్డి స్వాధీనం చేసుకున్నారు. కేవలం తన బోటింగ్ సరదా కోసం 400మంది రైతుల నోట్లో మట్టిగొట్టి ధర్మవరం చెరువును చెరబట్టి 2వేల ఎకరాల సాగుభూమిని బీడుగా మార్చారు. చెరువును ఫామ్ హౌస్ లో అంతర్భాగం చేసుకొని విలాసాలకోసం ఉపయోగించుకున్న కేతిరెడ్డి వికృతరూపం తెలియనివారు ఈయన ప్రజాసేవలో తరిస్తున్న నేత అని భావిస్తూ తప్పులో కాలేస్తుంటారు. ఎర్రగుట్టమీద ఉన్న భూములను సైతం అధికారులను లోబర్చుకొని తమ సమీప బంధువుపేరుతో పిత్రార్జితంగా రికార్డులు తారుమారుచేసి వందలకోట్ల విలువైన భూమిని స్వాధీనం చేసుకున్నారు.
విలాసవంతమైన కార్లు, గుర్రాలతో హల్ చల్
మహానటుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి 2019 ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ లో ఈయన చూపిన ఆస్తులు కేవలం రూ.5కోట్ల రూపాయలు. ఈరోజు కేతిరెడ్డి ఆస్తులు రూ.500 కోట్ల పైమాటే. కేవలం 40నెలల్లో సమయంలో ఇంత భారీగా కూడబెట్టారంటే ఈయన సెటిల్మెంట్లు, దందాల రేంజి ఏస్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈయన వద్ద 10కోట్ల రూపాయల విలువచేసే విలాసవంతమైన కార్లు ఉన్నాయి. గుర్రపుస్వారీ సరదా కోసం ఒక్కొక్కటి 20లక్షల రూపాయల విలువచేసే 10 జాతిగుర్రాలను ఫాంహౌస్ లో పెంచుతున్నాడు. తాను ఆక్రమించిన చెరువు స్థలం పదెకరాల్లో విలాసవంతమైన భవంతి నిర్మించుకున్నాడు. రైతుల సాగునీటికోసం ఉపయోగించే చెరువు చానళ్లను బంద్ చేసి చెరువులో మినీబోట్లతో షికార్లు చేస్తున్నారు. ఫామ్ హౌస్ లో చేసే కార్యకలాపాలు బయటకు పొక్కకుండా ఉండేందుకు ధర్మవరం చెరువుచుట్టూ ఏకంగా ఒక ప్రైవేటు సైన్యాన్నే కేతిరెడ్డి పహారాగా పెట్టుకున్నారు. కేతిరెడ్డి అక్రమ దందాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతోపాటు గవర్నర్ కు కూడా ఫిర్యాదులు వెళ్లాయి. ఎమ్మెల్యే కేతిరెడ్డి నిజస్వరూపం తెలియని బయటప్రజలు నేటి రాజకీయాల్లో ఆయనో ఆదర్శవంతమైన నేత అని సిఎం జగన్ మాదిరిగా పొరబడుతుంటారు. అయితే నిజం నిప్పులాంటిది. నేడు కాకపోతే రేపు..రేపు కాకపోతే ఎల్లుండయినా కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి లాంటి అక్రమార్కుల పాపాలపుట్ట పగలడం ఖాయం. అప్పటివరకు ఈయన అసమాన నటనను ధర్మవరం ప్రజలు చూసి తీరాల్సిందే.