- డబుల్ ఎంట్రీలను వెంటనే తొలగించాలి
- నెల తరువాత కూడా ముసాయిదా జాబితాలో తప్పులున్నాయి
- సక్రమంగా వ్యవహరించేలా అధికారులకు ఆదేశాలివ్వాలి
- తుది జాబితాలో తప్పులు రాకుండా చర్యలు తీసుకోవాలి
అమరావతి: రాష్ట్రంలో అధికారపార్టీ ఇష్టానుసారం ఓట్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతోందని టీడీపీ అధినేత నారా చంద్ర బాబునాయుడు ఆరోపించారు. సరైన విచారణ లేకుండానే టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొల గిస్తున్నారన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి శుక్రవారం చంద్రబాబు లేఖ రాశారు. ఎలక్టోరల్ మాన్యువల్ `2023 ప్రకారం ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు జరగడం లేదని ఆ లేఖలో పేర్కొన్నారు. మాన్యువల్ ప్రకారం జనాభాపరమైన సారూప్య ఎంపికలు, ఫోటోగ్రాఫిక్ సారూప్య ఎంపికలు పరిశీలించి డబుల్ ఎంట్రీలను తొలగించాలి. కానీ, ఓటర్ల జాబితాలో అనేక నియోజక వర్గాలలో ఇప్పటికీ డబుల్ ఎంట్రీలు బయట పడుతూనే ఉన్నాయి. ఇంటింటి సర్వేలో బాగం గా బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్ఓ) గుర్తించిన మరణాల సమాచారం, రాష్ట్ర డేటా బేస్‌లోని జనన, మరణాల రిజిస్ట్రార్ సమాచారం మేరకు ఈఆర్ఓలు మరణించిన వారి ఓట్లు తొలగిం చాలి. కానీ, దురదృష్టవశాత్తు ముసాయిదా (డ్రాప్ట్) ఓటర్ లిస్టులో ఇప్పటికీ మరణించిన వారి ఓట్లు దర్శనమిస్తున్నాయి. రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్` 1960 ప్రకారం ఓట్లను ఇంటి నంబర్ల ప్రకారం క్రమంగా ఉండేలా చూడాలి.
కానీ నేటికీ దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అర్హత లేని వారికి సైతం ఫామ్ ` 6 ద్వారా ఆన్లైన్ లో ఇష్టానుసారంగా ఓట్లు నమోదు చేస్తున్నారు. అధికార పార్టీకి అనుకూలంగా ఇష్టానుసారం ప్రతిపక్షాల ఓట్లను తొలగిస్తున్నారు. వీటిపై టీడీపీ వ్యక్తం చేసిన అభ్యంతరాలపై నేటికి దృష్టిపెట్టలేదు. ఓట్లను తొలగించేందుకు ఉద్దేశించిన ఫామ్-7 ధరఖాస్తులను నేరుగా గానీ, ఆన్లైన్లో గానీ గంపగుత్తగా స్వీకరించరాదు. కానీ ఈ నిబంధనను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. అధికార వైసీపీ నేతలు గంపగుత్తగా ఫామ్-7 దరఖాస్తులు సమర్పిస్తున్నారు. ఓటుపై అభ్యంతరం లేవనెత్తి ఓట్లను తొలగించాలని కోరుతున్న వారు ఖచ్చితంగా ఆధారాలు చూపించాలి. కొన్ని నియోజకవర్గాలలో ఎటువంటి విచారణ చేయకుండా తెల్ల పేపర్‌పై పేర్లు రాసిస్తే ఓట్లను తొలగిస్తున్నారు.
నేటికీ ఈఆర్ఓలు ఓటర్లకు నోటీసులు జారీ చేస్తూ ఓటర్లను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఓట్లు మార్పులు, చేర్పులకు సంబంధించి ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. డ్రాప్ట్ ఓటర్ లిస్టు ప్రకటించి నెల గడుస్తున్నా పైన పేర్కొన అనేక అభ్యంతరాలపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. తుది జాబితాలో ఓట్ల అవకతవకలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. దీనికి సంబంధించి ఈఆర్ఓలకు, డీఈఓలకు నిర్ణీత సమయం లోగా తగు చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీచేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని చంద్రబాబు కోరారు.