- ఐదేళ్లలో వ్యవస్థల విధ్వంసం, అరాచకశక్తులకు అందలం
- పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసి, ఇష్టానికి వాడుకున్నారు
- ఇప్పటికీ అదే అలసత్వం, అందుకే చిన్నారులు, మహిళలపై వరుస దారుణాలు
- క్రిమినల్‌కు కులం, మతం వర్తించవు
- నేరాల అదుపునకు పోలీసులు కఠినంగా వ్యవహరించాలి
- ఎన్నిసార్లు చెప్పినా మీనమేషాలు లెక్కిస్తున్నారు
- నేను హోం శాఖ తీసుకుంటే పరిస్థితి వేరేగా ఉంటుంది
- కూటమి ఐక్యతను వ్యక్తులు దెబ్బ తీయలేరు
- పిఠాపురం అభివృద్ధికి ‘పాడా’ ఏర్పాటు
- ఉచిత ఇసుక ప్రజల హక్కు.. క్షేత్రస్థాయిలో జులుం చేసేవారిపై తిరగబడండి
- గొల్లప్రోలు సభలో డిప్యూటీ సీఎం పవన్ ఉద్ఘాటన
పిఠాపురం (చైతన్యరథం): గత ఐదేళ్లలో ప్రభుత్వం పనిచేయలేదని.. పోలీసు సహా అన్ని వ్యవస్థలను విధ్వంసం చేసిందని, ఈ పరిణామాల ఫలితాలను ఇప్పుడు చూస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న వరుస అఘాయిత్యాలన్నీ గత ప్రభుత్వ వైఫల్యాల వారసత్వంలో భాగమే అన్నారు. మూడు నెలల చిన్నారిని చిదిమేసే క్రూరులు… ఐదేళ్ల బిడ్డపై అత్యాచారానికి పాల్పడే దుర్మార్గులు… దొంగతనానికి వెళ్లి ఇంట్లోని వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి ప్రాణాలు తీసే నీచులు… ఇలాంటి దారుణాలకు గత ప్రభుత్వం మిగిల్చిన పాపాలే కారణమని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో ఈ అరాచక శక్తులను అప్పటి పాలకులే పెంచి పోషించారని స్పష్టం చేశారు. అరాచకవాదులు ఓ మాజీ ముఖ్యమంత్రి భార్యను అనరాని మాటలు అన్నా అప్పటి ప్రభుత్వం నుంచి చర్యల్లేవ్… ఓ పార్టీకి అధ్యక్షుడిగా, ప్రజాదరణ ఉన్న వ్యక్తిగా నా ఇంట్లోని వాళ్లను రేప్ చేస్తామని బాహాటంగా అసాంఘిక శక్తులు ప్రకటించినా అప్పట్లో కేసుల్లేవు. దీంతో రౌడీల్లో, అరాచక, అసాంఘిక శక్తుల్లో బరితెగింపు ఎక్కువయిందన్నారు. ఆ తెగింపు తారస్థాయికి వెళ్లి, అవే అరాచకశక్తులు నేడు అఘాయిత్యాలను కొనసాగిస్తున్నారని విమర్శించారు. సీఎంను చంపేస్తానని బెదిరించిన వ్యక్తిని పోలీసులు ఎందుకు వదిలేస్తున్నారని ప్రశ్నించారు. ఇళ్లలోకి వెళ్లి మహిళపై అత్యాచారం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు.
సోమవారం పిఠాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు పవన్ కళ్యాణ్ శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా గొల్లప్రోలులో జరిగిన సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గత పాలకులు వ్యవస్థలను నాశనం చేశారని మండిపడ్డారు. దీంతో అవి పని చేయడం మానేశాయి. పోలీసులు రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వర్తిస్తామని ప్రమాణం చేసి విధుల్లోకి వస్తారు. అలాంటిది పోలీసులు గత ప్రభుత్వంలో ప్రజల కోసం పనిచేయడం మానేశారు. దీంతో అసాంఘిక శక్తుల్లో భయం పోయింది. వారు రెచ్చిపోయి మరీ అఘాయిత్యాలకు తెగబడ్డారు. వారి వారసత్వ జాడలే ఇప్పడు మళ్లీ రాష్ట్రంలో కనిపిస్తున్నాయని ధ్వజమెత్తారు.
