- సుప్రీంకోర్టు ఆదేశాలను సీఎం చంద్రబాబు సహా, టీడీపీ మొత్తం స్వాగతిస్తోంది
- సీఎం చంద్రబాబు వేసిన సిట్‌ను సుప్రీంకోర్టు మరింత బలోపేతం చేసింది
- జగన్ రెడ్డి, వైసీపీ నేతలు పెద్ద ఆషాఢభూతులు
- అబద్దాలను అనర్ఘళంగా మాట్లాడగలరు
- టీడీపీ పొటిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజం
అమరావతి(చైతన్యరథం): జగన్ రెడ్డి, వైసీపీ నేతలు పెద్ద అషాఢభూతులని, వీరు అబద్ధాలను అనర్ఘళంగా మాట్ల్లాడగలరని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మండిపడ్డారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో వర్ల మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పును సీఎం చంద్రబాబు, టీడీపీ స్వాగతిస్తోందన్నారు. తిరుమల లడ్డూ కల్తీ విషయంపై దర్యాప్తునకు సీఎం చంద్రబాబు నియమించిన సిట్‌ను సుప్రీంకోర్టు తీర్పు మరింత బలోపేతం చేసిందన్నారు. సుప్రీం కోర్టు తీర్పు వైసీపీకి ఆ పార్టీ నేతలకు ‘భస్మాసుర హస్తమే’ అన్నారు. జగన్, ఆయన బ్యాచ్ విదేశాలకు పారిపోకుండా వెంటనే వారి పాస్ పోర్టులను సిట్ అధికారులు స్వాధీనం చేసుకోవాలని వర్ల డిమాండ్ చేశారు.
పదేపదే చెబితే అబద్ధం నిజమవుతుందా..
నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందని టీటీడీ ఈఓ విలేకరుల సమావేశంలో స్పష్టంగా చెప్పినా.. జగన్ రెడ్డి మాత్రం లేదని అబద్ధాలు చెబుతున్నాడు. జగన్ రెడ్డి సోదరుడి వరుసయ్యే వ్యక్తికి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కూతురికి పెళ్లి జరిగింది. అప్పుడు జగన్‌కు భూమన మామ కాక మరేమవుతాడు. జగన్ రెడ్డికి బంధుత్వాలు కూడా తెలియవనుకోవాలా? పదిమందితో పదే పదే ఒక అబద్ధం చెప్పిస్తే అది నిజం అవుతుందా? చేసినవన్నీ చేసి..మళ్లీ దేవుడంటే సీఎం చంద్రబాబుకు భయంలేదని జగన్ రెడ్డి మాట్లాడటం సిగ్గుచేటు. డిక్లరేషన్ ఇచ్చి తిరుమలకు వెళ్లడానికి భయపడిన జగన్ రెడ్డి.. సీఎం చంద్రబాబు గురించి మాట్లాడటం హాస్యాస్పదం. ప్రతి బ్రహ్మోత్సవాల్లో చంద్రబాబు పాల్గొని సతీసమేతంగా తిరుమల స్వామివారికి నూతన వస్త్రాలు సమర్పిస్తారు. జగన్ రెడ్డి ఏనాడైనా బ్రహ్మోత్సవాలకు సతీసమేతంగా వెళ్లారా? జగన్ రెడ్డి పెద్ద అబద్ధాల పుట్ట. దేవుళ్లను చంద్రబాబు రాజకీయాలకు వాడుకుంటున్నారని మాట్లాడటం కంటే నీచం మరొకటి లేదని వర్ల మండిపడ్డారు.
దేవుళ్లను రాజకీయాల్లోకి లాగిందెవరు?
