- ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలతో యువతకు నియామకాల పండుగ
- రాజకీయ ముసుగులో నేరాలు చేసే వారిపట్ల జాగ్రత్త
- పోలీసులకు పూర్తి స్వేచ్ఛ- నేరస్తులపట్ల కఠినంగా ఉండాలి
- నూతన కానిస్టేబుళ్ల నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు
- కానిస్టేబుళ్లుగా ఎంపికైన వారి కుటుంబ గాథóల్ని విని చలించిన ముఖ్యమంత్రి
- ఎంపికైన 5,757 మందికి నియామక పత్రాలు అందించిన సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
మంగళగిరి (చైతన్యరథం): శాంతిభద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, ప్రజా భద్రతకే కూటమి ప్రభుత్వ తొలి ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పోలీసుల గౌరవాన్ని పెంచే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని, ప్రజలకు రక్షణ ఇచ్చే బాధ్యత పోలీసులదన్నారు. మంగళగిరి ఏపీఎస్పీ 6 బెటాలియన్ పరేడ్ గ్రౌండ్‌లో మంగళవారం జరిగిన కానిస్టేబుళ్ల నియామక పత్రాల పంపిణీ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోం మంత్రి అనితతో కలిసి కానిస్టేబుళ్లుగా ఎంపికైన 5,757 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కొత్తగా విధుల్లో చేరినవారు నిబద్ధతతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
అలాగే శిక్షణలో ఉన్న కానిస్టేబుళ్లకు స్టైఫండ్ రూ.12,500కు పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు సభావేదికపై నుండి ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న రూ.4,500 నుంచి స్టైఫండ్ రూ.12,500 పెంచుతున్నామని.. సంక్రాంతి, క్రిస్మస్ పండుగలతో పాటు నియామక పండుగ కూడా అందరిలో సంతోషాన్ని నింపిందని సీఎం అన్నారు. గత ప్రభుత్వ అసమర్థ పాలనతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. రాష్ట్రాన్ని పునర్నిర్మించి, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాం. మీకు ఉద్యోగం వస్తే నాకు , మిత్రులు పవన్ కల్యాణ్‌కు మంచి పేరు వస్తుందని 31 కేసులు వేశారు. వాటిని అధిగమించాం. కోర్టు కేసులు పరిష్కరించి నియామక పత్రాలను అందించాం. 6100 మంది రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ ఇస్తే అందులో 6014 మంది సెలక్ట్ అయ్యారు. ఇందులో 5757 మంది ట్రైనింగ్‌కు ఎంపిక అయ్యారు. వీరిలో సివిల్ కానిస్టేబుళ్లుగా 3,343 మంది, ఏపీఎస్పీ కానిస్టేబుళ్లుగా 2,414 మంది ఎంపికయ్యారు. సివిల్‌లో మహిళా కానిస్టేబుళ్లు 993 మంది ఉన్నారు. మగవారికి ఏ విషయంలోనూ మహిళలు తీసి పోకూడదనే ఉద్దేశంతో గతంలోనే ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేశాను. ఆర్టీసీలో మహిళలను కండక్టర్లుగా నియమించాం. అలాగే ఉమ్మడి శ్రీకాకుళం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో 183 మంది ఆదివాసీ అభ్యర్థ్ధులు ఎంపిక కావడం గర్వంగా ఉందని సీఎం చంద్రబాబు అన్నారు.
