విజయవాడ(చైతన్యరథం): వరద బాధితులకు ఆరు వస్తువులతో కూడిన కిట్లను అందజేసిన నిగమ ఫౌండేషన్ సేవలను రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి ఎస్ సవిత కొనియాడారు. నగరంలోని భవానీ ఘాట్ స్వాతి సెంటర్లో వరద బాధితులకు నిగమ ఫౌండేషన్ అందించిన కిట్లను గురువారం మంత్రి సవిత పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు నాయుడు పది రోజుల పాటు రేయింబవళ్ళు కష్టపడి విజయవాడ వరద బాధితులను ఆదుకున్నారన్నారు. సీఎం చంద్రబాబు స్ఫూర్తితో పలు స్వచ్ఛంద సంస్థలు కూడా వరద బాధితులకు అండగా నిలిచాయన్నారు. అనంతపురానికి చెందిన నిగమ ఫౌండేషన్ ఒకోక్కటి రూ.650 విలువ చేసే కిట్లను 1200 కుటుంబాలకు అందజేయడం అభినందించదగ్గ విషయమన్నారు. ఒక్కో కిట్లో స్టీల్ ప్లేట్, బౌల్, దుప్పటి, టవల్..ఇలా ఆరు రకాల వస్తువులు ఉన్నాయన్నారు. రూ.5 లక్షల విలువైన కిట్లను వరద బాధితులకు అందజేసిన నిగమ ఫౌండేషన్ నిర్వాహకుడు సమీర్ కుమార్ను మంత్రి సవిత అభినందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎంఎస్ బేగ్, తదితరులు పాల్గొన్నారు.