అమరావతి: టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు, పార్టీ శాసన సభాపక్ష ఉపనేత కింజరాపు అచ్చెన్నాయుడు, తెలుగు దేశంపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ నేతృత్వంలో తెలుగుదేశం శాసనసభాపక్షం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ అధికార పక్షానికి ముచ్చెమటలు పోయిస్తున్నారు. టిడిపి సభ్యులు ఎప్పుడు ఏరూపంలో ప్రజాసమస్యలపై ఆందోళనచేపడతారు. అసెంబ్లీ సాక్షిగా ఎప్పుడు నిలదీస్తారోనన్న భయంతో పాలకపక్షం వణికిపోతోంది. అసెంబ్లీలో వరుసగా రెండోరోజు శుక్రవారం జగన్‌రెడ్డి ప్రభుత్వ బాదుడేబాదుడుపై టిడిపి సభ్యులు చేపట్టిన ఆందోళనతో సభ దద్దరిల్లింది. ప్రశ్నోత్తరాల సమయాన్ని అడ్డగించి స్పీకర్ పోడియం ను ముట్టడిరచారు. దీంతో స్పీకర్ తమ్మినేని టిడిపి సభ్యులను ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు. అసెంబ్లీ లో బాదుడేబాదుడు అంటూ టీడీపీ సభ్యుల నినాదాలు మధ్యే బిల్లుల అధికారపార్టీ బిల్లులను ఆమోదించుకుంది. మధ్యాహ్నం 11.40గంటల ప్రాంతంలో అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులను ఒక రోజు సస్పెండ్ చేశారు. మీకు రోజూ ఇదో ఆటగా మారింది.. ఫుల్ దెమ్ అవుట్ అంటూ స్పీకర్ తమ్మి నేని మార్షల్స్‌ను ఆదేశించారు. టీడీపీ సభ్యుల సస్పెన్షన్? సమయంలో స్పీకర్ తడబడ్డారు. సస్పెన్షన్ లిస్టులో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పేరుచేర్చి నాలుక కరుచుకొని బాలకృష్ణ సభలో లేరని తెలిసి సరి చేసుకున్నారు.
కడప స్టీల్ ప్లాంట్ ఏమైంది?: అచ్చెన్నాయుడు
ప్రశ్నోత్తరాల సమయంలో కడప స్టీల్ ప్లాంట్ గురించి టీడీపీ నేత అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. విభజన చట్టంలో స్పష్టం గా హామీ ఇచ్చారని గుర్తుచేశారు, దాని పురోగతి ఏమిటని ప్రశ్నిం చారు. రాష్ట్రంలో ఒక్క కొత్త పరిశ్రమ కూడా రాలేదు, కడప స్టీల్ ప్లాంట్ కేంద్రాన్ని ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. పారిశ్రామికాభి వృద్ధిపై ప్రభుత్వం దృష్టిసారించడం లేదు. కడప స్టీల్ ప్లాంట్ మూడేళ్లు అవుతున్నా ఒక్క అడుగు ముందుకు పడలేదని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేస్తున్నా అధికారపార్టీ మాట్లాడటం లేదని దుయ్యబట్టారు.
మండలిలో లోకేష్ ఆగ్రహం
మండలిలో అధికార-ప్రతిపక్ష నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. వ్యవసాయంపై చర్చ సమయంలో చంద్రబాబు వ్యవసాయం దండగ అన్నారని వైసీపీ సభ్యులు వ్యాఖ్యానించడంతో టీడీపీ ఎమ్మెల్సీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. దమ్ముంటే ఆ మాట ఎక్కడ అన్నారో చూపించాలని లోకేశ్ సవాల్ విసిరారు. ఆధారాలు అంటే ఎక్కడ నుంచి తెస్తామంటూ వైసీపీ మంత్రులు టాపిక్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు. చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడలేదంటూ పలాయనం చిత్తగించారు. వైసీపీ వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ ఎమ్మెల్సీలు పోడియంను చుట్టుముట్టారు. వైసీపీ పాలనలో రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందంటూ నినాదాలు చేశారు. వైసీపీ..రైతు వ్యతిరేక ప్రభుత్వం అంటూ నిప్పులు చెరిగారు.