- భువనేశ్వరి దళితులను తిట్టినట్లు ప్రచారమవుతున్న ఫేక్ ఆడియోపై సీఈఓకు టీడీపీ ఫిర్యాదు
- ఫేక్ ఆడియోలు, వీడియోల సృష్టికర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
- ఓటమి భయంతో జగన్‌రెడ్డి తప్పుడు పనులకు దిగుతున్నారని ఆగ్రహం
- ధైర్యంగా ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని వర్ల, దేవినేని సవాల్
అమరావతి(చైతన్యరథం): ఎన్నికల్లో గెలవలేమని తెలిసి వైసీపీ నేతలు ఫేక్ ఆడియోలతో సామాజిక మాధ్యమాల్లో దిగజారుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి దళితులను తిట్టినట్లుగా ఫేక్ ఆడియోలు సృష్టించి ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు శుక్రవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈఓ) ముఖేష్ కుమార్ మీనాను కలిసి ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఓటర్లను ప్రభావితం చేసేలా దిగజారుడు ప్రచారాలు చేస్తున్నవారిని కనిపెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వర్ల రామయ్య, దేవినేని ఉమా మాట్లాడారు.
ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం: వర్ల రామయ్య
ఎన్నికల సంఘం ఎన్నిసార్లు చివాట్లు పెట్టినా వైసీపీ నేతల వ్యవహారశైలి మాత్రం మారడం లేదని వర్ల రామయ్య మండిపడ్డారు. వైసీపీ సోషల్ మీడియా సిగ్గు మాలిన పనులకు పాల్పడుతూ దిగజారుడు ప్రచారాలు చేస్తోంది. ఎవరిపట్లా, ఎప్పుడూ పరుషంగా మాట్లాడని నారా భువనేశ్వరిపై అసత్య ప్రచారం చేస్తున్నారు. దళితులను భువనమ్మ తిడుతున్నట్లుగా దరిద్రపు ఆడియో క్లిప్‌ను సృష్టించి సామాజిక మాధ్యమాల్లో వైసీపీ ప్రచారం చేస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి, తెలుగుదేశం పార్టీలపై ప్రజల్లో వ్యతిరేకత తీసుకొచ్చి తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలని, దొడ్డి దారుల్లో అధికారంలోకి రావాలని జగన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్ని తప్పుడు పనులు చేసైనా అధికారం నిలబెట్టుకోవాలని తాపత్రయ పడడం సరైన పద్ధతి కాదు. గెలుస్తామనే నమ్మకం వైసీపీ నాయకులకు ఉంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేశామో? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేసిందో ప్రజల ముందు తేల్చుకుందాం. పేదవాడి సంక్షేమం కోసం పోరాడిన నందమూరి తారక రామారావు కూతురు, పేదవాడిని అందలం ఎక్కించాలని తాపత్రయ పడిన చంద్రబాబు సతీమణి భువనేశ్వరి.. దళితులను తిట్టారు అంటే రాష్ట్రంలోని ఏ దళితుడు నమ్మడం లేదు. ఇలా వైసీపీ సోషల్ మీడియా ఫేక్ ఆడియోలు సృష్టించి అబద్ధపు ప్రచారాలు చేస్తున్న వైనంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాం. దీనిపై సీఐడి అడిషనల్ డీజీకి సిఫార్సు చేసి, కేసు నమోదు చేయించి ఇటువంటి దరిద్రపు పనులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఈఓ హామీ ఇచ్చారని వర్ల రామయ్య తెలిపారు.
దిగజారుడు రాజకీయాల్లో జగన్ రెడ్డి దిట్ట : దేవినేని
మహిళలపట్ల ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఉన్న సంస్కారం ఏంటో ప్రజలకు అర్థమైందని దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. సొంత చెల్లి కట్టుకున్న చీర గురించి సంస్కారం లేకుండా జగన్ రెడ్డి మాట్లాడిన తీరును చూసి ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది. ఆ విషయం నుంచి ప్రజలను దారి మళ్లించేంకు పన్నిన కుట్రలో భాగమే నారా భువనేశ్వరి ఫేక్ ఆడియో. హైదరాబాద్‌లో సజ్జల భార్గవ్ రెడ్డి ఒక ఫేక్ ఫ్యాక్టరీని పెట్టుకొని ఇటువంటి ఫేక్ ఆడియోలు, వీడియోలను సృష్టించి క్లియరెన్స్ కోసం తాడేపల్లి ప్యాలెస్‌కు పంపించి తర్వాత సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తుంటాడు. ఇటువంటి ఫేక్ వార్తలు సృష్టించి వాటిని ప్రచారం చేయడంలో సజ్జల భార్గవ్రెడ్డిదే కీలకపాత్ర. టీడీపీ నాయకులను ఎన్నికల కురుక్షేత్రంలో ఎదుర్కోలేక మా నాయకులపై తప్పుడు ప్రచారాలు చేయించి ఎన్నికల్లో లబ్ధి పొందాలని జగన్ రెడ్డి చూస్తున్నాడు. ఇకనైనా ఇటువంటి దిగజారుడు రాజకీయాలను మానేయ్ జగన్ రెడ్డి! ధైర్యంగా ఎన్నికల్లో యుద్ధం చేసి తెల్చుకుందాం. అంతేకానీ నీ రాజకీయ లబ్ధి కోసం మహిళలను కించపరిచేలా వార్తలు సృష్టించి వారి గౌరవానికి భంగం కలిగించవద్దని దేవినేని ఉమా హెచ్చరించారు.