- క్రెడిట్ చోరీ అంటూ దొంగమాటలు, విషపు రాతలు
- క్రెడిట్ ఎవరిదో… క్రెడిబులిటీ ఎవరికుందో ప్రజలకు తెలుసు
- అభివృద్ధి ఆలోచనే చేయలేనివాళ్లు నేడు క్రెడిట్ కోసం పాకులాడుతున్నారు
- మూడు ముక్కలాటతో మూడు ప్రాంతాల్లోనూ దెబ్బతిన్నారు
- పొలిటికల్ రౌడీలు తయారయ్యారు
- రాజకీయ ముసుగులో నేరాలు చేస్తున్నారు
- పిన్నమ్మ తాళి తెంచినా కాపాడేవారిని ఏమనాలి?
- నాడు నా ఇంటిగేటుకు కట్టిన తాళ్లే… వాళ్ల పాలిట రాజకీయ ఉరితాళ్లు అయ్యాయి
- పల్నాడులో ఫ్యాక్షనిజం చేయనివ్వం… అణిచేస్తాం
- ఎన్టీఆర్ వర్థంతి సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి (చైతన్యరథం), రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి… ఇప్పుడు ఆ క్రెడిట్ దక్కించుకునేందుకు కొందరు తయారయ్యారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పుబట్టారు. ఆదివారం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత కొంత కాలంగా క్రెడిట్ చోరీ అంటూ చేస్తున్న విమర్శలకు గట్టిగా సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… రాజకీయాల్లో కొందరు కుట్రలు కుతంత్రాలు చేస్తూనే ఉంటారు.. వాటిని ఎదుర్కోవడానికి… దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి నేతలు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు. 18 నెలల్లో రకరకాల కుట్రలు పన్నారు. వైసీపీ పుట్టుకే ఫేక్..ఒక పార్టీ అవినీతి సొమ్ముతో పేపరు పెట్టుకుంది.. అటువంటి పార్టీతో పోరాడాల్సి రావడం మన దౌర్భాగ్యం. క్రెడిట్ చోరీ అని కొన్ని వార్తలు రాస్తున్నారు. అదే పనిగా దుష్ప్రచారం చేస్తున్నారు. కాకినాడలో ఏఎమ్ గ్రీన్ 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతోంది. అందులో తామే ఏదో వేసేశామని క్రెడిట్ దక్కించుకునే ప్రయత్నం చేయడమే కాకుండా… మనపై క్రెడిట్ చోరీ అని రాస్తున్నారు. ఇదే కాకుండా…. చాలా విషయాల్లో ఇలాగే వ్యవహరిస్తున్నారు. కియాతో సంబంధం లేకున్నా… ఆ పరిశ్రమను కూడా తామే తెచ్చామని గతంలో చెప్పుకున్నారు. ఇప్పుడు మళ్లీ అలాంటి బాగోతమే మొదలు పెట్టారు. భోగాపురం విమానశ్రయానికి 2,500 ఎకరాలు భూ సేకరణ మనమే చేశాం. ఎప్పుడో అయిపోవాల్సిన ప్రాజెక్టును 5 ఏళ్ల పాటు మూలన పడేశారు. మొదటిసారి సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం. దీన్ని కూడా తమ ఘనతగా చెప్పుకుంటున్నారు. మనం చేసిన పనులకు వాళ్లు క్రెడిట్ చోరీ చేస్తూ…. తిరిగి మన పైనే క్రెడిట్ చోరీ అని దుష్ప్రచారం చేస్తున్నారు. క్రెడిట్ చోరీ అని వాళ్లు గింజుకున్నా, సైబరాబాద్, కియా, గూగుల్, భోగాపురం, గ్రీన్ ఎనర్జీ వంటి వన్నీ తెలుగుదేశం పార్టీలో తెచ్చినవే. వాళ్లకు వేరే అంశాల్లో క్రెడిట్ ఉంది… శాండ్, వైన్, మైన్, డ్రగ్స్, గంజాయితో దోపిడీ… ఇదీ వాళ్ల క్రెడిట్, భూములను లాక్కోడవం వాళ్ల క్రెడిట్. ప్రజల ఆస్తులపై వాళ్ల ఫొటోలు వేసుకోవడం వాళ్ల క్రెడిట్, సర్వే రాళ్లపై రూ.700 కోట్లు ఖర్చు చేసి బొమ్మలు వేసుకోవడం వాళ్ల క్రెడిట్. ఉద్యోగులను ఇబ్బందులు పెట్టడం వాళ్ల క్రెడిట్. పిన్నమ్మ తాళ్లు తెంచిన నేరస్థులను కాపాడుతున్న పార్టీని ఏమనాలి? వారు కూడా మనల్ని విమర్శిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.