మీనమేషాలు లెక్కించవద్దు
పోలీసు వ్యవస్థ బలం చాలా పెద్దది. కిందిస్థాయి నుంచి పైస్థాయి అధికారుల వరకు గత ప్రభుత్వంలో చూపిన నిర్లిప్తత వీడి పని చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న అఘాయిత్యాల మీద గట్టిగా చర్యలు తీసుకోవాలి. పోలీసులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నేను పూర్తి స్వేచ్ఛను ఇచ్చాము. అయినా ఫలితాలు రావడం లేదు. పోలీసు శాఖ గత ప్రభుత్వ విధానాలు వీడి పనిచేయాలి. మీనమేషాలు లెక్కించడం మానుకోండి. రాష్ట్రం అభివృద్ధికి, ప్రజల సుఖసంతోషాలకు శాంతిభద్రతలు బలంగా ఉండటం ప్రధానం. దాన్ని కాపాడే బాధ్యత కలిగిన పోలీసులు సమర్థవంతంగా పని చేయాలి. మాకు సహనం ఎంత ఉందో తెగింపు కూడా అంతే ఉంది. రాష్ట్రంలో పూర్తిస్థాయిలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసేలా పోలీసులు నిజాయతీగా, నిబద్ధతతో పనిచేయాలని పవన్ అన్నారు.
వైసీపీ నేతల తీరు మారలేదు
రాష్ట్రంలో మహిళలపై నేరాలు ఎందుకు పెరిగాయి అన్న దానిపై పోలీసులు శాస్త్రీయ పరిశీలన జరిపి ముందుకు వెళ్లాలి. బూతులు తిట్టినా, రేప్ చేస్తామని చెప్పినా గత ప్రభుత్వంలో అది భావ ప్రకటన, వాక్ స్వాతంత్రపు హక్కు అని వైసీపీ పెద్దలు నిర్వచనం ఇచ్చారు. దీంతో ప్రతి ఒక్కరూ బూతులు తిట్టడం, బెదిరింపులకు పాల్పడటం, రేప్ చేస్తామని బహిరంగంగా చెప్పడం ఫ్యాషన్ అయిపోయింది. గత ప్రభుత్వంలో 30 వేల మంది ఆడబిడ్డలు అదృశ్యం అయ్యారని నేను గొంతు ఎత్తితే కనీస సమీక్ష చేయలేదు. రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులపై అసభ్యంగా మాట్లాడే ధోరణిని ఇప్పటికీ వైసీపీ నాయకులు, వారి మద్దతుదారులు మానుకోవడం లేదు. అదే నేర స్వభావాన్ని సమాజంలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. ఇష్టానుసారం మాట్లాడటం, సాంకేతికత సహాయంతో మహిళలను అవమానించడం వంటి పద్ధతులు వైసీపీ నాయకులు ఇంకా మానుకోలేదు. ఇకపై దీన్ని సహించేది లేదని పవన్ స్పష్టం చేశారు.
