విశాఖ: విశాఖ స్టీల్ ప్లాంట్ దేశ ఆర్థికాభివృద్ధికి సహాయపడుతోందని కేంద్ర పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి అన్నారు. విశాఖ పర్యటనకు వచ్చిన ఆయన.. గురువారం స్టీల్ ప్లాంటును పరిశీలించారు. అనంతరం ఆయన మాటాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్‌పై అనేక మంది ఆధారపడి ఉన్నారన్నారు. దీన్ని రక్షించడం తమ బాధ్యత అని తెలిపారు. ప్లాంట్ మూతపడుతుందనే ఆందోళన వద్దన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆశీస్సులతో వంద శాతం సామర్థ్యంతో ఉత్పత్తి జరుగుతుందని తెలిపారు. స్టీల్ ప్లాంట్ కు సంబంధించి అన్ని విషయాలు ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఉండదని స్పష్టంగా చెబుతున్నామన్నారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ అనుమతి తీసుకున్నాక అధికారిక నిర్ణయం ఉంటుందని తెలిపారు. కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. తనకు 2 నెలలు సమయమివ్వాలని కోరారు. మంత్రి వెంట కేంద్ర ఉక్కుశాఖ సహాయమంత్రి శ్రీనివాసవర్మ, విశాఖ ఎంపీ శ్రీభరత్, విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, తదితరులు ఉన్నారు.