విపత్కర పరిస్థితుల్లో సమర్థ నిర్ణయాలతో ప్రజలను ముందుకు నడపగలవాడే నాయకుడు. నాలుగు దశాబ్దుల రాజకీయ అనుభవంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని.. విపత్కర పరిస్థితులు ఎదురైన ప్రతిసారీ `నేనున్నాంటూ ప్రజలకు ధైర్యంచెప్పి ముందుకు నడిపించే నాయకుడిగా.. బుడమేరు వరదల సమయంలో మరోసారి నిరూపించుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. భారీ వరదల్లో చిక్కుకుని విలవిల్లాడిన విజయవాడను ఒడ్డుకు చేర్చడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన సాహసం.. ఆయన సమర్థ రాజకీయ నాయకత్వానికి గీటురాయి.
విజయవాడను భారీ వరదలు ముంచెత్తాయి. అనుకోని విపత్తు నగరాన్ని పూర్తిగా జలదిగ్బంధంలోకి నెట్టింది. అంతకంతకూ పెరుగుతున్న వరదను చూసి ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రధానంగా బుడమేరు వాగు పొంగిపొర్లడంతో నగరంలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో వరదకు ఎదురు నిలబడి.. ప్రజలకు రక్షణ కల్పించి ధైర్యం చెప్పిన నేతగా సీఎం చంద్రబాబు ప్రజా హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు. నగర ప్రజలకు మనోబలమిస్తూనే.. వరద సహాయ చర్యలు చేపట్టి.. పరిస్థితులను చక్కదిద్దేందుకు చంద్రబాబు సలిపిన నిరంతర కృషి మాటల్లో చెప్పలేనిదే.
తొమ్మిది రోజులుగా వరద బాధితుల మధ్యే..
సాధారణంగా ఏ ముఖ్యమంత్రి అయినా.. విపత్తుల తర్వాత ఏరియల్ సర్వే చేసి బాధితులను పరామర్శించడం పరిపాటి. కానీ చంద్రబాబు దీనికి భిన్నం. హుద్‌హుద్ తుఫాను సమయంలోనూ పరిస్థితిని చక్కదిద్దేవరకూ క్షేత్రస్థాయిలో ఉండి.. విశాఖ నగరాన్ని సాధారణ స్థితికి తెచ్చినపుడు.. ఆ సాహసానికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయి. ఇప్పుడూ అదే పంథాను అనుసరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. విజయవాడ వరద సమయంలోనూ.. తొమ్మిదిరోజుల పాటు క్షేత్రస్థాయిలోనే ఉన్నారు. అనుక్షణం వరద బాధితుల మధ్యే గడిపి.. పీకల్లోతు కష్టంలోవున్న ప్రజలకు ధైర్యం చెబుతూ ముందుకు నడిపించారు. ముఖ్యమంత్రి హోదాను.. వయసును పక్కనపెట్టి వరదకు ఎదురు నిలిచారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూనే.. యంత్రాంగంతో సమీక్షిస్తూ సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ప్రజలకు నేరుగా సేవలందించడానికి పది రోజులపాటు విజయవాడ కలెక్టరేట్‌నే ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీసుగా మార్చుకుని.. సర్వశక్తులు ఒడ్డారు. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో పడవల్లో తిరుగుతూ, ప్రోక్లెయిన్లపై ప్రయాణిస్తూ.. ప్రజల కష్టాలను తెలుసుకుని తక్షణ చర్యలు తీసుకోవడం ముఖ్యమంత్రి చంద్రబాబుకే సాధ్యమైంది. అందుకే.. చంద్రబాబు ప్రజా హృదయాలపై బలమైన ముద్ర వేయగలిగారు.