పారదర్శకంగా కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియ
గత ప్రభుత్వం నిరుద్యోగ యువతను మభ్య పెట్టడానికి మొక్కుబడిగా నోటిఫికేషన్ ఇచ్చింది. కూటమి ప్రభుత్వం రికార్డ్ టైమ్‌లోనే పరీక్షలు, రిక్రూట్మెంట్ ప్రక్రియ నిర్వహించి 60 రోజుల్లోనే ఫలితాలు ప్రకటించింది. మొత్తం ప్రక్రియను అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా నిర్వహించాం. నియామకాల్లో టెక్నాలజీ సాయాన్ని తీసుకున్నాం. మానవ జోక్యం అనేది లేకుండా అన్ని ఫిజికల్ ఈవెంట్స్‌లో టెక్నాలజీని వినియోగించాం. డిజిటల్ మీటర్లతో ఎత్తు, ఛాతీ కొలతలు తీసుకున్నాం. లైవ్‌గా రికార్డ్ చేసి సర్వర్లలో భద్రపరిచాం. ఆర్‌ఎఫ్‌ఐడీ చిప్‌లతో 100 మీటర్లు, 1600 మీటర్ల పరుగులు, లాంగ్ జంప్ పరీక్షలు నిర్వహించాం. కానిస్టేబుళ్ల ఉద్యోగాలకు ఎంపికైన ఒక్కోక్కరిది ఒక్కో గాథó. వారికి విద్యను, విలువల్ని నేర్పిన వారి తల్లితండ్రులకు అభినందనలు తెలియచేస్తున్నాను. కానిస్టేబుల్‌గా ఎంపికైన గిరిజన యువకుడు బాబూరావు తన సొంత గ్రామానికి రహదారి వేయాలని సామాజిక హితం కోసం కోరారు.
దీనికి ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రియల్ టైమ్ లోనే అనుమతులను, నిధుల్ని మంజూరు చేయించారు. అల్లూరి జిల్లా జీకే వీధిలోని వెలుగురాతి బండ- తిమ్మల బండ గ్రామానికి రోడ్డు నిర్మించేందుకు రూ.3.90 కోట్లు మంజూరు చేయడం ప్రజా సంక్షేమం పట్ల కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని సీఎం చంద్రబాబు అన్నారు. ఉద్యోగాలు రావాలంటే ఎన్డీఏ రావాలని ప్రజలు ఆకాంక్షించి మమ్మల్ని గెలిపించారు. నేను ముఖ్యమంత్రిగా ఇప్పటివరకూ పోలీస్ శాఖలో 23,676 ఉద్యోగాలు ఇచ్చాను. రాష్ట్రంలో 58 వేల మంది కానిస్టేబుళ్లు ఉండగా వారిలో 24 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినందుకు గర్వ పడుతున్నాను. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాల కల్పనకు కట్టుబడి ఉన్నాం. ఇప్పటికే మెగా డీఎస్సీ ద్వారా 15,591 ఉద్యోగాలు ఇచ్చాం. అన్ని శాఖల్లో కలిపి 4 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. 18 నెలల పాలనలో రూ. 8.5 లక్షల పెట్టుబడులకు ఆమోదం ఇచ్చాం. విశాఖలో 538 ఎంఓయూలు చేస్తే రూ.11.38 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. 735 పరిశ్రమలు, రూ.19 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు.
నేరాల నియంత్రణకు పీపీపీ విధానం
పోలీసింగ్‌లో ప్రిడిక్షన్, ప్రివెన్షన్, ప్రొటెక్షన్ విధానాన్ని అవలంబించాలి. రాజకీయ ముసుగులో నేరాలు చేసే వారి పట్ల పోలీసులు అప్రమత్తంగా ఉండాలి. కూటమి ప్రభుత్వం వచ్చాక సమర్థవంతమైన పోలీస్ వ్యవస్థకు శ్రీకారం చుట్టాం. విజిబుల్ పోలీసింగ్ ` ఇన్విజిబుల్ పోలీస్ విధానంతో ముందుకు వెళుతున్నాం. నేరాల నియంత్రణలో పోలీసులు టెక్నాలజీని వాడాలి. అప్పుడే క్రిమినల్స్ ఆటలు కట్టించవచ్చు. నేరాలను తగ్గించేందుకు అవసరమైన ప్రణాళికలు అమలు చేయాలి. ముందు జాగ్రత్తల ద్వారా, అప్రమత్తత ద్వారా నేరాలను