విశాఖ: జగన్ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. విశాఖ నగరంలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచార ఘటన అమానుషమన్నారు. సీఎం జగన్ మాట్లాడితే …నా ఆడ బిడ్డలు, నా అక్క చెల్లెలు అంటారు.. కానీ వారికి రక్షణ కల్పించలేకపోతున్నారు.. నాలుగున్నరేళ్లుగా మహిళాలపై యథేచ్ఛగా అఘాత్యాలు జరుగుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆమె విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో మహిళలపై నేరాలకు సంబంధించి లక్ష 48 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయని, మహిళలపై అఘాత్యాల్లో దేశంలోనే ఏపీి మూడవ స్థానంలో ఉందన్నారు. ఈ విషయంపై పవన్ కల్యాణ్, ప్రతిపక్షాలు మాట్లాడితే కేసులు పెట్టారని మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలకు, ఆడ పిల్లలకు రక్షణ లేదని, పక్క రాష్ట్రం నుంచి వచ్చిన దళిత బాలికపై 11 మంది గ్యాంగ్ రేప్ చేశారని, దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారని ఆమె ప్రశ్నించారు. ఈ విషయంలో దళిత హోంమంత్రి ఎందుకు స్పందించరని అనిత నిలదీశారు. ఇంత ఘోరం జరిగినా మహిళా కమిషన్ చైర్ పర్సన్ విశాఖకు ఎందుకు రాలేదు? బాధిత కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని అనిత ప్రశ్నించారు. ఇప్పుడే నిద్ర లేచి… సుమోటోగా కేసు స్వీకరిస్తామని అంటున్నారని, కేసును పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారని మండిపడ్డారు. ఏపీలో రోజు రోజుకూ మహిళలు, బాలికలపై అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు. ఇలాంటి ఘటనలపై డీజీపీ ఎందుకు స్పందించడం లేదన్నారు. బాధిత కుటుంబాన్ని తాము పరామర్శిస్తామంటే.. వివరాలు పోలీసులు ఇవ్వడం లేదని, మీడియాను కూడా పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్ కంటే ముందు జగన్ వస్తారని జబర్దస్త్ డైలాగ్ కొట్టేవారు ఎక్కడ ఉన్నారని మంత్రి రోజాను ఉద్దేశించి ప్రశ్నించారు. అందరి చేత డౌన్ లోడ్ చేయించారు కదా.. దిశ యాప్ ఏమైందని అనిత నిలదీశారు. మూడు నెలల్లో వైసీపీ ప్రభుత్వం పోతుందని అనిత అన్నారు. మహిళల రక్షణ కోసం భారతీ రెడ్డి ముందుకు రావాలన్నారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్న ఆర్జ్జీవీపై ఎందుకు కేసులు పెట్టడం లేదు.. ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై మాత్రం కేసులు పెడతారని మండిపడ్డారు