సంయమనంతో ఉన్నాము
అధికారంలో ఉన్నాం కాబట్టే సంయమనంతో ఉన్నాం. చేతగాక కాదు. వైసీపీకి తగిన బుద్ది చెప్పలేక కాదు. ఇదే వేదిక నుంచి పోలీసు వ్యవస్థకు, అధికారులకు చెబుతున్నా. శాంతిభద్రతలను కాపాడేందుకు కంకణబద్ధులై పనిచేయండి. పార్టీలు, కులం, మతం, ప్రాంతం అనేది చూడకండి. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారెవరైనా కఠినంగా వ్యవహరించండి. నా బంధువు అయినా నేరం చేస్తే శిక్షార్హుడే. తప్పులు చేసిన వారిని నా బంధువు, నా రక్తమని ఎవరైనా చెబితే మడత పెట్టి కొట్టండి. నేను ఎవరినీ వెనకేసుకొని రావడం లేదు. కులం, మతం అనేవి నేరాలు విషయంలో వర్తించవు. రాష్ట్ర హోం మంత్రి అనితకి కూడా ఒకటే చెబుతున్నా. శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో మీరు మరింత కఠినంగా, నిర్దయగా వ్యవహరించాలి. నేను కనుక హోంమత్రిత్వశాఖ తీసుకుంటే పరిస్థితులు మరోలా ఉంటాయి. నేను కలలో కూడా కోరుకునేదొక్కటే… అందరూ బాగుండాలి. రాష్ట్రం క్షేమంగా ఉండాలని కోరుకుంటాను. నేను మొదటి నుంచి చెబుతున్నట్లుగా మాది ప్రతీకార ప్రభుత్వం కాదు… అలాగే చేతగాని ప్రభుత్వం కూడా కాదు. ఇక అధికారులు చెప్పినవన్నీ వినడం అయిపోయింది.. ఇక చేతలే మిగిలాయని పవన్ గట్టిగా చెప్పారు.
యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఉండాలి
నేరగాళ్లను ప్రోత్సహించిన వారికి, నేరగాళ్లకు ఉత్తరప్రదేశ్ లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ తరహా ట్రీట్ మెంట్ అవసరం. నేరస్థుల పట్ల కఠినంగా వ్యవహరిస్తే తప్ప.. సమాజంలో మార్పు రాదు. పోలీసులకు మరోసారి చెబుతున్నాను… ప్రజల్లోకి వెళ్తున్న మమ్మల్ని వారు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో డీజీపీ, ఇంటిలిజెన్స్ డీజీ కూడా పూర్తిస్థాయి దృష్టి నిలపాలని పవన్ సూచించారు.
అధికారం ఓ బాధ్యత
గత 4 నెలల్లో ఒక్కసారి అయినా ఎన్డీయే ఎమ్మెల్యేలు వసతిగృహాలకు వెళ్లారా..అక్కడ విద్యార్థుల సమస్యలు విన్నారా..అధికారం వచ్చింది కేవలం విలాసం కోసం కాదు. ప్రజలు కోటి ఆశలతో, వారి కష్టాలు తీరుతాయన్న నమ్మకంతోనే అధికారం ఇచ్చారు. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. జనసేన నాయకులు, వీర మహిళలు కూడా క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని పవన్ అన్నారు.
ఇసుక మీ హక్కు తీసుకెళ్లండి
ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాబినెట్ సమావేశాల్లో ఉచిత ఇసుక మీద పదేపదే మంత్రులను హెచ్చరిస్తున్నారు. అలాగే పార్టీ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలకు కూడా ఉచిత ఇసుక విషయంలో కలగజేసుకోవద్దని చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి మారడం లేదు. ఉచిత ఇసుక అనేది ప్రజల హక్కు. నేను కానీ, చంద్రబాబు కానీ మీ ఇంటికి వచ్చి ఉచిత ఇసుక అందించలేం కానీ.. మీ నిర్మాణ అవసరాలకు ప్రజలు ఎవరైనా సమీపంలోని రీచ్‌కు వెళ్లి వాహనాలపై ఇసుకను పూర్తి ఉచితంగా తీసుకెళ్లవచ్చు. అయితే క్షేత్రస్థాయిలో కొందరు జులుం చెలాయిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రజల్లో చైతన్యం రావాలి. అంతా ఏకమై ఎదిరించాలి. ఉచిత ఇసుక అనేది ప్రభుత్వం కల్పించిన హక్కు. ఇది నల్లబజారుకు తరలిపోకుండా ప్రజల అవసరాలకు ఉపయోగపడాలి. ప్రజలకు పోలీసులు, జిల్లా రెవెన్యూ యంత్రాంగం తగిన విధంగా సహకరించాలి తప్పితే ప్రజలను ఇబ్బంది పెట్టేలా మాత్రం పనిచేయొద్దని పవన్ హితవు పలికారు.
