- సీఎల్సీ నేతగా ఖరారు చేసిన కాంగ్రెస్ అధిష్టానం
- 7న ప్రమాణస్వీకారం
- అదే రోజున పూర్తిస్థాయి మంత్రివర్గం
హైదరాబాద్, చైతన్యరథం: తెలంగాణా సీఎంగా రేవంత్‌రెడ్డి పేరు ఖరారయ్యింది. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అధికారికంగా ప్రకటించినప్పటికీ తెలంగాణ కాంగ్రెస్ శానసనభా పక్ష నాయకుడిగా రేవంత్‌రెడ్డి పేరునే కాంగ్రెస్ అధినాయకత్వం ఖరారు చేసింది. అయితే డిప్యూటీ సీఎంలు, మిగిలిన మంత్రివర్గం మీద ఇంకా కసరత్తు నడుస్తూ ఉండడంతో ముందుగా అనుకున్నట్లు సోమవారం రాత్రి చేయాలనకున్న ప్రమాణస్వీకారం వాయిదాపడిరది. అయితే మంగళ, బుధవారాలు మంచిరోజులు కాకపోవడంతో ఈనెల 7వ తేదీన అంటే గురువారం ఉదయం 10 గంటలకు పూర్తిస్థాయి మంత్రివర్గంతో రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. పెద్దఎత్తున నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి సోనియా, రాహుల్, ప్రియంకా హజరుకానున్నారు. కాంగ్రెస్ తన సంప్రదాయానికి భిన్నంగా శాసనసభపక్ష నేత ఎన్నికల విషయంలో ఈసారి వడివడిగా అడుగులు వేసింది. ఫలితాలు వచ్చిన రోజునే గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాల్సిందిగా కోరారు. అదే రోజున సిఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేస్తారనే ప్రచారం కూడా సాగింది. ఆ రోజు కాకపోయినా మరుసటిరోజే సిఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేసి అధికారాన్ని మల్లిఖార్జున ఖర్గేకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గతంలో సిఎం అభ్యర్ధి ఎవరనేది తేల్చేందుకు కాంగ్రెస్ పార్టీ రోజుల కొద్దీ కసరత్తు చేసేది. కానీ ఈసారి మాత్రం చాలా త్వరగానే నిర్ణయం తీసుకున్నారు.
సోమవారం ఉదయం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్లో సీఎల్పీ సమావేశం జరిగింది. సీఎం అభ్యర్థి ఎవరనేది నిర్ణయించే అధికారాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు అప్పగిస్తూ ఏకవ్యాక్య తీర్మానాన్ని సీఎల్పీ అమోదించింది. దాదాపు గంట పాటు జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి విజయాన్నిందించిన తెలంగాణా ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ కూడా తీర్మానాన్ని ఆమోదించామని కాంగ్రెస్ నేత, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. అయితే సీఎల్సీ సమావేశం అనంతరం కొద్ది గంటల్లోనే అధినాయకత్వం సీఎం అభ్యర్థి పేరును ప్రకటిస్తుందని, సోమవారం రాత్రి 8.30 గంటలకే రాజ్‌భవన్‌లో సీఎంగా రేవంత్‌రెడ్డి, ఆయనతోపాటు డిప్యూటీ సీఎంలు మాత్రమే ప్రమాణ స్వీకారం చేస్తారని, ఆ తర్వాత 9వ తేదీన పూర్తిస్థాయి మంత్రివర్గంతో భారీగా ప్రమాణస్వీకారోత్సవం ఉంటుందని వార్తలు వచ్చాయి. దీనికి తగ్గట్లుగానే రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారోత్సవానికి ఏర్పాట్లు కూడా ప్రారంభమయ్యాయనే వార్తలు వచ్చాయి. ఈలోపు తెలంగాణ రెండో శానసన సభను రద్దు చేస్తూ మూడో శాసనసభను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర గవర్నర్ తమిళసై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. కానీ మంత్రుల విషయం తేలాల్సి ఉన్నందున ప్రమాణస్వీకారత్సోవం వాయిదాపడినట్లు తెలిసింది. మరోవైపు అధికారులు ముఖ్యమంత్రి, కొత్త మంత్రుల కోసం సచివాలయాన్ని సిద్ధం చేశారు. పాత మంత్రుల నేమ్‌పేట్లను తొలగించారు. సలహాదారుల ఆఫీసులన్నీ ఖాళీ చేశారు. కాగా గత ప్రభుత్వంలో ఉన్న సలహాదారులంతా తమ పదవులుకు రాజీనామా చేశారు. వివిధ కార్పొరేషన్ ఛైర్మన్లు, ఓఎస్‌డీలు తమ పదవులకు రాజీనామా చేశారు.