కేంద్రం సహాయం తీసుకున్న విధానం
వెల్లువెత్తిన బుడమేరు వరద విజయవాడపై విరుచుకు పడిరదన్న సమాచారం తెలిసిన వెంటనే.. క్షణం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగిన చంద్రబాబు.. విపత్కర పరిస్థితిని ఎదుర్కోడానికి కేంద్రం సహాయం తీసుకోవడంలోనూ కృతకృత్యులయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చించి, ఎన్డీఆర్‌ఎఫ్, మిలటరీ ఇంజనీరింగ్ బృందాలను రాష్ట్రానికి రప్పించడంలో చంద్రబాబు సుదీర్ఘ అనుభవానికి నిలువెత్తు నిదర్శనం. ఆగమేఘాల మీద ఆరు హెలికాఫ్టర్లు, పవర్ బోట్లును వరద ప్రాంతాలకు తేగలిగారు. కేంద్రానికి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సాహసోపేత నిర్ణయాలతో చేపట్టిన సహాయక చర్యల వల్లే ప్రజలకు తక్షణ సాయం అందించగలిగారు. భారీ ప్రాణనష్టం ముప్పునుంచి రాష్ట్రాన్ని ఒడ్డుకు చేర్చగలిగారు.
విలయాన్ని ఎదుర్కొన్న విజయవాడ
విజయవాడలోని ప్రధాన ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలకు ఆహార సరఫరా అత్యంత కష్టతరమైనదిగా మారింది. టెక్నాలజీని ఔపోసన పట్టిన చంద్రబాబు.. వరద సహాయక చర్యలకు సాంకేతికతను అనుసంధానించి బాధితులకు తక్షణం సాయం అందించారు. అధికార యంత్రాంగంతో అనుక్షణం సమీక్షలు నిర్వహిస్తూనే.. సహాయక చర్యలపై మార్గనిర్దేశం చేస్తూ.. ఆకలి బాధల నుంచి వరద బాధితులకు విముక్తి కలిగించారు. చరిత్రలో తొలిసారిగా డ్రోన్ల సాయంతో బాధితులకు ఆహారం మరియు నిత్యావసరాలను సరఫరా చేయడంవంటి వినూత్న చర్యలతో.. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రభుత్వాలు ఎలా స్పందించవచ్చో చేసి చూపించారు.
పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి
ప్రభుత్వ సహాయక చర్యలేకాకుండా, వరదల కారణంగా ఏర్పడిన పారిశుద్ధ్య సమస్యలను ఎదుర్కొనడంలోనూ ముఖ్యమంత్రి అనుసరణీయ విధానం అద్భుత ఫలితాలే ఇచ్చింది. వరద తగ్గిన వెంటనే ఫైర్ ఇంజిన్ల సాయంతో రోడ్లపై పేరుకున్న బురదను శుభ్రపర్చడం, కాల్వల్లో పేరుకున్న చెత్తను తొలగించడం, వ్యాధులు ప్రబలకుండా డ్రోన్ల సాయంతో బ్లీచింగ్ చల్లడంవంటి ఆధునిక ప్రక్రియ.. పనులను సులువు చేసే అంశమే.
వైద్య శిబిరాలు మరియు ఆరోగ్య సంరక్షణ
విపత్తు తరువాత ఎదుర్కోవాల్సిన యుద్ధంపైనా ముఖ్యమంత్రి చంద్రబాబు అవిరళ కృషినే సాగించారు. ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. నిరాశ్రయులకు, బాధితులకు అవసరమైన వైద్యసేవలను అందించేందుకు ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి, ఉచితంగా మందులు, సేవలు అందించారు.
ప్రజల ఆదరణ
విజయవాడ వరద సహాయ కార్యక్రమాలలో ప్రభుత్వం స్పందించిన తీరుకి ప్రజల నుంచి చంద్రబాబు నాయుడు ప్రశంసలు అందుకున్నారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించడం, బాధితులనుంచి వివరాలు తెలుసుకోవడం, నిత్యావసరాల పంపిణీ.. ఇవన్నీ ప్రభుత్వంపై ప్రజలకి అపార నమ్మకాన్ని కలిగించాయి. ముఖ్యమంత్రి చందబాబు పిలుపు మేరకు దాతలు ముందుకొచ్చి భారీగా వరద సహాయ విరాళాలు అందించారు. అక్షయపాత్ర వంటి సంస్థలు 10 లక్షల మందికి ఆహారం అందించడం ఇందుకు ఉదాహరణ.
కెఎస్ జవహర్, మాజీ మంత్రి