చిలకలూరిపేట: రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం కూడా వదిలి పెట్టడం లేదని ప్రత్తిపాటి అన్నారు. చిలకలూరిపేటలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి రేషన్ బియ్యాన్ని అక్రమంగా ఇతర దేశాలకు తరలించి సొమ్ము చేసుకోవడం, రీసైకిలింగ్ చేసి అమ్ముకోవడం ద్వారా వేల కోట్ల కుంభకోణానికి తెరలేపారని దుయ్యబట్టారు.
పేదప్రజలు తినే బియ్యాన్ని కూడా వైసిపి నేతలు దోచుకోవడం దుర్మార్గమని అన్నారు. గతంలో 1.47 కోట్ల రేషన్ కార్డులు ఉంటే.. ప్రస్తుతం 1.44 కోట్లకు రేషన్ కార్డులను కుదించారు. వేల కోట్ల విలువైన రేషన్ బియ్యంను విదేశాలకు అక్రమ రవాణా చేస్తున్నారని అన్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రతి రేషన్ కార్డుకు బియ్యం, పంచదార, 2 కిలోల కందిపప్పు, గోధుమపిండి, రాగులు, జొన్నలు ,ఉప్పు మహిళలకు శానిటరీ ప్యాడ్స్ అందించడం జరిగింది. పేద ప్రజలు పండగపూట ప్రతి ఇంటా పిండివంటలు చేసుకోవాలని సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక అందించాం. ఇందుకోసం ఏటా 1000 కోట్ల విలువైన సరుకుల కిట్లను రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గరనుండి పండగకి సరుకుల కిట్లు లేవు, రేషన్ షాపుల సరుకులు లేవు, పేదలకు కేంద్రం ఇచ్చే బియ్యాన్ని కూడా పంపిణీ చేయడం లేదన్నారు. ఉచిత బియ్యాన్ని రాష్ట్రంలోని పేద ప్రజలందరికీ పంపిణీ చేయాలని పుల్లారావు డిమాండ్ చేశారు.