- ఓట్ల అక్రమాలకు సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి
- ఎన్నికల సంఘానికి శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ ఫిర్యాదు
అమరావతి: ఓట్ల అక్రమాలకు సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ)కి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ ఫిర్యాదు చేశారు. అదే విధంగా ఓటర్ల తుది జాబితాలో ఇంకా చాలా తప్పులున్నాయని, వాటిని సరిచేయాలని కోరారు. ఎలాంటి గుర్తింపు పత్రాలు లేకుండానే ఒక నియోజకవర్గంలో ఓట్లను వేరే నియోజకవర్గాలకు భారీ సంఖ్యలో బదిలీ చేస్తున్నారన్నారు. వీటిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఈఓకి షరీఫ్ బుధవారం విడివిడిగా లేఖలు రాశారు.
చిత్తూరు జిల్లా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రభాకర్ రెడ్డి, మంగళగిరి తహసిల్దార్‌గా గతంలో విధులు నిర్వహించిన జీవీ రాంప్రసాద్, భీమడోలు మండల బూత్ లెవల్ ఆఫీసర్లపై సీఈఓకి ఫిర్యాదు చేశారు. చిత్తూరు జిల్లాలో అధికార వైసీపీ ఎమ్మెల్యేల సూచనల మేరకు ఎటువంటి నిబధంనలు పాటించకుండా ఎంపీడీవోలకు సీఈఓ ప్రభాకర్ రెడ్డి పోస్టింగులు ఇచ్చారు. ఆయనపై చర్యలు తీసుకోవాలి. మంగళగిరి మాజీ తహసీల్దార్ జీవీ రాంప్రసాద్ డిప్యుటేషన్‌పై షరీఫ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయనను డిప్యుటేషన్‌పై టూరిజం డిపార్ట్ మెంట్‌కు బదిలీ చేస్తూ, రాష్ట్ర ఎన్నిలక ప్రధానాధికారి కార్యాలయంలో పనిచేసేలా ఉత్తర్వులు ఇచ్చారు.
రాంప్రసాద్ మంగళగిరిలో తహసీల్దార్‌గా విధులు నిర్వర్తించిన సమయంలో అధికార వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసిపోయి, వారు చెప్పినట్లుగా పనిచేశారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న అలాంటి ఆధికారిని సీఈఓ కార్యాలయంలో పనిచేసేలా బదిలీ చేయటం ఆక్షేపణీయం. ఎన్నికల సమయంలో ఆయన వైసీపీ నాయకులతో కుమ్మక్కై పనిచేసే అవకాశం ఉన్నందున ఆయన డిప్యుటేషన్‌పై పునరాలోచించి వేరే చోటుకు బదిలీ చేయాలి. తుది ఓటర్ జాబితాలో ఇంకా చాలా లోపాలు ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం వడ్లపట్ల గ్రామంలో టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించారు. కొందరి పేరు మీద రెండేసి ఓట్లు ఉన్నాయి. ఏలూరు రూరల్ మండలం కూచింపూడి గ్రామానికి చెందిన ఓటర్లను వడ్లపట్లలో ఓటర్లుగా నమోదు చేశారు.
పల్నాడు జిల్లాలో స్కూల్ పిల్లలను కూడా ఓటర్లుగా నమోదు చేశారు. కొందరికి రెండేసి నియోజకవర్గాల్లో ఓట్లు ఉన్నాయి. కర్నూలు జిల్లాలో అనేక ఓట్లు తారుమారయ్యాయి. పోలింగ్‌బూత్‌లను ఇష్టానుసారం మార్చేశారు. నంద్యాల జిల్లాలో నంద్యాల, పాణ్యం నియోజకవర్గాల్లో డబుల్ ఎంట్రీలు, మృతుల ఓట్లు, శాశ్వతంగా వలస వెళ్లిన వారి ఓట్లు ఇంకా పెద్ద సంఖ్యలో ఉన్నాయి.
చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల ఓట్లను భారీగా తొలిగించారు. పుంగనూరు నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలో ఫోటోలు గుర్తించలేని విధంగా ఉన్నాయి. ఎప్పుడో ఊరు వదిలి వెళ్లినవారి ఓట్లు కూడా ఇంకా జాబితాలో ఉన్నాయి. కుప్పం నియోజకవర్గంలోనూ డబుల్ ఎంట్రీలు చాలా ఉన్నాయి. శాంతిపురం గ్రామంలో అసలు ముస్లింలే లేనప్పటికీ 12వ నెంబర్ పోలింగ్ స్టేషన్‌లో సుల్తానా అనే ముస్తిం పేరుతో ఓటు నమోదు చేశారు.
ఎటువంటి గుర్తింపు పత్రాలు జత పరచకుండా విద్యుత్ బిల్లులను పెట్టి ఫాం-8 ద్వారా ఓట్లను వేరే నియోజకవర్గాల్లోకి మార్చుకుంటున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో విజయవాడ వెస్ట్, ఈస్ట్, పెనమలూరు, మజిలీపట్నం నియోజకవర్గాల్లో పెద్ద సంఖ్యలో ఓటర్లను ఇతర నియోజకవర్గాలకు మారుస్తున్నారు. తక్షణమే ఓటర్ జాబితాలను ప్రక్షాళన చేసి తప్పుల్ని సరిదిద్దాలని ప్రధాన ఎన్నికల అధికారికి షరీఫ్ విజ్ఞప్తి చేశారు.