అసలు దేవుళ్లను రాజకీయాల్లోకి లాగిందే జగన్ రెడ్డి. నాడు పింక్ డైమండ్ దోచుకున్నారని ఆరోపణలు చేసింది, ఆర్టీసీ బస్సు టిక్కెట్ల మీద ఏసుక్రీస్తు బొమ్మ వేయించింది కూడా జగన్ రెడ్డే? టీటీడీ బోర్డును కళంకితం చేసింది వైసీపీ నేతలే? క్రైస్తవ మతాన్ని ఆచరించే వ్యక్తిని టీటీడీ బోర్డు చైర్మన్‌గా చేసింది జగన్ రెడ్డి కాదా? శ్రీవాణి ట్రస్ట్ పేరుతో కోట్లను దోచుకుంది వైసీపీ నేతలు కాదా? వైసీపీ హయాంలో రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం తల నరికితే. జగన్ రెడ్డి పట్టించుకోలేదు. అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు వెళ్లాలనుకుంటే అడ్డుకున్నారు. నాలుగు గోడల మధ్య క్రైస్తవుడిగా… బయటకి వస్తే హైందవుడిగా జగన్ రెడ్డి నటిస్తున్నాడు. బొట్టు పెడితే హైందవుడు కాలేడు. ఆ మతాలను త్రికరణ శుద్ధిగా ఆచరిస్తేనే హైందవుడైనా.. క్రైస్తవుడైనా అయ్యేది. జగన్ రెడ్డి ఏమైనా అటూఇటూ కాని వ్యక్తా అని వర్ల దుయ్యబట్టారు.
దొరికిపోతామనే వైసీపీ ఉలికిపాటు
సుప్రీంకోర్టు ఎక్కడా సీఎం చంద్రబాబును తప్పు పట్టలేదు. అక్రమాలను బయట పెట్టాలనే చెప్పింది. ఏఆర్ ఫుడ్స్‌కు ఆరు టన్నుల నెయ్యి మాత్రమే నిల్వ చేసే అవకాశం ఉంది.. మరి మిగిలిన 16 టన్నుల నెయ్యిని ఎక్కడ నుండి తీసుకువచ్చారు? బిల్లులు, ట్రాన్స్‌పోర్ట్ అంతా మోసమే. చెన్నైలో బయలుదేరి తిరుపతి రావడానికి తొమ్మిదిరోజులు పడుతుందా? చెన్నైనుండి కలకత్తా వెళ్లడానికి కూడా మూడు రోజులే పడుతుంది. వైసీపీ నేతల అవినీతిని బయటకు తీసుకువచ్చి వారు దొంగలు అని తేల్చడానికే సీఎం చంద్రబాబు సిట్ వేశారు. ఆ సిట్‌కు ఇద్దరు సీబీఐ అధికారులు, ఇద్దరు రాష్ట్ర అధికారులు, ఒక ఫుడ్ సేఫ్టీ అధికారిని జోడిరచి దానిని సుప్రీంకోర్టు ఇంకా బలోపేతం చేసింది. ఈ దెబ్బతో దొంగల బండారం బయట పడుతుంది. అందుకే వైసీపీ నేతలు ఉలిక్కి పడుతున్నారని వర్ల అన్నారు.
మొత్తం బయటకొస్తాయి
సుప్రీంకోర్టు వేసిన సిట్‌తో తిరుమలలో ధర్మారెడ్డి, వైసీపీ నేతలు సుబ్బారెడ్డి, రోజా, తదితర నేతలు కొట్టేసిన వాటాలు, వారి అక్రమాలన్నీ బయటకు వస్తాయి. భస్మాసుర హస్తాన్ని వైసీపీ నేతలే తెచ్చి నెత్తిన పెట్టుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో జగన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి, రోజారెడ్డి ఇక జైలుకెళ్లటం ఖాయం. రఘురామకృష్ణరాజును కస్టడీలో హింసించిన రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ కోసం లక్షల్లో ఫీజులు చెల్లించి అభిషేక్ మను, సిద్ధార్థ దవే లాంటి పెద్ద న్యాయవాదులతో సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తున్నారంటే దీని వెనుక జగన్ రెడ్డి హస్తం ఉన్న విషయం స్పష్టంగా తెలియటం లేదా అని వర్ల రామయ్య ప్రశ్నించారు.