అమరావతి (చైతన్యరథం): ఈ నెల 14 నుంచి 17 వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే సూచనలతో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోందని విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తెలిపారు. విపత్తుల నిర్వహణ శాఖ నిరంతరం అప్రమత్తతగా ఉంటోందన్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్‌లు, హెల్ప్ లైన్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వర్ష సూచనలున్న జిల్లాల కలెక్టర్లకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరించారు. ఆగ్నేయ, నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాల కారణంగా ఈ నెల 14 నుంచి 17 వరకు కోస్తా, రాయలసీమలో భారీవర్షాలు, తీరం వెంబడి 40 నుండి 55 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు.
ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని హిందూ మహాసముద్రం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం పశ్చిమ వాయవ్య దిశగా కదిలి ఆదివారం మరింత విస్తరించింది. దీని ప్రభావంతో సోమవారం దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడిరచింది. ఇది క్రమేపీ పశ్చిమ వాయవ్య దిశగా ఏపీ దక్షిణ కోస్తా తీరం వైపు పయనించే అవకాశాలున్నాయని ఐఏండీ పేర్కొంది. దీని ప్రభావంతో విస్తారంగా వర్షాలు పడతాయని తెలిపింది.
ముఖ్యంగా, ఏపీ దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ నెల 14, 15, 16, 17 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వివరించింది. ఈ నెల 17న ఉత్తరాంధ్ర, యానాంలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో నెల్లూరు జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ ఆనంద్ దీనిపై స్పందించారు. నెల్లూరు జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు వెల్లడిరచారు. 0861-2331261, 7995576699, 1077 నెంబర్ల ద్వారా కంట్రోల్ రూమ్ ను సంప్రదించవచ్చని తెలిపారు. జిల్లాలోని డివిజన్లు, మండల కేంద్రాల్లోనూ కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయాలని ఆదేశించినట్టు వివరించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని కలెక్టర్ ఆనంద్ స్పష్టం చేశారు. భారీ వర్షాలతో వరదలు వచ్చే అవకాశం ఉన్నందున… రెవెన్యూ, నీటి పారుదల శాఖ అధికారులు పెన్నా నది గట్లను పరిశీలించాలని ఆదేశించారు. తీరప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.