- జగన్ రెడ్డి అసమర్థత వల్లే పట్టభద్రుల నిరుద్యోగ రేటులో 24 శాతంతో దేశంలోనే రాష్ట్రానికి ప్రథమస్థానం
అమరావతి: నాలుగున్నరేళ్లకు పైబడిన పాలనలో జగన్ రెడ్డి సాధించిన ఘనతలు చూస్తుంటే ఏపీ ప్రజలు సిగ్గుతో తలదించు కోవాల్సిన పరిస్థితి వచ్చిందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు. చంద్రబాబు హయాంలో మా రాష్ట్రం ఇదని, మేం ఇవి సాధించామని గొప్పగా చెప్పకున్న ఏపీ ప్రజలు నేడు జగన్ నిర్వాకాలతో అవమానభారంతో కుమిలి పోతున్నారన్నారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా నిర్వహించే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే తాలూకా తాజా నివేదికలో నిరుద్యోగిత రేటులో దేశంలోనే మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉన్న విషయం వెల్లడయిందన్నారు. చదువుకున్న యువతలో అత్యధికంగా నిరుద్యోగులున్న రాష్ట్రంగా దేశంలోనే ఏపీ ముందు వరసలో నిలిచింది. పట్టభద్రుల నిరుద్యోగంలో బీహార్ ను మించిపోయిన ఏపీ అని, అత్యధికంగా రాష్ట్రంలో 24 శాతం నిరుద్యోగిత నమోదైందని కేంద్రప్రభుత్వ తాజా నివేదికలో బట్టబయలైందని పట్టాభి చెప్పారు.
పొరుగున ఉన్న తెలంగాణలో చదువుకున్న యువత నిరుద్యోగ రేటు 16.6 శాతముంటే, తమిళనాడులో 16.3 శాతం, కేరళలో 19.8, బీహార్లో 16.6 శాతం ఉంది. దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలు మనకంటే నిరుద్యోగరేటులో తక్కువగా ఉంటే, ఏపీ మాత్రం దేశంలోనే నంబర్ -1 గా నిలిచింది. ఆఖరికి ఛత్తీస్‌గఢ్ వంటి చిన్న రాష్ట్రాలు కూడా ఏపీ కంటే ముందున్నాయి. ఏపీ యువతలో 24 శాతం మంది ఉద్యోగాలు లేకుండా బాధపడటానికి కారణం ఎవరో ప్రజలు గ్రహించాలి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉద్యోగాల సృష్టి జరిగింది. టీడీపీ హయాంలో రాష్ట్రానికి పుష్కలంగా పెట్టుబడులు రావడం, ఉపాధి కల్పనకు ప్రభుత్వం తగిన చేయూత అందించడం, ఉపాధి, ఉద్యోగాలు పొందడానికి అవసరమైన నైపుణ్యాలను, ఇతర యాక్టివిటీస్ ను నిరుద్యోగులకు ఉచితంగా అందించారు. కానీ జగన్ రెడ్డి జమానాలో నేడు అలాంటివి ఏవీ కనిపించడం లేదు.
నిరుద్యోగిత పెరగడానికి కారణాలు
రాష్ట్రంలో నిరుద్యోగ రేటు పెరగటానికి ప్రధాన కారణం రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోవడం. పెట్టుబడులు వచ్చి పరిశ్రమలు ఏర్పాటైతేనే యువతకు ఉపాధి, ఉద్యోగాలు లభిస్తాయి. కానీ నాలుగున్నరేళ్ల జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రం పెట్టుబడుల ఆకర్షణలో ఘోరంగా విఫలమైంది. డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వారి వార్షిక నివేదికలోని అంశాలే అందుకు నిదర్శనం. 2014-2019 మధ్యన టీడీపీ ప్రభుత్వంలో మొత్తంగా రూ.1,26,615 కోట్ల విలువైన పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. అంటే సరాసరిన ఏటా రూ.25,323 కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. అదే విధంగా జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రానికి 2019 నుంచి 2022 డిసెంబర్ వరకు కేవలం సంవత్సరానికి సరాసరిన రూ.13,515 కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయని సదరు నివేదిక చెబుతోంది. చంద్రబాబునాయుడు సాధించిన పెట్టుబడుల్లో సగం మాత్రమే జగన్ రెడ్డి రాష్ట్రానికి తీసుకురాగలిగాడు. ఈ విధంగా పెట్టుబడులు కోల్పోతే ఇక యువతకు ఉద్యోగాలు ఎలా లభిస్తాయి? ఎప్పుడైతే పెట్టుబడులు రావో, పరిశ్రమలు ఏర్పాటు కావో అప్పుడే నిరుద్యోగశాతం పెరుగుతుందని పట్టాభి తెలిపారు.
