- కుప్పానికి ‘జన నాయకుడు’!
- ప్రజా సమస్యల పరిష్కారానికి వినూత్న ప్రయోగం
- సొంత సెగ్మెంట్లో శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు
- ప్రతి సమస్య పరిష్కారానికి నిర్ణీత గడువు
- సమస్య పరిష్కరించే వరకూ ఫాలో అప్ టీం
- సీఎం స్వయంగా స్టేటస్ తెలుసుకునేలా డ్యాష్ బోర్డు
కుప్పం (చైతన్య రథం): ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా కుప్పంలో సరికొత్త కార్యక్రమానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. దానిపేరే జన నాయకుడు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా తన నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే అని సీఎం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే ముఖ్యమంత్రిస్థాయిలో ఉన్న వ్యక్తి సొంత నియోజకవర్గంలో నిత్యం అందుబాటులో ఉండటం అసాధ్యం. అయినప్పటికీ ఇప్పటికే చంద్రబాబు తనకున్న వ్యవస్థను ఉపయోగించి దృష్టికి తీసుకొచ్చిన వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపడం మనం ఇప్పటి వరకూ చూశాం. అయితే ఈసారి మరో వినూత్న కార్యక్రమానికి తెరతీశారు. ప్రజలువచ్చి నేరుగా తమ సమస్యలను చెప్పుకునేందుకు ప్రజానాయకుడు పేరుతో పార్టీ కార్యాలయంలో కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. సమస్యలపై ప్రజలిచ్చిన అర్జీల స్టేటస్‌ను తన డ్యాష్ బోర్డులో కూడా చూసుకునేలా ఈ వెబ్‌సైట్‌ను రూపొందించారు. ఇక వివరాల్లోకి వెళ్తే….. ఈ ‘జన నాయకుడు’ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని కార్యాలయంలో నియమించారు.
తమ సమస్యలపై అర్జీలతో పార్టీ కార్యాలయానికి వచ్చిన ప్రజలను సాదరంగా సంబంధిత సిబ్బంది రిసీవ్ చేసుకుంటుంది. సమస్యలపై వచ్చారు కదా అని కసురుకోకుండా కూర్చోబెట్టి వారికి తాగడానికి ఓ కాఫీ లేదా టీ ఇచ్చి గౌరవంగా చూస్తారు. వచ్చిన వారిని వారి సమస్యను జననాయకుడు అనే అప్లికేషన్లో రాస్తారు. ఇక్కడ ఐదుగురు ఎంగేజ్మెంట్ అధికారులు ఉంటారు. వీరికి ఒక్కొకరికి ఆరు విభాగాలు కేటాయించారు. ఎంగేజ్మెంట్ ఆఫీసర్లు ప్రజల సమస్యను ఓపిగ్గా విని పోర్టల్‌లో పొందుపరుస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు పరిష్కరించదగిన సమస్యలైతే వాటిని పీజీఆర్ఎస్ (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సెల్ సిస్టమ్)కు పంపిస్తారు. పార్టీ తరపున చేయవలసిన పనులైతే వెంటనే పార్టీ నాయకత్వం దృష్టిసారించి చర్యలు తీసుకుంటుంది. సమస్యను ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తారో కూడా రసీదు కాపీపై బాధితులకు తెలియజేస్తారు. రసీదు ఇచ్చేశాం… మా పని అయిపోయిందన్నట్టు కాకుండా దీనికి మరో ప్రత్యేక టీంకూడా ఉంటుంది. అదే ఫాలోఅప్ టీం. ఈ ఫాలోఅప్ టీం సంబంధిత అధికారులను నిత్యం సంప్రదిస్తూ సమస్యను సకాలంలో పరిష్కరమయ్యేలా చూస్తారు.
నేరుగా ముఖ్యమంత్రి పరిశీలించేలా..
ప్రతి అర్జీ, పరిష్కారం ఎంతవరకు వచ్చిందనేది నేరుగా సీఎం చూసేలా డాష్‌బోర్డ్ కూడా ఏర్పాటు చేశారు. దీన్ని బట్టి సమస్యలు సత్వరం పరిష్కారమవుతున్నాయా… లేదా అన్న దాన్ని సీఎం ప్రత్యక్షంగా చూడొచ్చు. నేరుగా అక్కడికి రాలేని వాళ్ల సౌకర్యార్ధం టోల్ ఫ్రీ నంబర్ కూడా ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా జన నాయకుడుకు వచ్చిన సమస్యల పరిష్కారంపై కాల్ సెంటర్ నుంచి అర్జీదారులకు ఫోన్ చేసి వారి అభిప్రాయం కూడా తీసుకుంటారు. సంతృప్తిగా ఉన్నారా… అసంతృప్తిగా ఉన్నారా… అసంతృప్తిగా ఉంటే దానికి గల కారణాలను తెలుసుకుంటారు. మీడియాలో వచ్చే ప్రజాసమస్యలను కూడా గుర్తించి సూమోటోగా జననాయకుడు పోర్టల్‌లో అప్లోడ్ చేసి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు.