- తూర్పునాయుడుపాలెంలో 85 మందికి రూ.73 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ
కొండపి (చైతన్యరథం): పేదల ఆరోగ్యం, విద్య, వైద్యానికి కూటమి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గ పరిధిలోని 85 మందికి శుక్రవారం తూర్పు నాయుడుపాలెంలోని తన నివాసంలో రూ.73,35,558 విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తమ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు తన నియోజకవర్గంలో 218 మందికి రూ.2,12,05,140 విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేసినట్లు చెప్పారు.
ముఖ్యమంత్రి సహాయ నిధికి వచ్చిన ప్రతి ఆర్జీకి న్యాయం చేస్తున్నామన్నారు. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర అభివృద్ధికి, పేదల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. పేదలకు ఆరోగ్య బీమా కల్పించడంతో పాటు ఎన్టీఆర్ వైద్య భరోసా ద్వారా 25 లక్షల రూపాయల వరకు వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. పేదల ఆర్థిక పరిస్థితిని మెరుగు పరిచేందుకు, ప్రతి కుటుంబం సాధికారత సాధించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. స్వంత గృహాలు నిర్మించుకునేందుకు ఎస్సీ, బీసీలకు రూ. 50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు, పీవీటీజీ చెంచులకు లక్ష రూపాయల చొప్పున అదనపు ఆర్థిక సహాయం చేస్తున్నట్లు చెప్పారు.