జగన్ హయాంలో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ (విదేశీ పెట్టుబడులు) కూడా దారుణంగా పడిపోయాయి. 2019 అక్టోబర్ నుంచి 2023 సెప్టెంబర్ వరకు జగన్ రెడ్డి ఏపీకి సాధించిన విదేశీ పెట్టుబడులు కేవలం రూ.6,679 కోట్లు మాత్రమే. చంద్రబాబునాయుడు 2018-19లో ఒక్క సంవత్సరంలోనే ఏపీకి సాధించిన విదేశీ పెట్టుబడులు రూ.23,882 కోట్లు. దేశీయంగాకానీ, విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో చంద్రబాబు సాధించినదానికి, జగన్ రెడ్డి తీసుకొచ్చిన వాటికి ఎక్కడా పొంతన లేదు. ఈ విధంగా జగన్ రెడ్డి నిర్వాకాలతో రాష్ట్రానికి వచ్చే దేశీ, విదేశీ పెట్టుబడులు పూర్తిగా నిలిచిపోవడంతో యువతకు ఉద్యోగాలు లేకుండా పోయాయి. దాని వల్లే ఏపీలో నిరుద్యోగ రేటు దేశంలోనే అత్యధికంగా 24 శాతంగా నమోదైంది. తాడేపల్లి కొంపకు కమీషన్లు కట్టలేక, ప్రభుత్వ అవినీతి, వైసీపీ నేతల వేధింపులు భరించలేకనే ఏపీకి పెట్టుబడులు రావడం లేదన్నది పచ్చి నిజం. ఇవన్నీ ఇలా ఉంటే నిరుద్యోగులకు జగన్ రెడ్డి ఇచ్చిన హామీల్లో నాలుగున్నరేళ్లలో ఒక్కటీ నెరవేరలేదని పట్టాభి దుయ్యబట్టారు.
ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తానన్న జగన్ రెడ్డి, నాలుగేళ్లలో ఒకే ఒక్కసారి అదీ జూన్ 2021లో ఉత్తుత్తి జాబ్ క్యాలెండర్ ప్రకటించాడు. 99 శాతం హామీలు నెరవేర్చానని చెప్పుకునే జగన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ హామీ పై ఏం సమాధానం చెబుతాడు? ఒకసారి ఇచ్చిన జాబ్ క్యాలెండర్లో 10,143 ఉద్యోగాలు ఇస్తానన్నాడు. ఎక్కడ ఇచ్చాడో ఎవరికి ఇచ్చాడో తెలియదు. 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ హామీని పూర్తిగా గాలికి వదిలేశాడు. ఈ విధంగా యువతకు ఇచ్చిన హామీలు జగన్ రెడ్డి నిలబెట్టుకోకపోవడం కూడా రాష్ట్రంలో పట్టభద్రుల్లో నిరుద్యోగ రేటు పెరగడానికి మరో కారణమని పట్టాభి చెప్పారు.
నైపుణ్య శిక్షణ కేంద్రాల్ని కక్ష సాధింపులతో మూసేశాడు
చంద్రబాబునాయుడు నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ అందించడంకోసం ఏర్పాటు చేసిన 40 శిక్షణ కేంద్రాలను జగన్ రెడ్డి అకారణంగా, తన కక్ష సాధింపులతో మూసేయించాడు. చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాల ద్వారా లక్షలాది యువతకు శిక్షణ అందించి, వేలమందికి ఉద్యోగాలు అందిస్తే, జగన్ రెడ్డి తన కక్ష సాధింపులు, కడుపుమంటతో నిర్దాక్షణ్యంగా వాటిని మూసేయించాడని పట్టాభి విమర్శించారు.
