అమరావతి: ఏపీలో రుషికొండ ప్యాలెస్ సంచలనం సృష్టిస్తోంది. సీఎం క్యాంప్ ఆఫీస్ కోసం వందల కోట్ల ప్రజాధనాన్ని జగన్ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం మారిన తరువాత రుషి కొండ వ్యవహారానికి సంబంధించి కీలక విషయాలు బహిర్గతమై జాతీయ రాజకీయాల్లో సైతం కాక రేపుతున్నాయి. రుషికొండ ప్యాలెస్ వివాదంపై జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. జగన్ దోపిడీ యావత్ దేశాన్ని షాక్కు గురి చేసిందని అన్నారు. తమ పిల్లలకు ఓ గూడు కల్పించేందుకు పేదలు అలమటిస్తుంటే జగన్ మాత్రం ప్రజాధనంతో తన కోసం ప్యాలెస్ నిర్మించుకున్నారు. ఆయన దోపిడీ.. యావత్ దేశాన్ని షాక్కు గురి చేసింది. ఈ విషయంలో విచారణ జరిపించి, న్యాయం జరిగేలా చూస్తాము. ఈ భవనం ప్రజలకు చెందేలా చేస్తామని ఎక్స్ వేదికగా లోకేష్ పోస్టు పెట్టారు.