- కొనియాడిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
- వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు 150 ఎలక్ట్రికల్ ట్రై సైకిళ్లు పంపిణీ
- ఆత్మకూరులో పండగ వాతావరణంలో కార్యక్రమం
- పాల్గొన్న మంత్రి ఆనం, ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర
ఆత్మకూరు (చైతన్యరథం): నెల్లూరు పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విశాలమైన మనసు గల గొప్ప సేవాతత్పరుడు అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కొనియాడారు. ఆదివారం ఉదయం నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సారథ్యంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో దివ్యాంగులకు ట్రై సైకిళ్ల పంపిణీని పండగ వాతావరణంలో నిర్వహించారు. వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు రూ. 60 లక్షలు విలువచేసే 150 ఎలక్ట్రిక్ మోటార్ ట్రై సైకిళ్లు మంత్రి ఆనం, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర పంపిణీ చేశారు. వికలాంగుల వద్దకు వెళ్లి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ట్రై సైకిళ్లు చేశారు. రూ. 40వేలు విలువచేసే ఎలక్ట్రికల్ ట్రై సైకిల్ ను ఉచితంగా అందజేయడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ నేతలకు దివ్యాంగులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు పార్లమెంటు చరిత్రలో సువర్ణ అధ్యాయానికి వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి శ్రీకారం చుట్టారని చెప్పారు. పండగ వాతావరణంలో వికలాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేయడం ఆత్మకూరు పట్టణంలో అరుదైన విశేషంగా పేర్కొన్నారు. ఎంతోమంది పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఉన్నప్పటికీ విశాలమైన ఆలోచన దృక్పథం, సేవా స్ఫూర్తి గల వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు పార్లమెంటు సభ్యులుగా ఉండడం జిల్లా ప్రజల అదృష్టంగా మంత్రి పేర్కొన్నారు. ప్రభాకర్ రెడ్డి ఔదార్యం ముందు దివ్యాంగులు తమ బాధలు కూడా మర్చిపోయారని, ఆనందంగా ట్రై సైకిల్ అందుకొని సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఆత్మకూరులో 150 మంది వికలాంగులకు ట్రై సైకిల్ అందించారని, ఇంకా ఎవరైనా అర్హత ఉండి ట్రై సైకిల్ అందని వారి ఉంటే వారికి కూడా అందించాలని సిబ్బందికి ఎంపీ సూచించినట్లు మంత్రి ఆనం పేర్కొన్నారు. గొప్ప మనసుతో మంచి కార్యక్రమాలకు నాంది పలుకుతున్న ఎంపీ వేమిరెడ్డికి ఆత్మకూరు ప్రజానీకం తరపున మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఇదే స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు: ఎంపీ వేమిరెడ్డి
నెల్లూరు పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు చాలామంది వికలాంగులు తన వద్దకు వచ్చి గ్రామాలకు వాటర్ ప్లాంట్లు ఇస్తున్నారు కదా, అదేవిధంగా తమకు కూడా ట్రై సైకిళ్లు అందించాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా ఎలక్ట్రికల్ ట్రై సైకిళ్ల పంపిణీకి శ్రీకారం చెప్పినట్లు ఎంపీ చెప్పారు. ఇప్పటికే కోవూరులో 250, ఉదయగిరిలో 150, కందుకూరులో 150, ఆత్మకూరులో 150 ట్రై సైకిళ్లు అందించామని, త్వరలోనే మిగిలిన మూడు నియోజకవర్గాల్లో కూడా అందిస్తామని ఎంపీ చెప్పారు. ఆత్మకూరు పట్టణంలో స్థానిక శాసనసభ్యులు, మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రత్యేక శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించినట్లు ఎంపీ పేర్కొన్నారు. ట్రై సైకిళ్లు అందుకున్న ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి పలకరించినపుడు కలిగిన ఆనందం మధురానుభూతిగా ఉందని, ఇదే స్ఫూర్తితో ఇలాంటి మంచి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని సంకల్పించుకున్నట్లు చెప్పారు. దివ్యాంగులందరూ ఈ ట్రై సైకిల్స్ ను సద్వినియోగం చేసుకొని ఆత్మస్థైర్యంతో జీవించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.