టీడీపీ ప్రభుత్వం 10లక్షల ఉద్యోగాలు కల్పించిందని కేంద్రమంత్రే చెప్పారు
చంద్రబాబు 2014-19 మధ్య రెండు సార్లు డీఎస్సీ నిర్వహించి, యువతకు 17,591 ఉద్యోగాలు ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వం ప్రైవేట్, ప్రభుత్వ రంగాల్లో మొత్తంగా ఏపీలో దాదాపు 10 లక్షల ఉద్యోగాలు కల్పించిందని పార్లమెంట్ సాక్షిగా కేంద్రమంత్రే గతంలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ విధంగా తాను రాష్ట్రయువతకు ఇదిచేశానని జగన్ రెడ్డి చెప్పగలడా? చంద్రబాబు ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద ప్రతినెలా 6 లక్షల మంది యువతకు నిరుద్యోగ భృతి అందిస్తే, జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఆ పథకాన్ని రద్దుచేశాడు. చంద్రబాబు హయాంలో నిరుద్యోగ భృతి అందించడమే కాకుండా, వారికి అదనంగా నైపుణ్య శిక్షణ అందించడం, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ నిర్వహించడం చేశారు. అలాంటి పథకాన్ని ఆపేయడం జగన్ రెడ్డి చేసిన ఘోర తప్పిదం. అకారణంగా నిరుద్యోగ భృతిని, నైపుణ్య శిక్షణను జగన్ రెడ్డి రద్దుచేయడంతో వారికి దక్కాల్సిన ఆర్థిక లబ్ధితో పాటు, ఉద్యోగావకాశాలు కూడా లేకుండా పోయాయి. దీనివల్ల రాష్ట్రంలోని పట్టభద్ర యువత తీవ్రంగా నష్టపోతోందని పట్టాభి అన్నారు.
నాలుగేళ్లలో 1745 మంది యువత ఆత్మహత్యలకు పాల్పడ్డారు
ఉద్యోగాలు దొరక్క, రాష్ట్రంలో నిరుద్యోగ రేటు విపరీతంగా పెరగడంతో రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలు ఎక్కువయ్యాయి. తాజాగా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్.సీ.ఆర్.బీ) విడుదల చేసిన 2022 నివేదికే అందుకు నిదర్శనం. 2019లో 214 మంది, 2020లో 358 మంది, 2021లో 409 మంది, 2022లో 364 మంది, 2023లో 400 మంది మొత్తంగా జగన్ రెడ్డి నాలుగేళ్ల పాలనలో దాదాపుగా 1745 మంది నిరుద్యోగ యువత ఆత్మహత్యలకు పాల్పడ్డారు. బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కూడా ఇంతమంది ఆత్మహత్యలు చేసుకోలేదు. ఇంతమంది యువత దారుణంగా బలైపోవడానికి కారణం ముమ్మాటికీ జగన్ రెడ్డే. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా లక్షలాది నిరుద్యోగ యువతను జగన్ రెడ్డి నమ్మించి దగాచేశాడు. 1745 మంది యువత ప్రాణాలు బలితీసుకున్న నరరూప రాక్షసుడు జగన్ రెడ్డి అని పట్టాభి విమర్శించారు.
గంజాయి, డ్రగ్స్ కు బానిసల్ని చేశారు
నిరుద్యోగుల్లో ఈ విధంగా ఎంతోమంది ఆత్మహత్యలకు పాల్పడుతుంటే, మెజారిటీ శాతం యువతను జగన్ రెడ్డి కల్తీ మద్యం, గంజాయి, డ్రగ్స్ కు బానిసల్ని చేశాడు. జగన్ సాగిస్తున్న గంజాయి, డ్రగ్స్ వ్యాపారాలకు ప్రధానంగా బలవుతోంది కళాశాల, పాఠశాలల విద్యార్థులే. గంజాయి, డ్రగ్స్ కు ఏపీ అడ్డాగా మారిందని నార్కోటిక్స్ బ్యూరో నివేదికలే చెబుతున్నాయి. తన ధనదాహంతో జగన్ రెడ్డి మొత్తంగా ఒక తరాన్నే నాశనం చేస్తున్నాడనే వాస్తవాన్ని ప్రజలు గ్రహించాలి. జగన్ రెడ్డి అవినీతి, అసమర్థత, దోపిడీతో రాష్ట్రంతో పాటు యువత కూడా దారుణంగా నష్టపోయింది. రాష్ట్ర యువత ఎవరూ నిరాశా నిస్పృహలతో బలవన్మరణాలకు పాల్పడవద్దు. 3 నెలల్లో టీడీపీ ప్రభుత్వం వస్తుంది. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటు, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పిస్తారు. గతంలో మాదిరే నిరుద్యోగ భృతి అందిస్తారని పట్టాభి స్పష్టం చేశారు.