- గత ఐదేళ్లలో దారుణంగా రాజ్యాంగ ఉల్లంఘనలు
- వాక్‌స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛపై యువగళం పాదయాత్రలో గళమెత్తాను
- వచ్చే విద్యాసంవత్సరం నుండి పిల్లలకు బాలల రాజ్యాంగం పుస్తకాలు
- స్ఫూర్తి ప్రదాతల చరిత్రను కూడా పొందుపరుస్తాం
- రాజ్యాంగంపై ప్రజల్లో చైతన్యం తేవాలి
అమరావతి (చైతన్యరథం): మన ప్రజాస్వామ్మ బలం మన రాజ్యాంగమేనని, అయితే రాష్ట్రంలో గత పాలకులు రాజ్యాంగానికి విరుద్ధంగా పాలన సాగించారని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తప్పుబట్టారు. రాజ్యాంగ నిబంధనలకు ఉల్లంఘించి గత పాలకులు విధించిన అనేక అంక్షల మధ్య పాదయాత్ర సాగించి గత ఐదేళ్లలో రాజ్యాంగం విలువ తెలుసుకున్న మొదటి వ్యక్తిని తానేనన్నారు. 75వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతిలోని సచివాలయంలో మండళవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ…పాదయాత్రలో ఎప్పుడు తన చేతిలో ఒక పుస్తకం ఉంచుకుని, అడ్డగోలు ఆంక్షలకు సంబంధించి అధికారులతో మాట్లాడేటపుడు కొన్ని అంశాలను నోట్ చేసుకున్నానన్నారు. ఆర్టికల్ 19 ప్రకారం వాక్‌స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛపై అప్పట్లో గళమెత్తానని పేర్కొన్నారు. నేను పాదయాత్ర చేసేటప్పుడు నాటి పాలకులు, అధికారులు రాజ్యాంగ నిబంధనలను పాటించలేదు.
నాతోపాటు అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబును సైతం ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు. దాని ఫలితంగా గత ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉంది. ఈ సందర్భంగా విద్యా శాఖ మంత్రిగా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. వచ్చే విద్యా సంవత్సరం నుండి పిల్లలకు కాన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫర్ చిల్డ్రన్ అనే పేరుతో ప్రాథమిక హక్కులు, ఇతర అంశాలు, స్వాతంత్య్ర సమర యోధుల చరిత్ర తెలిసే విధంగా బాలల రాజ్యాంగ పుస్తకాలు రూపొందించి అందించాలని నిర్ణయించాం. రాజ్యాంగంలో ఏమి రాశారనే అంశంపై ప్రజాచైతన్యం అవసరం. లేకపోతే సమాజం నష్టపోతుంది. ప్రిన్సిపల్ జస్టిస్, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి అంశాల గురించి అందరూ తెలుసుకోవాల్సి ఉంది. రాజ్యాంగంపై చైతన్యం కలిగించేందుకు స్కూలు పిల్లలకు ఇంటరాక్టివ్ యాక్టివిటీస్, పజిల్స్, క్విజ్ వంటివి పెట్టాలని నిర్ణయించాం. దేశానికి రోల్ మోడల్స్ అయిన మహాత్మాగాంధీ, నెహ్రూ, అంబేద్కర్, సర్దార్ పటేల్, మౌలానా అజాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి మహనీయుల జీవిత చరిత్రకు పిల్లలకు అందించే బాలల రాజ్యాంగ పుస్తకంలో పొందుపరుస్తామని మంత్రి లోకేష్ తెలిపారు.
ప్రముఖులతో కమిటీ
న్యాయ నిపుణులు, విద్యావేత్తలు, పాలసీ మేకర్స్, ప్రజాప్రతినిధులు, చైల్డ్ రైట్ ఆర్గనైజేషన్ ప్రతినిధులతో కమిటీ వేసి, వారి సూచనల మేరకు బుక్ రూపొందించాలని నిర్ణయించాం. ఈ పుస్తకాన్ని స్కూల్ కరిక్యులమ్‌లో భాగం చేస్తాం. టీచర్లకు అవసరమైన శిక్షణ ఇస్తాం. అంతేకాకుండా ఈ పుస్తకాలు పెద్దఎత్తున లైబ్రరీలకు పంపిణీ చేయాలని నిర్ణయించాం. రాజ్యాంగం అందరికీ సమానంగా అమలు కావాలి. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో రాజ్యాంగాన్ని సరిగా అమలుచేయక పోవడంవల్ల ప్రజలంతా నష్టపోయారు, అందులో మేము కూడా ఉన్నాం. అధికారులు రాజ్యాంగాన్ని అందరికీ సమానంగా అమలుచేయాలని కోరుకుంటున్నాను. రాబోయే ఐదేళ్లలో ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ తేవాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని కష్టపడుతున్నాం. రాజ్యాంగంలో ప్రజల కోసం అని ఉంది, నేను మాత్రం పిల్లల కోసం అనే దాన్ని బలంగా నమ్ముతాను. పిల్లలే మన భవిష్యత్తు, పిల్లలే మన సంపద, రాబోయే రోజుల్లో భారతదేశం నెం.1గా ఎదగడం బాలలపైనే ఆధారపడి ఉందని మంత్రి లోకేష్ అన్నారు.
ప్రశ్నించే ధైర్యాన్నిచ్చిన రాజ్యాంగం
ఎంతో మంది త్యాగాల ఫలితం స్వాతంత్య్రం. కానీ ప్రజలకు నిజమైన స్వాతంత్య్రం వచ్చింది మాత్రం నవంబర్ 26, 1950నే. రాజ్యాంగం అమలు అయిన తరువాతే అందరూ సమానం అనే భావన వచ్చింది, మాట్లాడే హక్కు వచ్చింది, ప్రశ్నించే ధైర్యం ఇచ్చింది. స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం అందించింది రాజ్యాంగం. మనతో పాటు అనేక దేశాలు స్వాతంత్య్రం సాధించుకున్నా అభివృద్ధి చెందలేదు, సంక్షోభంలోకి వెళ్లిపోయాయి. కానీ మనం సూపర్ పవర్‌గా ఎదుగుతున్నాం. అది మన రాజ్యాంగానికి ఉన్న గొప్పతనం. అనేక కులాలు, భాషలు, ప్రాంతాలతో కూడిన దేశంలో ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నా మనం నిలబడ్డాం. అది మన రాజ్యాంగం సత్తా. ఈ సందర్భంగా రాజ్యాంగ రూపకర్తలను మనం స్మరించుకోవాలి. రాజ్యాంగం ముసాయిదా కమిటీ అధ్యక్షుడిగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చేసిన కృషి ఒక చరిత్ర. సామాన్య దళిత కుటుంబంలో పుట్టి దేశానికి స్వేచ్ఛ, ప్రజలకు ప్రాథమిక హక్కులు, రక్షణ కల్పించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్. రాజ్యాంగం దుర్వినియోగం అయ్యిందని తెలిస్తే దానిని కాల్చే మొదటి వ్యక్తిని నేనే అని ధైర్యంగా చెప్పిన వ్యక్తి అంబేద్కర్. మన ప్రజాస్వామ్యం బలం మన రాజ్యాంగం. ప్రపంచంలోనే ఉత్తమ రాజ్యాంగం మనది. దీని వెనుక ఎంతో మంది కృషి ఉందని మంత్రి లోకేష్ చెప్పారు.
రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు
అంతకు ముందు మంత్రి లోకేష్ ఒక ప్రకటనలో ప్రజలందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం ఉన్న మనదేశంలో భిన్నత్వంలో ఏకత్వం, ప్రజల హక్కుల పరిరక్షణ, ప్రజాస్వామ్యస్ఫూర్తిని కాపాడడంలో భారత రాజ్యాంగందే కీలక పాత్ర అన్నారు. రాజ్యాంగం అమలులోకి వచ్చి 75వ వసంతంలోకి అడుగు పెడుతున్న శుభసందర్భంలో రాజ్యాంగ నిర్మాతలైన బీఆర్ అంబేద్కర్, న్యాయ కోవిదులు, రాజ్యాంగ నిపుణులు, స్వాతంత్ర సమరయోధుల సేవలను స్మరించుకోవడం మన కర్తవ్యవ అని పేర్కొన్నారు.
“