తగ్గించవచ్చు. డేటా, టెక్నాలజీ ద్వారా నేరాలను నియంత్రించే అవకాశం రావాలి. నేరం జరిగిన వెంటనే మీరు వేగంగా స్పందించాలి. ఒకప్పుడు నేరస్తులు రాజకీయాల్లో ఉండేవారు కాదు. నేడు రాజకీయ ముసుగులో నేరాలు చేసే వాళ్లు తయారు అయ్యారు. రాష్ట్రంలో లేడీ డాన్లను కూడా చూసే పరిస్థితి వచ్చింది. గత పాలనలో శాంతిభద్రతలు ఎంతగా దిగజారాయో ఇది ప్రత్యక్ష ఉదాహరణ. వివేకా హత్య కేసులో నాపై ఆరోపణలు చేశారు. గుండె పోటు అని చెప్పి ముఖ్యమంత్రిగా నన్నే ఏమార్చారు. గదిలో రక్తపు మరకలు కడిగించినా అప్పటి సీఐ ఉన్నతాధికారులకు చెప్పలేదు. కానీ సీబీఐ తన దర్యాప్తులో గూగుల్ టేకవుట్ వంటి సాంకేతిక విధానాలను వినియోగించడం ద్వారా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అలాగే పాస్టర్ ప్రవీణ్ మృతిలో సీసీ కెమేరాల ఆధారాలు లేకపోయి ఉంటే హత్య అని చెప్పి ప్రభుత్వంపై నెపం వేసేవారని సీఎం అన్నారు.
ప్రాణాపాయం వచ్చినా విధినిర్వహణలో వెరవలేదు
శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాం. సమైక్యాంధ్రలో ముఖ్యమంత్రిగా ఫ్యాక్షనిజం, రౌడీయిజం, నక్సలిజం అణిచివేశాం. మత కలహాలను అరికట్టాం. ప్రజలకు నష్టం కలిగించే వారిని ఉపేక్షించలేదు. నాడు తిరుమల వేంకటేశ్వరుని సేవలో పాల్గొనేందుకు వెళ్తుంటే నన్ను అంతమొందించేందుకు 23 క్లైమోర్ మైన్స్‌ను నక్సలైట్లు పేల్చారు. స్వామి వారే నన్ను కాపాడారు. ప్రాణాపాయ సమయంలోనూ ముఖ్యమంత్రిగా నా విధి నిర్వహణ మరువలేదు. నా భద్రత కంటే దోషుల్ని పట్టుకోవటం ముఖ్యమని ఎస్పీకి ఆదేశాలు ఇచ్చాను. ఎన్టీఏ ప్రభుత్వం వచ్చాక నేరాలు అదుపులోకి వచ్చాయి. గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాం. సైబర్ క్రైమ్, ఆర్థిక నేరాలు, డ్రగ్ మాఫియా, మహిళలపై అఘాయిత్యాలను పూర్తిగా అరికట్టాలి. ప్రజలకు, వారి ఆస్తులకు భద్రత ఉందంటే అందుకు పోలీసులు రక్షణగా ఉండటమే కారణం. పోలీసులు పూర్తి స్వేచ్ఛతో పని చేసి రాష్ట్రాన్ని ఒక రోల్ మోడల్‌గా నిలబెట్టాలి. అలాగే హోంశాఖను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్న వంగలపూడి అనితను అభినందిస్తున్నాను. 18 నెలల్లో చరిత్ర సృష్టించాం. సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేశాం. 2047 స్వర్ణాంధ్ర సాధన లక్ష్యంగా సుపరిపాలన అందిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.
అంతకుముందు సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ర్యాంపులపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోం మంత్రి అనితతో కలిసి సీఎం నూతనంగా ఎంపికైన కానిస్టేబుళ్ల చెంతకు వెళ్ళి వారికి అభివాదం తెలియచేశారు. నియామక ప్రక్రియలో టాపర్లుగా నిలిచిన వారికి శాలువా కప్పి నియామక పత్రాన్ని, రాజ్యాంగ ప్రతిని ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి అందించారు. సభావేదికపై టాపర్లుగా నిలిచిన వారి కుటుంబ పరిస్థితుల దృశ్యమాలికను వీక్షించిన ముఖ్యమంత్రి చలించి పోయారు. వారు ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు.