తీర ప్రాంతాల్లో కొన్ని ఫార్మా కంపెనీలు ముఖ్యంగా అరబిందో, దివీస్ వంటి అగ్రసంస్థలు యథేచ్ఛగా తమ వ్యర్థాలను సముద్రంలో కలిపేస్తున్నాయి. ఫార్మా రంగం అనేది దేశ అభివృద్ధిలో మూలం. అయితే శుద్ధి చేయకుండా పరిశ్రమల్లో వచ్చే వ్యర్థాలను సముద్రంలో కలిపేస్తుండటంతో మత్స్య సంపద నాశనం అవుతోంది. ఫలితంగా మత్స్యకారుల జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి. దీనిపై పర్యావరణ శాఖ అధికారులు కూడా అన్ని అనుమతులు తీసుకున్నట్లు చెబుతున్నారు కానీ.. ఎక్కడో తప్పు జరుగుతోంది. దీనిపై మత్స్యకారులను, ఫార్మా కంపెనీలను కూర్చొబెట్టి తగిన విధంగా రెండు వైపులా న్యాయం జరిగేలా మాట్లాడాలని కోరుకుంటున్నారు. సమస్యకు పరిష్కారం దిశగా వెళ్లాలి తప్ప.. సమస్యను సంక్లిష్టం చేయకూడదన్నదే నా భావన. ప్రజలకు హాని కలిగించే చర్యలను మేం ఒప్పుకోం. మత్స్యకారులకు ఇబ్బంది కలిగితే స్పందిస్తామని పవన్ స్పష్టం చేశారు.
కూటమి స్ఫూర్తిని ఎవరూ చెడగొట్టలేరు
రాష్ట్రంలో సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడిరది. మూడు పార్టీల కూటమి కేవలం ఓ ఎన్నిక కోసం కాదు.. ఈ స్ఫూర్తి రాష్ట్ర ప్రజలకు ఉజ్వల భవిష్యత్తు ఇచ్చేందుకు పనిచేస్తుంది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కూటమి స్ఫూర్తి దెబ్బ తినదు. ఈ కూటమి బంధాన్ని ఒకరిద్దరు వ్యక్తులు చెడగొట్టలేరు. ఈ కూటమితో వ్యక్తిగతంగా ఆటలాడొద్దు. వైసీపీ నాయకులకు మరోసారి విన్నవిస్తున్నాను… పాలసీల ప్రకారం మాత్రమే మాట్లాడండి. మేం సమాధానం చెబుతాం. మా ఇష్టం.. మేం మారం… మేమింతే అంటే కనుక మేం కూడా మీ పద్ధతిలోకి మారాల్సి ఉంటుంది.. జాగ్రత్త అని పవన్ హెచ్చరించారు.
పిఠాపురం అభివృద్ధికి పాడా..
పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ ప్రాంతం సమగ్ర అభివృద్ధి కోసం పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (పాడా) ఏర్పాటు చేస్తాం. పిఠాపురాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని.. అభివృద్ధిపై మాస్టర్ ప్లాన్ తయారవుతోందని పేర్కొన్నారు. రాష్ట్రంలోనే అత్యంత అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా చేస్తానని చెప్పారు. ప్రధాన రహదారులతో గ్రామీణ రహదారుల అనుసంధానం చేస్తామన్నారు. రోడ్లపై చెత్త కనిపించకూడదన్నారు. పాఠశాల పిల్లలకు మైదానాలు బాగుండాలని.. తాగేందుకు పరిశుభ్రమైన నీరు ఉండాలని పవన్ అన్నారు.
ఈ సమావేశంలో కాకినాడ జిల్లా కలెక్టర్ షన్మోహన్ సగిలి, ఎస్పీ విక్రాంత్ పాటిల్, మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త మర్రెడ్డి శ్రీనివాస్, బీజేపీ నియోజక వర్గం ఇంచార్జ్ బి.కృష్ణంరాజు, తదితరులు పాల్గొన్నారు.