అమరావతిని నాశనం చేసి..మూడు ముక్కలాట
రాజధాని అమరావతిని శ్మశానం, ఏడారి అని మాట్లాడారు. 3 రాజధానుల పేరుతో మూడు ముక్కలాటాడారు. సీఎం ఎక్కడుంటే అదే రాజధాని అంట… ఈయన బెంగళూరులో ఉంటే బెంగళూరు రాజధాని… ఇడుపులపాయలో ఉంటే ఇడుపులపాయ రాజధానా? పార్టీ నడిపే వ్యక్తి ఇలాగేనా మాట్లాడేది? 5 ఏళ్ల పాటు రాజధాని అంటే ఏదో చెప్పుకోలేని పరిస్థితి ఉండేది. రాష్ట్ర ప్రజలు చాలా అవమానాలకు గురయ్యారు. 3 రాజధానులు అని చెప్పారు… 3 ప్రాంతాల్లో కూడా ఎన్డీయే అభ్యర్థులు అఖండ మెజారిటీతో గెలిచారు. ఏపీ రాజధాని అమరావతే అని గర్వంగా, కాలర్ ఎగరేసి చెప్పుకుండాం. దేవతల రాజధాని అమరావతి… ప్రజా రాజధాని అమరావతి. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం. విశాఖను నెంబర్ వన్ సిటీ చేస్తాం. తిరుపతి మెగా సిటీగా అవతరిస్తుంది. సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడితే పట్టుకొచ్చి బట్టలూదదీస్తాం. తప్పు చేస్తే వదిలిపెట్టం… మంచి చేస్తే ఎవరి జోలికి రాను, రాజకీయ ముసుగులో ఘోరాలు చేస్తే ఊరుకోబోనని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.
పల్నాడులో ఫ్యాక్షన్ రాజకీయాలు సహించం
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే ఫ్యాక్షన్ రాజకీయాలను టీడీపీ అంతం చేసింది. రాష్ట్రాన్ని మావోయిస్టులు ఇబ్బందులు పెట్టాలని చూస్తే రాజీ లేకుండా పని చేశాం. నాపై దాడి చేసినా భయపడలేదు… వెనకాడలేదు. రౌడీలు రోడ్డు మీదకు వస్తే రాష్ట్రంలో చోటు లేదని చెప్పాం. మత సామరస్యాన్ని కాపాడాం. మత విద్వేషాలు లేకుండా చేశాం. ఇప్పుడు రాష్ట్రంలో కొంతమంది పొలిటికల్ రౌడీలు తయారయ్యారు. నేరస్థులే రాజకీయ పార్టీలు నడుపుతున్నారు. బాబాయిని చంపి రాజకీయం చేసినట్టు… రాష్ట్రంలో నేరాలు చేయాలని చూస్తున్నారు. ప్రజలు ఒకసారే మోసపోతారు. ఇక్కడున్నది ఎన్డీయే ప్రభుత్వం… నడిపించేది సీబీఎన్. పల్నాడులో మొన్న ఒక గొడవ జరిగితే అక్కడ రెచ్చగొడుతున్నారు. గిల్లిగజ్జాలు పెట్టుకుంటే మర్యాదగా ఉండదు. నా దగ్గర తోక తిప్పలేరు. సీమలో ముఠాలను అంతం చేసిన పార్టీ టీడీపీ. పల్నాడులో కూడా పూర్తి ప్రక్షాళన చేసి హింస లేని శాంతియుత ప్రాంతంగా మార్చుతాం. నేను గతంలో పల్నాడు ప్రాంతానికి వెళ్తుంటే తాళ్లుకట్టినా ఇంటి గేట్లు మూశారు. ఆ తాళ్లే వారికి రాజకీయంగా ఉరితాళ్లు అవుతాయని చెప్పా. ఇప్పుడు అలాగే జరిగింది. కక్షతీర్చుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదు. తెలుగుజాతిని బాగు చేయడానికి వచ్చాను. నాడు ఎన్టీఆర్, నేడు నాది ఒకటే లక్ష్యం. తప్పుడు రాజకీయాలు కాదు… ప్రజా రాజకీయాలు చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.















