ఇబ్రహీంపట్నం(చైతన్యరథం): వరద బాధితులకు మేడ్ సేవలు అభినందనీయమని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశంసించారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దాములూరు గ్రామం మాదిగపల్లె వరద బాధితులు 250 కుటుంబాలకు మోడల్ అసోసియేషన్ అఫ్ దళిత్ ఎంప్లాయీస్(ఏపీ మేడ్) ఆధ్వర్యంలో బుధవారం 250 కుటుంబాలకు ఒకొక్కరికి రూ.వెయ్యి విలువ చేసే నిత్యావసరాలు అందచేశారు. మేడ్ రాష్ట్ర అధ్యక్షుడు మురికిపూడి దేవపాల్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. వర్ల రామయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. దళిత ఉద్యోగులు ‘‘పే బ్యాక్ టు సొసైటీ’’ అన్న అంబేద్కర్ నినాదం స్ఫూర్తిగా తీసుకుని ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తున్న మేడ్ అసోసి యేషన్‌ను అభినందించారు. అదే సమయంలో ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయక త్వంలో వరద బాధితులకు పూర్తి అండగా ఉందని, బాధితులకు అన్ని వసతులు కల్పించి సాధారణ స్థితికి తీసుకురావటానికి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.
మాదిగపల్లెలో ప్రభుత్వ పాఠశాల లేదు అన్న విషయం తెలిసి అక్కడ నుండే జిల్లా విద్యాధికారితో మాట్లాడి వెంటనే పాఠశాల ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. మేడ్ అధ్యక్షుడు మురికిపూడి దేవపాల్ మాట్లాడుతూ పెద్దలు వర్ల రామయ్య సూచన మేరకు ఈ దాము లూరుకు వచ్చినట్టు చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా పెద్దల సహాయం తో చేస్తామని తెలిపారు. అనంతరం బాధితులకు 10 కిలోల బియ్యం, నూనె, ఎనిమిది రకాల నిత్యావసరాలు వర్ల రామయ్య చేతులమీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్ వ్యవస్థాపకుడు శృగారపాటి శ్యామ్‌సుందర్, ప్రధాన కార్యదర్శి పొన్నూరు శామ్యూల్ జోబ్, ఏపీపీటీడీ రాష్ట్ర నాయకులు మొగులూరి అబ్రహం, పెరకలపూడి రమేష్, రావెల నల్లయ్య, కోడూరి అఖిల్, కొర్రపోలు అనిల్, పల్నాడు రవి, గ్రామస్తులు పాల్గొన్నారు.