- పారదర్శక సేవలతో రైతులకు మరింత చేరువ
- రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖల మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి
- సహకార సమాచారం మాసపత్రిక ఆవిష్కరించిన మంత్రి
అమరావతి(చైతన్యరథం): రాష్ట్ర వ్యాప్తంగా సహకార వ్యవస్థను సమగ్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. గురువారం విజయవాడ క్యాంపు కార్యాలయంలో సహకార సమాచారం పుస్తకాన్ని మంత్రి అచ్చెన్నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహకార వ్యవస్థను ప్రక్షాళన చేసి రైతులకు పారదర్శకంగా సేవలందించేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ ఆధ్వర్యంలో సహకార సమాచారం మాసపత్రిక ప్రారంభమవడం మంచి పరిణామం అన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించే వివిధ శిక్షణా కార్యక్రమాల గురించి సభ్యులు వివరించారు. సహకార సమాచారం పుస్తకాన్ని ప్రతి నెలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సహకార సంఘాలన్నిటికీ, ప్రజాప్రతినిధులకు, సహకార బ్యాంకులకు పంపిణీ చేయనున్నట్లు యూనియన్ ప్రతినిధులు తెలిపారు. ఈ పత్రికలో సహకార సంఘాల విజయ గాథలు, సహకార సంఘాల్లో ఇటీవల పరిణామాలు, ప్రభుత్వం జారీ చేసిన జీవోలను ప్రచురిస్తామని తెలియజేశారు. అంతే కాకుండా రాష్ట్ర సహకార యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని నాలుగు సహకార శిక్షణా కేంద్రాల్లో కోఆపరేటివ్ మేనేజ్మెంట్‌లో ఆరు నెలల డిప్లమో కోర్సులు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు ఆదిమూలం వెంకటేశ్వరరావు, సెక్రటరీ సిహెచ్ వి రామారావు, ట్రెజరర్ సోమేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ ఎం రామ్మోహన్రావు, రామదాసు శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్ వి. శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.