పలాస: శంఖారావం కార్యక్రమంలో భాగంగా పలాస నియోజకవర్గం కేదారిపురం విచ్చేసిన యువనేత లోకేష్ కు నియోజకవర్గ నలుమూలల నుంచి వచ్చిన వివిధవర్గాల ప్రజలు వారు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు. ఐటిడిఎలో అన్ని ఉద్యోగాలు గిరిజనులతోనే భర్తీచేయాలని, పలాస కేంద్రంగా ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల ఏర్పాటుచేయాలని ఆదివాసీ ఐక్యసేవా సంఘం ప్రతినిధులు విన్నవించారు. సిపిఎస్ విధానాన్ని రద్దుచేయాలని ఎపి రాష్ట్ర సిపిఎస్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు కోరారు.
జీడిపంటకు మద్దతు ధర కల్పించి జీడిరైతులను ఆదుకోవాలని, అదేవిధంగా జీడి పిక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి 80 కేజీల పిక్కల బస్తా రూ.16వేలకు కొనుగోలు చేయాలని శ్రీకాకుళం జిల్లా రైతాంగ సమస్యల సాధన కమిటీ, పలాస, మందస, వజ్రపుకొత్తూరు మండలాల జీడిరైతుల ఐక్యవేదిక ప్రతినిధులు విజ్ఞప్తిచేశారు.
యాదవులను బిసి డి నుంచి బిసి బిలోకి చేర్చాలని పలాస యాదవ సంఘ ప్రతినిధులు కోరారు. వజ్రపుకొత్తూరు మండలంలో 12పంచాయితీలు చేపలవేటపై ఆధారపడి ఉన్నాయని, మినీ జెట్టీ నిర్మాణం త్వరగా పూర్తిచేయాలని, ప్రత్యేకంగా మత్స్యకార గురుకుల పాఠశాల ఏర్పాటుచేయాలని మత్స్యకార సంఘ ప్రతినిధులు విన్నవించారు. కేవటి కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చాలని ఆ కుల పెద్దలు నారా లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కష్టాల్లో ఉన్న స్వర్ణకారుల సంక్షేమం కోసం కృషిచేయాలని కాశీబుగ్గ శ్రీ కంచి కామాక్షి స్వర్ణకారుల సేవాసంఘం యువనేత లోకేష్ విజ్ఞప్తి చేసింది. వివిధవర్గాల వినతులను సావధానంగా విన్న లోకేష్ టిడిపి-జనసేన ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నివర్గాల ప్రజలకు అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.