- అభివృద్ధి బాధ్యత నాకు వదిలేయండి
- పరిశ్రమలు సాధించి యువతకు ఉపాధి
- వైఫల్య పాలనపై వైసీపీ ఏంచెప్తుంది?
- ఒక్క హామీనీ నెరవేర్చలేకపోయారు..
- తెదేపా పాలనలోనే అభివృద్ధి అంతా..
- కల్యాణదుర్గంపై యువనేత లోకేష్
కల్యాణదుర్గం (చైతన్యరథం): కల్యాణదుర్గం నియోజకవర్గం గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రూ.1200కోట్లు ఖర్చుపెట్టి అభివృద్ధి చేశాం. హనుమంతరాయ చౌదరి నేతృత్వంలో పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో కల్యాణదుర్గం విధ్వంసానికి గురైందని తెలుగుదేశం యువనేత నారా లోకేష్ అన్నారు. ఆదివారం నిర్వహించిన శంఖారావంలో నారా లోకేష్ మాట్లాడుతూ `కల్యాణదుర్గం సెగ్మెంట్‌కు తెదేపా హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. సీసీ రోడ్లు, బీటీ రోడ్లు వేశాం. పంతాయతీ, అంగన్‌వాడీ భవనాలు నిర్మించాం. సాగు, తాగునీటి ప్రాజెక్టులు చేపట్టాం. జీడిపల్లి-భైరవానితిప్ప ప్రాజెక్టు బ్రాంచ్ కెనాల్ పనులు ప్రారంభించాం. కల్యాణదుర్గం కోసం 50 పడకల ఆసుపత్రిని మంజూరు చేశాం. కల్యాణదుర్గం రోడ్డును పూర్తిచేసిందీ తెలుగుదేశం ప్రభుత్వమే అన్నారు.
అలాగే, మార్కెట్ యార్డ్ నిర్మించామని, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ నిర్మించామని, డిగ్రీ కాలేజీనీ తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదే అన్నారు. విద్యుత్ రంగం గురించి మాట్లాడుతూ `రైతులు ఆలోచించాలి. మీరు ఒక్క చిటికె వేస్తే ట్రాన్స్‌ఫార్మర్లు వెతుక్కుంటూ వచ్చేవి. 700 ట్రాన్స్‌ఫార్మర్లు తీసుకువచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది అన్నారు. గత ఎన్నికల్లో తన్నే దున్నపోతు ప్రభుత్వం వచ్చిందని, ఇక్కడ వైకాపా ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ ఏమైనా అభివృద్ధి సాధించారా? అని నిలదీశారు. పెద్దఎత్తున అవినీతికి పాల్పడ్డారని, చెరువులను కబ్జా చేశారని దుయ్యబట్టారు. ‘250 ఎకరాల్లో రిసార్ట్ కట్టారు. తెల్లకలర్ బంగ్లా కనిపిస్తోంది. ఆ బంగ్లా ఆ తల్లిది. మీ డబ్బు పెట్టి ఎలాంటి ఇల్లు కట్టుకుందో చూడండి’ అంటూ వైసీపీ ఎమ్మెల్యేపై తీవ్ర స్వరంతో ధ్వజమెత్తారు. సెంటు స్థలాల పేరుతో అవినీతికి పాల్పడారని, ఆమె కుటుంబ సభ్యులు కర్ణాటక మద్యం అమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తల్లి ఇక్కడ చెత్త అని తేల్చి పెనుకొండ పంపించారు వైసీపీ పెద్దలు.
మన ఇంట్లో చెత్త వేరే చోట బంగాంమవుతుందా? అని లోకేష్ ఎద్దేవా చేశారు. ఎంపీ తలారి రంగయ్య ఏనాడైనా రాష్ట్రం గురించి పార్లమెంట్‌లో మాట్లాడారా? అని నిలదీశారు. జిల్లా పరువు తీసేసిన ఎంపీ ఎవరూ? అంటే తలారి రంగయ్యనే చెప్పాలని, పార్లమెంట్‌లో ఒక్క మాటా మాట్లాడని వ్యక్తి.. కల్యాణదుర్గంలో ఒక్క ఓటైనా ఎలా అడుగుతారని ప్రశ్నించారు. జగన్ ఇచ్చిన హామీలపై నిలదీయాలని అడుగుతున్నా అంటూనే, ఎంపీగా పనికిరాని వ్యక్తి ఎమ్మెల్యేగా పనికివస్తాడా? ఇక్కడ ఎమ్మెల్యే వేరేచోట మంచివారు అవుతారా? అని లోకేష్ నిప్పులు చెరిగారు. టీడీపీ-జనసేన అభ్యర్థిని గెలిపిస్తే టమోట రైతులను ఆదుకుంటామని, జీడిపల్లి-బీటీపీ ప్రాజెక్టు బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గానికి పరిశ్రమలు తీసుకువచ్చి స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు.
జీడిపల్లి కెనాల్ నుంచి 114 చెరువులకు మొదటి రెండేళ్లలో నీరు అందిస్తామని, అంబేద్కర్ భవన్ నిర్మిస్తామన్నారు. భైరవానితిప్ప కెనాల్‌కు భూములిచ్చిన వారికి తగిన న్యాయం చేస్తామని, ప్రాజెక్టును కూడా యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. 2019 తర్వాత మన కార్యకర్తలపై అనేక కేసులు పెట్టారు. ఇక్కడ మన కార్యకర్తలను పోలీసులు చితకబాదే సమయంలో రికార్డ్ చేసి ఎమ్మెల్యేకు పంపిస్తే.. ఆమె నవ్వుకునే వారట? రెండు నెలలు ఓపిక పడితే వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. టీడీపీ -జనసేన- బిజెపి కార్యకర్తలు కలసికట్టుగా పనిచేసి రాబోయే ఎన్నికల్లో విజయదుందుభి మోగించాలని లోకేష్ పిలుపునిచ్చారు.